ఎట్టకేలకు గెలిచిన ముంబై ...!

ఐపీఎల్ 2018 సీజన్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబయి ఇండియన్స్ మళ్లీ పుంజుకుంది. చెన్నై సూపర్ కింగ్స్‌తో శనివారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ (56 నాటౌట్ : 33 బంతుల్లో 6x4, 2x6), ఓపెనర్ ఎవిన్ లావిస్ (47: 43 బంతుల్లో 3x4, 2x6) కీలక ఇన్నింగ్స్ ఆడటంతో ముంబయి ఇండియన్స్ 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. చివర్లో ముంబయి విజయానికి 12 బంతుల్లో 22 పరుగులు చేయాల్సి ఉన్న దశలో బౌలింగ్‌కి వచ్చిన శార్ధూల్ ఠాకూర్ ఓవర్‌లో వరుసగా 4, 4, 4, 0, 4 బాదేసిన రోహిత్ శర్మ చెన్నైకి మ్యాచ్‌ని దూరం చేసేశాడు. టోర్నీలో రెండు వరుస ఓటముల తర్వాత మళ్లీ ముంబయి గెలవగా.. మూడు వరుస విజయాల అనంతరం చెన్నై ఓడింది. టోర్నీ తొలి మ్యాచ్‌లోనే ముంబయిని ఆఖరి ఓవర్‌లో చెన్నై ఓడించిన విషయం తెలిసిందే. చెన్నై సొంతగడ్డ (కావేరి జల వివాదం, ఆందోళనల కారణంగా చెపాక్‌ నుంచి మార్చారు) పుణెలో ధోనీ సేనకి ఇదే తొలి ఓటమి. తొలుత చెన్నై జట్టు సురేశ్ రైనా (75 నాటౌట్: 47 బంతుల్లో 6x4, 4x6), అంబటి రాయుడు (46: 35 బంతుల్లో 2x4, 4x6) దూకుడుగా ఆడటంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. అనంతరం ఛేదనలో సూర్యకుమార్ యాదవ్ (44: 34 బంతుల్లో 5x4, 1x6), ఎవిన్ లావిస్ తొలి వికెట్‌కి 69 పరుగుల భాగస్వామ్యంతో ముంబయికి శుభారంభమివ్వగా.. చివర్లో హార్దిక్ పాండ్య (16 నాటౌట్: 8 బంతుల్లో 1x6, 1x6)తో కలిసి కెప్టెన్ రోహిత్ శర్మ మరో రెండు బంతులు మిగిలి ఉండగానే 173/2తో గెలుపు లాంఛనాన్ని పూర్తిచేశాడు. 

తాజా వార్తలు

©2019 APWebNews.com. All Rights Reserved.