ఇంగ్లాండ్ పర్యటనలో జస్టిన్ లాంగర్‌కు తోడుగా రికీ పాంటింగ్...!

బాల్ టాంపరింగ్ వివాదం యావత్ క్రికెట్ ప్రపంచాన్ని ఓ కుదుపు కుదిపేసింది. ఈ బాల్ టాంపరింగ్‌కు పాల్పడిన క్రికెటర్లు ఆస్ట్రేలియాకు చెందిన వారు కావడంతో ఆ దేశ ప్రతిష్ట పూర్తిగా మసకబారింది.

ఈ వివాదంతో పరువు పోగొట్టుకున్న ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు మళ్లీ అభిమానుల మనసు గెలుచుకోవాలని తెగ తాపత్రయపడుతోంది.ఇందు కోసం ఆ జట్టు ఎంతవరకైనా వెళుతోంది. ఇప్పటికే ఆ జట్టు కొత్త కోచ్ జస్టిన్ లాంగర్ ఆటగాళ్లకు క్రమశిక్షణపై క్లాస్‌లు తీసుకుంటున్నాడు. అదే సమయంలో జట్టు సహాయ బృందంలోకి మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్‌ను చేర్చుతూ క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ఓ అనూహ్య నిర్ణయాన్ని తీసుకుంది.జూన్ 13 నుంచి ఆస్ట్రేలియా జట్టు ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటనలో భాగంగా ఆతిథ్య ఇంగ్లీష్ జట్టు‌తో ఐదు వన్డేలు, ఒక టీ20 మ్యాచ్‌ని ఆడనుంది. ఈ పర్యటన కోసం ఇప్పటికే ఆస్ట్రేలియా జట్టు సిద్ధమైంది. తాజాగా ఆస్ట్రేలియా జట్టు సపోర్టింగ్ స్టాఫ్‌లో రికీ పాంటింగ్ పేరుని క్రికెట్ ఆస్ట్రేలియా చేర్చింది. ఈ నిర్ణయంపై ప్రధాన కోచ్ జస్టిన్ లాంగర్ మాట్లాడుతూ ‘రికీ పాంటింగ్ గొప్ప క్రికెటర్లలో ఒకరు. అతను ఇప్పటికే ఇంగ్లాండ్‌లో కొన్ని మ్యాచ్‌లకి కామెంటేటర్‌గా పనిచేశాడు. దీంతో.. అక్కడి పరిస్థితులపై అతనికి చక్కని అవగాహన ఉంటుంది. కాబట్టి.. ఈ పర్యటనలో పాంటింగ్ సహాయ కోచ్‌గా ఉండటం ఆసీస్‌కి లాభిస్తుంది' అని అన్నారు.మేమిద్దరం కలిసి చాలా మ్యాచ్‌లు ఆడాం. కోచ్‌లుగా కూడా పనిచేశాం. బిగ్‌బాష్ లీగ్ ద్వారా చాలా మంది ఆసీస్ క్రికెటర్ల ఆటపై అతనికి అవగాహన ఉంది. మేము ఇప్పటికే వరల్డ్ కప్-2019 కోసం జట్టుని సిద్ధం చేస్తున్న నేపథ్యంలో అతని చేరిక ఉపయోగకరంగా ఉంటుంది' అని లాంగర్ వెల్లడించాడు.గతంలోనూ రెండుసార్లు ఆస్ట్రేలియా టీ20 జట్టుకి సహాయ కోచ్‌గా రికీ పాంటింగ్ పనిచేశాడు. ఆ సమయంలో.. జట్టు మెరుగైన ప్రదర్శన చేయడంతో మరోసారి పాంటింగ్‌కు క్రికెట్ ఆస్ట్రేలియా అవకాశమిచ్చింది. మరోవైపు వచ్చే ఏడాది జరగనున్న వన్డే వరల్డ్ కప్‌కు ఇంగ్లాండ్ ఆతిథ్యమిస్తోన్న సంగతి తెలిసిందే.

తాజా వార్తలు

©2019 APWebNews.com. All Rights Reserved.