బెంగళూరుని ఒంటిచేత్తో గెలిపించిన డివిలియర్స్..!

ఐపీఎల్ 2018 సీజన్‌లో ఎట్టకేలకి మళ్లీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు విజయాన్ని అందుకుంది. ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో శనివారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో హిట్టర్ ఏబీ డివిలియర్స్ (90 నాటౌట్: 39 బంతుల్లో 10x4, 5x6) సంచలన ఇన్నింగ్స్ ఆడటంతో బెంగళూరు జట్టు 6 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. 

అంతకముందు రిషబ్ పంత్ (85: 48 బంతుల్లో 6x4, 7x6), శ్రేయాస్ అయ్యర్ (52: 31 బంతుల్లో 4x4, 3x6) అర్ధశతకాలు బాదడంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ డేర్‌డెవిల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. ఛేదనలో ఓపెనర్లు మనన్ వోహ్రా (2), డికాక్ (18) తొందరగా ఔటవడంతో ఒకానొక దశలో 29/2తో కష్టాల్లో నిలిచిన బెంగళూరు జట్టును విరాట్ కోహ్లి (30: 26 బంతుల్లో 2x4, 1x6)తో కలిసి డివిలియర్స్ విజయతీరాలకు చేర్చాడు. అయితే సిక్స్ కొట్టే ప్రయత్నంలో కోహ్లి ఔటవగా.. అనంతరం కోరె అండర్సన్ (15: 13 బంతుల్లో 1x6) డివిలియర్స్‌కి చక్కటి సహకారం అందించాడు. చివర్లో హిట్టింగ్‌కి ప్రయత్నించి అండర్సన్‌ కూడా పెవిలియన్ చేరినా.. మన్‌దీప్ సింగ్ (17 నాటౌట్: 9 బంతుల్లో 1x4, 1x6)తో కలిసి గెలుపు లాంఛనాన్ని18 ఓవర్లలోనే డివిలియర్స్ పూర్తి చేశాడు. తాజా సీజన్‌లో వరుసగా రెండు ఓటముల తర్వాత బెంగళూరుకి ఇది తొలి గెలుపుకాగా.. ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కి వరుసగా రెండో ఓటమి.

తాజా వార్తలు

©2019 APWebNews.com. All Rights Reserved.