హర్మన్‌ప్రీత్ ఆల్‌రౌండ్ షో..థాయ్‌లాండ్‌పై భారత్ ఘనవిజయం...!

మహిళల టీ20 ఆసియాకప్‌లో భారత జట్టు వరుస విజయాల జోరు కొనసాగుతున్నది. సోమవారం థాయ్‌లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమ్‌ఇండియా 66 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది.

భారత్ నిర్దేశించిన 133 పరుగుల లక్ష్యఛేదనలో థాయ్‌లాండ్ 20 ఓవర్లలో 66/8 స్కోరుకే పరిమితమైంది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్‌కౌర్(3/11), దీప్తిశర్మ(2/16) ధాటికి థాయ్‌లాండ్ జట్టులో ఎవరూ నిలదొక్కుకోలేకపోయారు. బూచథామ్(21) మినహా అందరూ ఘోరంగా విఫలమై వికెట్లు సమర్పించుకున్నారు. తొలుత మోనా మెశ్రామ్(32), స్మృతి మందన(29), హర్మన్‌ప్రీత్(17 బంతుల్లో 27 నాటౌట్, 3 ఫోర్లు) బ్యాటింగ్‌తో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 132/4 స్కోరు చేసింది. ఓపెనర్లు టీమ్‌ఇండియాకు మెరుగైన ఆరంభమివ్వగా, ఆఖర్లో కౌర్ మెరుపులు మెరిపించింది. వరుస బౌండరీలతో థాయ్‌లాండ్ బౌలర్లకు చుక్కలు చూపించింది. లీంగ్‌ప్రసెర్ట్(2/16)కు రెండు వికెట్లు దక్కాయి. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్న హర్మన్‌ప్రీత్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. భారత్ తమ తదుపరి మ్యాచ్‌లో బుధవారం బంగ్లాదేశ్‌తో తలపడుతుంది.

తాజా వార్తలు

©2018 APWebNews.com. All Rights Reserved.