కోహ్లీకి పాలీ ఉమ్రిగర్ అవార్డు..!

భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఖాతాలో మరో అవార్డు చేరింది. ఫార్మాట్‌తో సంబంధం లేకుండా అంతర్జాతీయ క్రికెట్లో పరుగుల వరద పారిస్తున్న కోహ్లీని ప్రతిష్ఠాత్మక పాలీ ఉమ్రిగర్ అత్యుత్తమ అంతర్జాతీయ క్రికెటర్ అవార్డు వరించింది.

గత రెండు సీజన్లలో (2016-17, 2017-18) ప్రదర్శనను పరిగణనలోకి తీసుకున్న బీసీసీఐ ఉమ్రిగర్ అవార్డుకు ఎంపిక చేసింది. తన అద్భుత కెరీర్‌లో ఈ అవార్డు అందుకోనుండటం కోహ్లీకి ఇది నాలుగోసారి కావడం విశేషం. ఈనెల 12న బెంగళూరు వేదికగా జరిగే కార్యక్రమంలో టీమ్‌ఇండియా కెప్టెన్ సీజన్‌కు రూ.15 లక్షల చొప్పున నజరానాతో పాటు అవార్డు అందుకోనున్నాడు. మరోవైపు మహిళల క్రికెట్‌కు గుర్తింపునిస్తూ బీసీసీఐ తొలిసారి అవార్డులు ప్రకటించింది. ఇటీవలి ప్రపంచకప్‌లో అద్భుతంగా రాణించిన హర్మన్‌ప్రీత్‌కౌర్, స్మృతి మందనను అత్యుత్తమ అంతర్జాతీయ క్రికెటర్లుగా ఎంపిక చేసింది. భారత క్రికెట్‌కు చేసిన అనితర సేవలకు గుర్తింపుగా మాజీ బీసీసీఐ చీఫ్ జగ్మోహన్ దాల్మియా అవార్డును బోర్డు ప్రకటించింది. అండర్-16 విజయ్ మర్చంట్ ట్రోఫీలో అత్యధిక పరుగులు, అత్యధిక వికెట్లు తీసిన ఆటగాళ్లతో పాటు జూనియర్, సీనియర్ మహిళా క్రికెటర్లకు ఈ అవార్డు ఇవ్వనున్నారు. మొత్తం తొమ్మిది అవార్డుల కింద ఇచ్చే నగదు ప్రోత్సాహాకం మొత్తాన్ని రూ.లక్ష నుంచి లక్షా 50వేలకు పెంచింది. బెంగాల్, ఢిల్లీ క్రికెట్ సంఘాలను అత్యుత్తమ రాష్ట్ర సంఘాలుగా బీసీసీఐ ఎంపిక చేసింది.

©2019 APWebNews.com. All Rights Reserved.