ఇంట్లోనే హెయిర్‌ రిమూవర్‌!

వాంఛిత రోమాలను తొలగించటానికి ఎన్నో సౌందర్య సాధనాలు ఉన్నాయి. కానీ వీటి వల్ల ఫలితం తాత్కాలికమే! అన్‌వాంటెడ్‌ హెయిర్‌ రిమూవల్‌కు అత్యాధునిక సౌందర్య చికిత్సలూ లేకపోలేదు. కానీ వీటి వల్ల నూటికి నూరు శాతం ఫలితం పొందటమనేది అనుమానమే! అలాంటప్పుడు తక్కువ ఖర్చుతో శాశ్వతంగా అవాంఛిత రోమాల్ని తొలగించే వీలుంటే? అలాంటి చిట్కాలు బోలెడన్ని ఉన్నాయి. పాటించి చూడండి.

పచ్చి బొప్పాయి
పచ్చి బొప్పాయి తొక్కుతీసి మెత్తగా రుబ్బుకోవాలి. రెండు టేబుల్‌ స్పూన్ల బొప్పాయి గుజ్జులో అర టీస్పూను పసుపు కలిపి ఈ మిశ్రమంతో 15 నిమిషాలపాటు ఫేస్‌ మసాజ్‌ చేయాలి. తర్వాత నీళ్లతో కడిగేసుకోవాలి. ఇలా వారానికి ఒకటి లేదా రెండు సార్లు చేస్తుంటే ముఖం మీది అవాంఛిత రోమాలు తొలగిపోతాయి. 
పసుపు
1-2 టీ స్పూన్ల పసుపు తీసుకుని దాన్లో తగినన్ని నీళ్లు లేదా పాలు పోసి పేస్ట్‌లా కలుపుకోవాలి. ఈ పేస్ట్‌ను ముఖానికి పట్టించి 15 నిమిషాలాగి చల్ల నీళ్లతో కడిగేయాలి. ఈ చిట్కా ముఖంపై సన్నని వెంట్రుకలు ఉన్నవాళ్లకే పనిచేస్తుంది. ఒకవేళ వెంట్రుకలు మందంగా ఉంటే పసుపులో శనగపిండి, బియ్యంపిండి, దంచిన ఓట్లు కూడా కలుపుకుని అప్లై చేయాలి.
శనగపిండి
అర కప్పు శనగపిండిలో అరకప్పు పాలు, ఒక టీస్పూన్‌ పసుపు, తాజా మీగడ (పొడి చర్మ తత్వం ఉంటే)కలిపి ఈ పేస్ట్‌ను ముఖంపై వెంట్రుకలు పెరిగే దిశలో అప్లై చేయాలి. అరగంట ఆగి ముఖంపై పూర్తిగా ఆరిపోయిన మాస్క్‌ను వేళ్లతో హెయిర్‌ గ్రోత్‌కు వ్యతిరేక దిశలో రుద్దాలి. పేస్ట్‌ మరీ పొడిగా ఉంటే వేళ్లను కొంచెం తడి చేసుకోవచ్చు. ఎండిన పేస్ట్‌ అంతా తొలగిపోయాక చల్ల నీళ్లతో కడుక్కోవాలి. 
చక్కెర - నిమ్మరసం
రెండు టీస్పూన్ల చక్కెర, రెండు టీ స్పూన్ల తాజా నిమ్మరసం, నీళ్లు తీసుకుని చక్కెర కరిగేవరకూ కలిపి ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేయాలి. 15- 20 నిమిషాలాగి వేళ్లతో సున్నితంగా రుద్దుతూ కడిగేయాలి. ఇలా వారానికి 2 - 3 సార్లు చేస్తే ముఖం మీది రోమాలు తగ్గుముఖం పడతాయి.
ఎగ్‌ మాస్క్‌
ఒక గుడ్డు తెల్ల సొన, చక్కెర ఒక టేబుల్‌స్పూన్‌, మొక్కజొన్న పిండి 1/2 టేబుల్‌ స్పూను తీసుకుని మెత్తని పేస్ట్‌లా మారేవరకూ గిలక్కొట్టాలి. దీన్ని ముఖానికి అప్లై చేసి పూర్తిగా ఆరనివ్వాలి. ఇలా ఆరిన తర్వాత మాస్క్‌ ముఖ చర్మానికి అతుక్కుని ఉంటుంది. ఇప్పుడు ఈ మాస్క్‌ని ఎంతో జాగ్రత్తగా వేళ్లతో పీకేయాలి. ఇలా చేస్తున్నప్పుడు మాస్క్‌తోపాటు వెంట్రుకలు కూడా ఊడివస్తాయి.
తెల్ల మిరియాలు - కర్పూరం
ఈ రెండు పదార్థాలు మంట పుట్టించేవే! ఘాటుగా ఉంటాయి కాబట్టి వీటితో తయారుచేసిన మాస్క్‌ను కాళ్లపై ఉండే అవాంఛిత రోమాలను తొలగించడానికే ఉపయోగించాలి.
2 టేబుల్‌ స్పూన్ల తెల్ల మిరియాలు (పొడి చేసుకోవాలి), 2 టీస్పూన్ల కర్పూరం, బాదం నూనె కొన్ని చుక్కలు కలిపి మెత్తని పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. కాళ్లకు అప్లై చేసి 10-15 నిమిషాలాగి కడిగేసుకోవాలి. ఇలా కడుగుతున్నప్పుడు జాగ్రత్తగా గమనిస్తే వెంట్రుకలు ఊడిపోతూ కనిపిస్తాయి. 
బంగాళాదుంప - కందిపప్పు
ఒక బంగాళాదుంప రసం ఒక కప్పు, కందిపప్పు ఒక కప్పు, తేనె ఒక టీస్పూను, నిమ్మరసం 4 టీస్పూన్లు. ఒక రాత్రంతా కందిపప్పును నానబెట్టి ఉదయాన్నే మెత్తగా రుబ్బుకోవాలి. దీన్లో బంగాళాదుంప రసం, తేనె, నిమ్మరసం వేసి బాగా కలిపి ముఖం, కాళ్లు, చేతులకు అప్లై చేయాలి. పూర్తిగా ఆరేవరకూ 20 నిమిషాలపాటు ఆగాలి. పూర్తిగా ఆరాక చేతి వేళ్లతో రుద్దుతూ పేస్ట్‌ను వదిలించాలి. ఈ పొడి రాలేటప్పుడు దాంతోపాటు అవాంఛిత రోమాలు కూడా రాలిపోతాయి. 

©2018 APWebNews.com. All Rights Reserved.