రఫ్పాడించిన రోహిత్..!

 

డబ్లిన్: కఠినమైన ఇంగ్లండ్ పర్యటనకు ముందు భారత్ బ్యాట్స్‌మెన్‌కు అద్భుతమైన బ్యాటింగ్ ప్రాక్టీస్ లభించింది. ఓపెనర్ రోహిత్ శర్మ (61 బంతుల్లో 97; 8 ఫోర్లు, 5 సిక్సర్లు), శిఖర్ ధవన్ (45 బంతుల్లో 74; 5 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపులు మెరిపించడంతో.. బుధవారం ఐర్లాండ్‌తో జరిగిన తొలి టీ20లో భారత్ 76 తేడాతో గెలిచింది.

దీంతో రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో టీమ్‌ఇండియా 1-0 ఆధిక్యంలో నిలిచింది. ముందుగా భారత్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 208 పరుగులు చేసింది. తర్వాత ఐర్లాండ్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 132 పరుగులు చేసింది. షానాన్ (35 బంతుల్లో 60; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) టాప్ స్కోరర్. కుల్దీప్ (4/21), చాహల్ (3/38) స్పిన్ దాటికి ఐర్లాండ్ ఇన్నింగ్స్ పేకమేడలా కూలింది.

ఓపెనర్ల జోరు..

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు రోహిత్, ధవన్ అదరిపోయే ఆరంభాన్నిచ్చారు. ప్రత్యర్థుల బౌలింగ్‌లో పసలేకపోవడంతో రెండో ఓవర్ నుంచే బాదడం మొదలుపెట్టారు. ఐపీఎల్‌లో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన రోహిత్.. ఈ మ్యాచ్‌లో మాత్రం దుమ్మురేపాడు. ఈ ఇద్దరి జోరుతో ఐదో ఓవర్‌లో 50 పరుగులకు చేరిన స్కోరు పవర్‌ప్లేలో 59కు చేరింది. ఫీల్డింగ్‌ను విస్తరించిన తర్వాత నాలుగు ఓవర్లలో 35 పరుగులు రావడంతో తొలి 10 ఓవర్లలో భారత్ 94 పరుగులు చేసింది. 11వ ఓవర్ తొలి బంతిని డీప్ మిడ్‌వికెట్‌లో భారీ సిక్సరు కొట్టిన ధవన్ 45 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. కొద్దిసేపటికే రోహిత్ కూడా బంతిని స్టాండ్స్‌లోకి పంపి హాఫ్ మార్క్‌ను అందుకున్నాడు.16 ఓవర్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి ధవన్ వికెట్ సమర్పించుకున్నాడు.

 దీంతో తొలి వికెట్‌కు 160 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. రైనా (10) వచ్చి రావడంతోనే జోరు చూపెట్టినా.. 18వ ఓవర్‌లో ఔటయ్యాడు. ఇక సెంచరీకి చేరువైన రోహిత్‌ను ఆఖరి ఓవర్‌లో చేజ్ (4/35) బోల్తా కొట్టించాడు. తొలి బంతికి ధోనీ (11)ని ఔట్ చేసిన అతను రెండో బంతికి రోహిత్‌ను పెవిలియన్‌కు పంపాడు. నాలుగో బంతికి కోహ్లీ (0)ని కూడా డకౌట్ చేయడంతో ఒకే ఓవర్‌లో మూడు కీలక వికెట్లు పడ్డాయి. చివరి బంతిని పాండ్యా హెలిక్యాప్టర్ షాట్‌తో సిక్సర్ కొట్టడంతో 200ల స్కోరు దాటింది.

©2019 APWebNews.com. All Rights Reserved.