ఐపీఎల్ కింగ్స్‌కు చెన్నై ఘన స్వాగతం...!

ఈయేటి ఐపీఎల్ విజేత చెన్నై సూపర్‌కింగ్స్(సీఎస్‌కే)కు సొంతగడ్డపై ఘనస్వాగతం లభించింది. కప్ గెలిచి సోమవారం చెన్నైకి చేరుకున్న ధోనీసేనకు అభిమానులు బ్రహ్మరథం పట్టారు.

ఎయిర్‌పోర్ట్ నుంచి బసకు దిగిన క్రౌన్ ప్లాజా హోటల్ వరకు విజిల్‌పోడు ఫ్యాన్స్ జట్టు బస్సును అనుసరిస్తూ ముందుకు కదిలారు. రోడ్లకు ఇరువైపులా బారులు తీరిన అభిమానులకు ఆటగాళ్లు అభివాదం చేశారు. ట్యూటీకోరన్ కాల్పుల నేపథ్యంలో తమిళనాడులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నా..తమ అభిమాన జట్టుకు ఊహించని రీతిలో స్వాగతం లభించింది. కిక్కిరిసిన అభిమానుల మధ్య ఆటగాళ్లకు పూలమాలలతో సీఎస్‌కే ప్రతినిధులు సాదర స్వాగతం పలికారు. ఆ తర్వాత జట్టు యాజమాని, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు ఎన్ శ్రీనివాసన్..ఆటగాళ్లను అభినందించారు. నగరంలోని తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన గుడిలో ట్రోఫీని ఉంచి సీఎస్‌కే సీఈవో విశ్వనాథన్ ప్రత్యేక పూజలు జరిపించారు. కావేరీ జలవివాదం నేపథ్యంలో సొంత ఇలాఖాలో మ్యాచ్‌లు ఆడకపోయినా..ధోనీసేన కప్ గెలువడంపై అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు. సీఎస్‌కే యాజమాన్యం రాత్రి ఏర్పాటు చేసే విందులో ఆటగాళ్లందరూ పాల్గొననున్నారు.

ధోనీ కెప్టెన్సీ వల్లే: ఫ్లెమింగ్

ఐపీఎల్ టైటిల్ గెలువడంలో ధోనీ కెప్టెన్సీ కీలకమని మీడియా సమావేశంలో చీఫ్ కోచ్ స్టీవెన్ ఫ్లెమింగ్ అన్నాడు. ధోనీ నాయకత్వ లక్షణాల వల్లనే చెన్నై మూడో టైటిల్ అందుకుందని కోచ్ చెప్పుకొచ్చాడు. జట్టులోని ఆటగాళ్లపై మహీ ప్రభావం చాలా ఉంది. సహచర ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం నింపుతూ వారిలోని ప్రతిభను వెలికితీయడంలో ధోనీ ముందుంటాడు. దీనికి రాయుడు సరైన ఉదాహరణ. జాతీయ జట్టులోకి వస్తూ పోతున్న రాయుడుపై నమ్మకముంచుతూ అద్భుతమైన ఫలితం రాబట్టాడు. షేన్ వాట్సన్ అంచనాలకు మించి రాణించాడు అని ఫ్లెమింగ్ అన్నాడు.

తాజా వార్తలు

©2019 APWebNews.com. All Rights Reserved.