వర్షం దెబ్బ: ఢిల్లీపై రాజస్థాన్ గెలుపు

 
వర్షం ఆటంకం కలిగించిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 10 పరుగుల తేడాతో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌పై విజయం సాధించింది. టాస్ గెలిచిన ఢిల్లీ ఫీల్డింగ్ ఎంచుకోగా.. రాజస్థాన్ 17.5 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. ఈ దశలో వర్షం రావడంతో మ్యాచ్‌కు అంతరాయం కలిగింది. దీంతో ఢిల్లీ లక్ష్యాన్ని 6 ఓవర్లలో 71 పరుగులుగా నిర్ణయించారు. 20 ఓవర్ల మ్యాచ్‌ను కాస్తా.. పవర్ ప్లే స్థాయికి కుదించినప్పటికీ.. రాజస్థాన్ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు విసిరారు. తొలి బంతికే మున్రో రనౌట్ కాగా.. రెండు ఓవర్లలో ఢిల్లీ జట్టు 15 పరుగులు మాత్రమే చేయగలిగింది. కానీ జయదేవ్ ఉనద్కత్ విసిరిన మూడో ఓవర్లో మ్యాక్స్‌వెల్ 14 పరుగులు పిండుకున్నాడు. ప్రమాదకరంగా మారుతున్న మ్యాక్స్‌వెల్‌ను తర్వాతి ఓవర్లో లాంగ్లిన్ పెవిలియన్ చేర్చడంతో మ్యాచ్ రాజస్థాన్ వైపు మొగ్గింది. ఆరు ఓవర్లలో ఢిల్లీ జట్టు 4 వికెట్ల నష్టానికి 60 పరుగులు మాత్రమే చేయగలిగింది.అంతకు ముందు వర్షం ఆటంకం కలిగించే సమయానికి రాజస్థాన్ జట్టు 17.5 ఓవర్లలో 153/5గా నిలిచింది. రహానే 45 పరుగులు చేయగా.. సంజూ శాంసన్ 22 బంతుల్లో 37 రన్స్‌తో దూకుడుగా ఆడాడు. తొలి మ్యాచ్‌లో రనౌట్‌గా వెనుదిరిగిన ఓపెనర్ డీఆర్కీ షార్ట్ ఈ మ్యాచ్‌లోనూ రనౌటై నిరాశపరిచాడు. 

తాజా వార్తలు

©2019 APWebNews.com. All Rights Reserved.