రాహుల్, రైనా మెరుపులు..!

డబ్లిన్: ఓపెనర్ కే ఎల్ రాహుల్ (36 బంతుల్లో 70; 3 ఫోర్లు, 6 సిక్సర్లు), రైనా (45 బంతుల్లో 69; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) దుమ్మురేపడంతో.. శుక్రవారం జరిగిన రెండో టీ20లోనూ భారత్ 143 పరుగుల తేడాతో ఐర్లాండ్‌పై నెగ్గింది.

దీంతో రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. టీ20ల్లో భారత్‌కు ఇదే అతిపెద్ద విజయం (పరుగుల పరంగా) కాగా, సంయుక్తంగా రెండో అతిపెద్ద పరాజయాన్ని నమోదు చేసిన జట్టుగా ఐర్లాండ్ రికార్డులకెక్కింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 213 పరుగులు చేసింది. రాహుల్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన కెప్టెన్ కోహ్లీ (9) ఇన్నింగ్స్ మూడో ఓవర్‌లోనే వెనుదిరిగాడు. దీంతో 22 పరుగుల వద్ద భారత్ తొలి వికెట్ కోల్పోయింది. రైనాతో జతకలిసిన రాహుల్.. రాన్‌కిన్, థాంప్సన్‌ను లక్ష్యంగా చేసుకుని భారీ సిక్సర్లతో రెచ్చిపోయాడు. దీంతో పవర్‌ప్లేలో 57/1 స్కోరు చేసిన టీమ్‌ఇండియా తర్వాతి నాలుగు ఓవర్లలో 44 పరుగులు చేసింది.

 తొలి 10 ఓవర్లలో జట్టు స్కోరు 100 దాటింది. అర్ధసెంచరీ పూర్తి చేసుకున్న రాహుల్ 13వ ఓవర్‌లో ఔట్‌కావడంతో రెండో వికెట్‌కు 106 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. రెండు బంతుల తర్వాత రోహిత్ (0) డకౌటయ్యాడు. రైనా, మనీష్ పాండే (20 బంతుల్లో 21 నాటౌట్; 1 ఫోర్) కలిసి వేగంగా ఆడి నాలుగో వికెట్‌కు 42 పరుగులు జోడించారు. చివర్లో హార్దిక్ పాండ్యా (9 బంతుల్లో 32 నాటౌట్; 1 ఫోర్, 4 సిక్సర్లు) కండ్లు చెదిరే స్థాయిలో నాలుగు భారీ సిక్సర్లు బాదడంతో ఐదో వికెట్‌కు అజేయంగా 44 పరుగులు జోడించడంతో భారత్ స్కోరు 200లు దాటింది.

214 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఐర్లాండ్ 20 ఓవర్లలో 70 పరుగులకే కుప్పకూలింది. విల్సన్ (15) టాప్ స్కోరర్. పోర్టర్‌ఫీల్డ్ (14), థాంప్సన్ (13)తో సహా అందరూ విఫలమయ్యారు. స్పిన్నర్లు కుల్దీప్ (3/16), చాహల్ (3/21) దాటికి ఐర్లాండ్ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయి ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. ఇన్నింగ్స్ మొత్తంలో నలుగురు డకౌట్ కాగా, ఏడుగురు సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమయ్యారు. రాహుల్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్; చాహల్‌కు మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు లభించాయి.

©2018 APWebNews.com. All Rights Reserved.