రషీద్ మెచ్చిన బ్యాట్స్‌మెన్ ?

టీ20 క్రికెట్‌లో తిరుగులేని బౌలర్‌గా అఫ్గానిస్థాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ఎదుగుతున్నాడు. గత నెల ముగిసిన ఐపీఎల్ 2018 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ జట్టుకి ఒంటిచేత్తో విజయాల్ని అందించిన ఈ సంచలన స్పిన్నర్..

రెండు రోజుల క్రితం బంగ్లాదేశ్‌తో ముగిసిన మూడు టీ20ల సిరీస్‌లో మొత్తం 12 వికెట్లు పడగొట్టి ఔరా అనిపించాడు. జూన్‌ 14 నుంచి బెంగళూరు వేదికగా భారత్, అఫ్గానిస్థాన్ మధ్య ఏకైక టెస్టు మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో ఓ మీడియా సంస్థకిచ్చిన ఇంటర్వ్యూలో రషీద్ ఖాన్ మాట్లాడాడు. ‘విరాట్ కోహ్లీకి బౌలింగ్ చేయడాన్ని నేను బాగా ఆస్వాదిస్తా. టెస్టు క్రికెట్‌లో అయితే మరీనూ.. ఎందుకంటే ప్రస్తుత క్రికెట్ ప్రపంచంలో అతనే బెస్ట్ బ్యాట్స్‌మెన్. భారత జట్టులో కూడా చాలా మంది వరల్డ్ క్లాస్ బ్యాట్స్‌మెన్స్ ఉన్నారు’ అని రషీద్ ఖాన్ వెల్లడించాడు. కెరీర్‌లో సచిన్ టెండూల్కర్‌ లాంటి దిగ్గజ బ్యాట్స్‌మెన్‌కి బౌలింగ్ చేయలేకపోయాననే చిన్న అసంతృప్తి ఉండిపోతుందని ఈ అఫ్గానిస్థాన్ స్పిన్నర్ ఆవేదన వ్యక్తం చేశాడు. ‘సచిన్‌ టెండూల్కర్‌కి బౌలింగ్ చేయాలనేది ప్రతి ఒక్క బౌలర్ కల. మళ్లీ అలాంటి గొప్ప ఆటగాడు క్రికెట్‌లోకి వస్తాడని నేను అనుకోవట్లేదు. అందుకే.. అతనికి బౌలింగ్ చేయలేకపోవడం నా దుర‌దృష్టంగా భావిస్తున్నా’ అని రషీద్ నిరాశ వ్యక్తం చేశాడు. అఫ్గానిస్థాన్‌తో ఏకైక టెస్టుకి విరాట్ కోహ్లీ దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. అతని స్థానంలో అజింక్య రహానె జట్టుకి కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. 

తాజా వార్తలు

©2019 APWebNews.com. All Rights Reserved.