తొలి మ్యాచ్‌లో వెస్టిండీస్‌తో ఇండియా...!

చర్చానీయాంశంగా మారిన వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్‌కు చెందిన ఫ్యూచర్ టూర్ ప్రోగ్రాం (ఎఫ్‌టీపీ)ని బుధవారం ఐసీసీ విడుదల చేసింది. 2019 నుంచి 2021 వరకు టెస్టు చాంపియన్‌షిప్ జరుగుతుంది.

ఈ వరల్డ్ టెస్టు చాంపి యన్‌షిప్‌లో టీమిండియా తన తొలి మ్యాచ్‌ను 2019 జూలైలో వెస్టిండీస్‌తో.. అలాగే వన్డే లీగ్‌లోని తొలి సిరీస్‌ను 2020 జూన్‌లో శ్రీలంకతో ఆడుతుంది. ఈ టెస్టు చాంపియన్ షిప్‌ను గతేడాదే ఐసీసీ ఆమోదిం చింది. ఐసీసీ ర్యాంకింగ్స్‌లోని టాప్ 9 జట్లు పాల్గొంటాయి. 

రెండేళ్ల కాలంలో ఒకదానితో మరొకటి తలపడతాయి. ప్రతి జట్టూ ఆరు సిరీస్‌లు ఆడుతుం ది.అగ్రస్థానంలో నిలిచిన రెండు జట్లు టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్లో తలపడతాయి. బహుశా ఫైనల్ మ్యాచ్ లార్డ్స్‌లో జరిగే అవకాశముంది. ‘టెస్టు చాంపియన్‌షిప్‌లో టాప్ 9 ర్యాంక్‌ల్లో నిలిచిన జట్లు పాల్గొంటాయి. ఈ టోర్నీ 2019 జూలై 15 నుంచి 2021 ఏప్రిల్ 30వ తేదీ వరకు జరుగుతుంది. ఇంటా, బయటా పద్ధతిలో ఈ రెండేళ్లలో ప్రతి జట్టూ తాము ఎంచుకున్న ప్రత్యర్థితో ఆరు సిరీస్‌లు ఆడుతుంది. అగ్రస్థానంలో నిలిచిన రెండు జట్లు 2021 జూన్‌లో జరిగే ఫైనల్లో తలపడతాయి’ అని ఐసీసీ ఒక ప్రకటనలో పేర్కొంది. ఇక వన్డే లీగ్ విషయానికొస్తే.. టెస్టులో ఆడే దేశాల జట్లతో పాటు వరల్డ్ క్రికెట్ లీగ్ చాంపియన్‌షిప్ విజేత నెదర్లాండ్స్ జట్టుతో కలిపి మొత్తం 13 జట్లు ఇందులో పాల్గొంటాయి. ఈ లీగ్‌లో మూడు మ్యాచ్‌ల సిరీస్ ఉంటుంది. ఈ సిరీస్‌లు 2020 నుంచి 2022 వరకు జరుగుతాయి. జట్లు ఆడే ప్రతి సిరీస్‌ను వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ లేదా వన్డే లీగ్ పరిధిలోకి రావని ఐసీసీ స్పష్టం చేసింది. అయితే 2019, 2021-22లలో జరిగే యాషెస్ సిరీస్‌లకు ప్రత్యేక గుర్తింపు ఉంటుందని ఐసీసీ తెలిపింది. వరల్డ్ కప్‌కు ఏడాది ముందే వన్డే లీగ్‌ను ఆపేస్తారు. ఎందుకంటే ఆ సమయంలో ప్రతి జట్టూ మూడు కంటే ఎక్కువ మ్యాచ్‌లు ఆడి వరల్డ్ కప్‌కు సన్నద్ధం కావచ్చు. వన్డే లీగ్‌లో టాప్ ఎనిమిది జట్లు నేరుగా వరల్డ్ కప్‌కు అర్హత సాధిస్తాయి. 

మిగతా జట్లు వరల్డ్ కప్ క్వాలిఫయర్ టోర్నీలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటాయి. ‘వచ్చే ఐదేళ్లలో ద్వైపాక్షిక సిరీస్‌తో పాటు మిగతా అన్ని టోర్నీలు సవ్యంగా, సమగ్రంగా జరగాలన్న ఉద్దేశంతో ఈ ఎఫ్‌టీపీ ప్రోగ్రాంను రూపొందించాం. టెస్టు చాంపియన్‌షిప్ వచ్చే ఏడాది ప్రారంభం కానుండగా.. 2020లో వన్డే లీగ్ మొదలవుతుంది. 2023లో జరగనున్న వన్డే వరల్డ్ కప్‌కు అర్హత టోర్నీలో ఈ వన్డే లీగ్ ఉంటుంది. సందర్భానుసారంగా ద్వైపాక్షిక సిరీస్‌ను నడపడం కొత్త సవాలు. కానీ ఎఫ్‌టీపీ ద్వారా మా సభ్యులు నిజమైన పరిష్కారాన్ని కనుగోన్నారు. దీంతో ప్రపంచంలోని అన్ని దేశాలూ అంతర్జాతీయ క్రికెట్‌ను ఎంజాయ్ చేసే అవకాశం లభిస్తుంది’ అని ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డేవిడ్ రిచర్డ్సన్ పేర్కొన్నారు. ఈ ఎఫ్‌టీపీ ప్రకారం ఇటీవలే టెస్టు హోదా పొందిన అఫ్ఘానిస్థాన్, ఐర్లాండ్ జట్లు టెస్టు చాంపియన్‌షిప్‌లో పాల్గొనవు. అయితే 2020లో అఫ్ఘానిస్థాన్ జట్టు ఆస్ట్రేలియాతో టెస్టు మ్యాచ్ ఆడుతుంది. కాగా న్యూజిలాండ్ జట్టు శ్రీలంక పర్యటనకు వెళుతుంది. తర్వాత ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, ఇండియా జట్లు కివీస్‌లో పర్యటిస్తాయి. 

©2019 APWebNews.com. All Rights Reserved.