ధోని సీక్రెట్ ప్రాక్టీస్...!

 

వయస్సు పెరిగినా..వన్నె తరుగని ఆటతీరుకు చిరునామా మహేంద్రసింగ్ ధోనీ. జట్టులో యువ క్రికెటర్లకు దీటుగా రాణిస్తూ తనదైన రీతిలో అదరగొడుతున్న ధోనీ..కీలకమైన ఇంగ్లండ్‌తో సిరీస్ కోసం పక్కా ప్రణాళికతో సిద్ధమవుతున్నాడు.

అభిమానుల కంటపడకుండా జాతీయ క్రికెట్ అకాడమీ(ఎన్‌సీఏ) నెట్స్‌లో కఠోరంగా శ్రమిస్తున్నాడు. ఈ మధ్యే కెప్టెన్ కోహ్లీ, భువనేశ్వర్, బుమ్రాతో కలిసి యో-యో టెస్ట్ పాసైన 36 ఏండ్ల ధోనీ..తన బ్యాటింగ్‌కు మరింత పదునుపెట్టుకుంటున్నాడు. కెరీర్ ఆఖరి అంకంలో దిగ్గజ సచిన్ ఒంటరిగా ప్రాక్టీస్ చేసిన తరహాను మహీ ఫాలో అవుతున్నాడు. టీమ్‌ఇండియా త్రోడౌన్ నిపుణుడు రఘు సహకారంతో రెండున్నర గంటల పాటు ఈ జార్ఖండ్ డైనమైట్ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. పిచ్‌పై 18 అడుగుల దూరం నుంచి రఘు విసిరిన వైవిధ్యమైన బంతులను ధోనీ ఎదుర్కొన్నాడు. వేగం పెంచుకుంటూపోతూ రఘు వేసిన షార్ట్‌పిచ్ బంతులను తనదైన శైలిలో బలంగా బాదాడు. యువ పేసర్లు శార్దుల్ ఠాకూర్, సిద్దార్థ్ కౌల్..నెట్స్‌లో ధోనీకి బౌలింగ్ చేశారు. ఫీల్డ్ ప్లేస్‌మెంట్స్‌ను ఊహించుకుంటూ శార్దుల్ వేసిన బంతులను ఆడాడు. కొద్దిసేపటి తర్వాత శార్దుల్‌కు ధోనీ కొన్ని సూచనలు చేశాడు. ప్రాక్టీస్ సెషన్ ముగిసిన తర్వాత కొంత మంది జర్నలిస్టులు తనను గమనించిన విషయాన్ని ధోనీ గుర్తించి వారితో నవ్వుతూ మాట్లాడి డ్రెస్సింగ్‌రూమ్‌లోకి వెళ్లిపోయాడు.

తాజా వార్తలు

©2019 APWebNews.com. All Rights Reserved.