-ఫిఫా ప్రపంచకప్ ప్రారంభం నేడు.. !

నెలరోజులపాటు ఫుట్‌బాల్ ప్రేమికులకు కనువిందు..ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అభిమానులకు పసందైన ఫుట్‌బాల్ విందు.. ఫైనల్స్ ఆడుతున్న 32 దేశాల వారే కాదు..

ప్రపంచమంతా సాకర్ ఫీవర్‌తో ఊగిపోతున్నది. మెస్సీ, రొనాల్డో.. ప్రపంచవ్యాప్తంగా అభిమానులు కలిగి ఉంటారు.. ఇక బ్రెజిల్ జట్టు అంటే అందరికీ ఇష్టమే..జర్మనీ అటాకింగ్ ఫుట్‌బాల్‌ను.. స్పెయిన్ కళాత్మక ఆటతీరుకు అభిమానులు ఫిదా కావలసిందే. డిఫెండింగ్ చాంపియన్ జర్మనీ..కెరీర్‌లో వెలితిగా మిగిలిన ఫిఫా ట్రోఫీని ముద్దాడాలని కలలు కంటున్న మెస్సీ, రొనాల్డో ఆశలకు తెరలేచేది.. తొలిసారిగా ప్రపంచ చాంపియన్లుగా నిలువాలన్న బెల్జియం, పోలండ్ తపన.. సంచలనాలపైనే ఆశలు పెట్టుకున్న కొలంబియా, టైటిల్ దక్కించుకునేందుకు తపిస్తున్న ఇంగ్లండ్, ఫ్రాన్స్.. మరోసారి చాంపియన్‌గా నిలువాలని కోరుకుంటున్న స్పెయిన్, ఉరుగ్వే జట్ల తలరాత ఎలా ఉందో తేలిపోనుంది.. 
మాస్కో(రష్యా): సోషలిస్టు వ్యవస్థ ఆవిర్భవించిన గడ్డ.. ప్రపంచ సూపర్‌పవర్ రష్యా తొలిసారిగా నిర్వహిస్తున్న ఫిఫా ప్రపంచకప్‌నకు సర్వం సిద్ధమైంది. మ్యాచ్‌లను ప్రత్యక్షంగా వీక్షించేందుకు లక్షలాది సాకర్ అభిమానులు తరలిరానున్న వేళ.. 11 నగరాలలో ఆధునిక హంగులతో సిద్ధంగా ఉన్న స్టేడియాలతోపాటు దేశమంతా పటిష్ఠభద్రత ఏర్పాటు చేశారు. తొలిమ్యాచ్‌లో భాగంగా ఆతిథ్య రష్యాతో.. సౌదీ అరేబియా జట్టు ఢీకొట్టనుంది. గత ఎనిమిది నెలలుగా ఒక్క విజయం సాధించలేకపోవడంతో రష్యా జట్టుపై ఆందోళన నెలకొంది. స్టాన్సిస్లావ్ చెర్చెసోవ్ నేతృత్వంలోని రష్యా జట్టు ఫిఫా ర్యాంకింగ్స్‌లో ప్రస్తుతం 70వ స్థానంలో ఉంది. స్టాన్సిస్లావ్ కెప్టెన్‌గా ఆడిన ఏడు మ్యాచ్‌లలో 4 ఓటమలు, 3 డ్రాలతో సరిపెట్టాడు. గ్రూప్‌ఏలో ఉరుగ్వే, ఈజిప్ట్‌లతోపాటు ఆఖరుకు సౌదీ అరేబియా కూడా ర్యాంకింగ్స్‌లో రష్యా కంటే ముందుండడం గమనార్హం. మన జట్టు ఇటీవలి కాలంలో విజయాలు సాధించని మాట వాస్తవం. జట్టు పరిస్థితి ఆందోళనగా ఉంది అని స్వయంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ నిరాశను వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచకప్ సందర్భంగా జరిగిన స్నేహపూర్వక మ్యాచ్‌లలోనూ రష్యా ఆటతీరు నాసిరకంగా ఉంది.

©2019 APWebNews.com. All Rights Reserved.