కోల్‌కతా బౌలర్లపై ఆండ్రీ రసెల్ ఫైర్..!

చెపాక్ వేదికగా చెన్నైతో మంగళవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో 202 పరుగుల భారీ స్కోరు చేసినా కోల్‌కతా నైట్‌రైడర్స్ ఓడిపోవడంపై ఆ జట్టు ఆల్‌రౌండర్ ఆండ్రీ రసెల్ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. పేలవ బౌలింగ్‌తోనే మ్యాచ్‌ని కోల్‌కతా చేజార్చుకుందుని దుయ్యబట్టిన రసెల్.. బౌలర్లు పొదుపుగా బౌలింగ్ చేస్తూ యార్కర్లు వేయడం నేర్చుకోవాలని హితవు పలికాడు. ఈ మ్యాచ్‌లో రసెల్ (88: 36 బంతుల్లో 1x4, 11x6) ఆకాశమే హద్దుగా చెలరేగడంతో తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది. అనంతరం ఛేదనలో వాట్సన్ (42: 19 బంతుల్లో 3x4, 3x6), రాయుడు (39: 26 బంతుల్లో 3x4, 2x6), శామ్ బిల్లింగ్స్ (56: 23 బంతుల్లో 2x4, 5x6) దూకుడుగా ఆడటంతో 19.5 ఓవర్లలో 205/5తో చెన్నై సూపర్ కింగ్స్ విజయాన్ని అందుకుంది. ‘నా కెరీర్‌లో చాలా టీ20 మ్యాచ్‌లు ఆడాను. జట్టు 190, 200 స్కోర్లు చేసినా.. ఇంకా ఓడిపోవడమా..? మ్యాచ్‌ను మెరుగ్గా ఆరంభించడమే కాదు.. కట్టుదిట్టమైన బౌలింగ్‌తో వికెట్లను పడగొడుతూ ముగించాలి. ఇక్కడ జట్టులో ఈ బౌలర్ బాగా బౌలింగ్ చేశాడు.. అతను సరిగా చేయలేదు అని నేను చెప్పడం కాదు. తప్పిదాల నుంచి పాఠాలు నేర్చుకుని ముందుకు సాగాలని మాత్రమే చెప్తున్నా. ఈ ఓటమితో యార్కర్లు వేయడంలో కోల్‌కతా బౌలర్ల బలహీనత బయటపడింది. లయ తప్పకుండా బంతి విసరడంపై బౌలర్లు కొంచెం దృష్టి సారిస్తే మంచిది’ అని రసెల్ సూచించాడు. ఈ మ్యాచ్‌లో 4 ఓవర్లు బౌలింగ్ చేసిన రసెల్ 35 పరుగులివ్వగా.. చివరి ఓవర్‌లో చెన్నై విజయానికి 17 పరుగుల అవసరమైన దశలో వినయ్ కుమార్ నోబాల్ విసరడంతో పాటు.. దారాళంగా పరుగులివ్వడంతో.. ఒక బంతి మిగిలి ఉండగానే చెన్నై గెలుపొందింది. 

తాజా వార్తలు

©2019 APWebNews.com. All Rights Reserved.