మిథాలీ మెరుపులు, మలేసియాపై భారత మహిళల గెలుపు.....!

మహిళల ఆసియా కప్ టీ20 టోర్నీలో భారత జట్టు శుభారంభం చేసింది. బ్యాటింగ్, బౌలింగ్‌లో ప్రత్యర్థులను చెడుగుడు ఆడుతూ భారీ విజయాన్ని అందుకుంది.

హైదరాబాద్ అమ్మాయి మిథాలీ రాజ్ (69 బంతుల్లో 97 నాటౌట్; 13 ఫోర్లు, 1 సిక్స్) మెరుపులు మెరిపించడంతో.. ఆదివారం జరిగిన తొలి మ్యాచ్‌లో టీమ్‌ఇండియా 142 పరుగుల భారీ తేడాతో మలేసియాను చిత్తు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో 3 వికెట్లకు 169 పరుగులు చేసింది. 35 పరుగులకే మందన (2), వస్ట్రార్కర్ (16) ఔటైనా.. మిథాలీ ఇన్నింగ్స్‌కు వెన్నెముకగా నిలిచింది. పసలేని ప్రత్యర్థుల బౌలింగ్‌ను తుత్తునీయలు చేస్తూ పరుగుల వరద పారించింది. హర్మన్‌ప్రీత్ కౌర్ (23 బంతుల్లో 32; 4 ఫోర్లు)తో కలిసి మూడో వికెట్‌కు 53 బంతుల్లోనే 86 పరుగులు జోడించింది. చివర్లో దీప్తి శర్మ (12 బంతుల్లో 18 నాటౌట్; 2 ఫోర్లు) కూడా చెలరేగడంతో నాలుగో వికెట్‌కు అజేయంగా 48 పరుగులు జతయ్యాయి.

170 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన మలేసియా 13.4 ఓవర్లలో 27 పరుగులకే కుప్పకూలింది. షషా అజ్మి (9) టాప్ స్కోరర్. టీమ్‌ఇండియా బౌలర్ల దాటికి మలేసియా బ్యాట్స్‌వుమన్ పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఆరుగురు డకౌట్ కాగా, ఐదుగురు మాత్రమే పరుగులు చేశారు. ఇన్నింగ్స్ మొత్తంలో ఒక్కరు కూడా డబుల్ డిజిట్ స్కోరు అందుకోలేకపోయారు. పేసర్ వస్ట్రార్కర్ (3/6), పూనమ్ యాదవ్ (2/0), అనుజ్ పాటిల్ (2/9), పాండే (1/2) మలేసియా ఇన్నింగ్స్‌ను పేకమేడలా కూల్చారు. మిథాలీకి మ్యాన్ ఆఫ్ ద ప్లేయర్ అవార్డు లభించింది.

తాజా వార్తలు

©2019 APWebNews.com. All Rights Reserved.