భారత్‌దే అడిలైడ్ వన్డే.. సిరీస్ సమం..!

ఎపి వెబ్ న్యూస్.కామ్

స్టేట్ బ్యూరో ఇంచార్జ్ :- మునిబాబు

అడిలైడ్: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా అడిలైడ్‌లో జరిగిన రెండో వన్డేలో భారత్ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

ఆస్ట్రేలియా నిర్దేశించిన 299 పరుగుల విజయ లక్ష్యాన్ని మరో నాలుగు బంతులు మిగిలి ఉండగానే నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. సారథి విరాట్ కోహ్లీ అద్భుత శతకంతో భారత్‌కు విజయాన్ని అందించాడు. మొత్తం 112 బంతులు ఎదుర్కొన్న కోహ్లీ 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 104 పరుగులు చేసి కెరీర్‌లో 39వ సెంచరీ నమోదు చేశాడు.
రోహిత్ శర్మ 43, శిఖర్ ధవన్ 32, అంబటి రాయుడు 24 పరుగులు చేయగా చివర్లో ధోనీ-దినేశ్ కార్తీక్ జోడీ జాగ్రత్తగా ఆడుతూ జట్టుకు విజయాన్ని అందించింది. ధోనీ 54 బంతుల్లో రెండు సిక్సర్లతో 55 పరుగులు చేయగా, కార్తీక్ 14 బంతుల్లో 2 ఫోర్లతో 25 పరుగులు చేశాడు. మూడు వన్డేల సిరీస్‌లో ఇరు జట్లు చెరో విజయాన్ని సొంతం చేసుకుని సమ ఉజ్జీలుగా నిలిచాయి. సిరీస్ ఫలితం ఈ నెల 18న మెల్‌బోర్న్‌లో జరగనున్న చివరి వన్డేలో తేలనుంది.అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసింది. షాన్‌మార్స్ (131) అద్భుత శతకం చేయగా, గ్లెన్ మ్యాక్స్‌వెల్ 48, ఉస్మాన్ ఖావాజా 21, పీటర్ హ్యాండ్స్‌కోంబ్ 20, స్టోయిన్స్ 29 పరుగులు చేశారు. భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ 4 వికెట్లు తీసుకోగా, షమీ 3, రవీంద్ర జడేజా ఓ వికెట్ పడగొట్టారు.

తాజా వార్తలు

©2019 APWebNews.com. All Rights Reserved.