భళా... చెన్నయ్...!

చెపాక్ స్టేడియం వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. రెండేళ్ల విరామం తర్వాత సొంత గడ్డ మీద తొలి మ్యాచ్ ఆడిన ధోనీ సేన చివరి ఓవర్లో అద్భుత విజయాన్ని అందుకుంది. ఆఖరి ఓవర్లో 17 పరుగులు అవసరమైన దశలో కోల్‌కతా బౌలర్ వినయ్ కుమార్ ఒత్తిడికి లోనై నోబాల్, వైడ్ విసిరాడు. ఆ ఓవర్లో బ్రావో, జడేజా చెరో సిక్స్ బాదడంతో మరో బంతి మిగిలి ఉండగానే.. చెన్నై విజయాన్ని అందుకుంది. 203 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన చెన్నై జట్టుకు ఓపెనర్లు షేన్ వాట్సన్ (19 బంతుల్లో 42), అంబటి రాయుడు (26 బంతుల్లో 39) మెరుపు ఆరంభాన్ని ఇచ్చారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 5.5 ఓవర్లలోనే 75 పరుగులు జోడించారు. వీరిద్దరూ 10 పరుగుల తేడాతో ఔటవడంతో చెన్నై స్కోరు బోర్డు వేగం మందగించింది. రైనా (14), ధోనీ (28 బంతుల్లో 25) ఆశించిన స్థాయిలో రాణించలేదు.చెన్నై విజయానికి 48 బంతుల్లో 100 పరుగులు అవసరమైన స్థితిలో.. శ్యామ్ బిల్లింగ్స్ మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. 23 బంతుల్లోనే 56 పరుగులు చేసిన బిల్లింగ్స్.. 5 సిక్స్‌లు, 2 ఫోర్లు బాదాడు. విజయానికి 19 పరుగుల దూరంలో బిల్లింగ్స్ అవుటైనప్పటికీ.. బ్రావో (11 నాటౌట్), జడేజా (11 నాటౌట్) లాంఛనం ముగించారు.అంతకు ముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నైట్‌రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది. ఓ దశలో కోల్‌కతా జట్టు 89 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. చివర్లో ఆండ్రీ రస్సెల్ సిక్సర్ల మోత మోగించడంతో ఆ జట్టు 200 పరుగుల మార్క్ దాటింది. రస్సెల్ కేవలం 36 బంతుల్లోనే 11 సిక్సులు, 1 ఫోర్ సాయంతో 88 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. చెన్నై బౌలర్లలో వాట్సన్‌కు రెండు వికెట్లు దక్కాయి.

©2019 APWebNews.com. All Rights Reserved.