చెన్నై, హైదరాబాద్‌ మధ్య నేడు తొలి క్వాలిఫయర్‌...!

ఐపీఎల్‌–11 ప్రారంభానికి ముందు సన్‌రైజర్స్, సూపర్‌ కింగ్స్‌ రెండింటి పయనంపై అనుమానాలు, అనిశ్చితి. అయితే, వాటిని లీగ్‌ ప్రారంభం నుంచే పటాపంచలు చేస్తూ రెండు జట్లు పోటీకి ఎదురొడ్డాయి.

కఠిన పరిస్థితులను తట్టుకుని టాప్‌–2లో నిలిచాయి. స్వల్ప స్కోర్లే చేసినా కట్టుదిట్టంగా బంతులేసే భీకర బౌలింగ్‌ దళం హైదరాబాద్‌ను గెలిపించగా, ఎంతటి భారీ లక్ష్యాన్నైనా కొట్టిపడేసే దుర్బేధ్యమైన బ్యాటింగ్‌ బలగం చెన్నైని ముందుకు నడిపించింది. మంగళవారం ముంబైలోని వాంఖెడేలో జరగనున్న తొలి క్వాలిఫయర్‌ మ్యాచ్‌ను బంతికి, బ్యాట్‌కు మధ్య సిసలైన సమరంగా పేర్కొనవచ్చు. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు చేరుకుంటుంది. ఓడిన జట్టుకు రెండో క్వాలిఫయర్‌ రూపంలో ఫైనల్‌ బెర్త్‌ దక్కించుకునేందుకు మరో అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో రెండు జట్ల బలాలేమిటి? బలహీనతలేమిటి? అని విశ్లేషిస్తే...!  

బ్యాటింగ్‌ ఆల్‌రౌండర్లు, బౌలింగ్‌ ఆల్‌రౌండర్లతో ఆడుతున్నది పదకొండు మందా..? లేక పదముగ్గురా? అన్నట్లుంటుంది చెన్నైను చూస్తే. ఆదివారం పంజాబ్‌పై మ్యాచ్‌లో పేసర్‌ దీపక్‌ చహర్‌ ఇన్నింగ్సే ఇందుకో ఉదాహరణ. జట్టుగానే అత్యంత పటిష్ఠం అనుకుంటే... దానికి కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని వ్యూహాలు తోడైతే తిరుగేముంటుంది? ఓపెనర్లు వాట్సన్, అంబటి రాయుడు తిరుగులేని ఫామ్‌లో ఉండగా, రైనా సరైన సమయంలో జోరందుకున్నాడు. బిల్లింగ్స్, ధోని, బ్రేవోలతో మిడిలార్డర్‌ నిండుగా కనిపిస్తోంది. జడేజా, హర్భజన్‌ల స్పిన్, చహర్, శార్దుల్‌ ఠాకూర్, ఇన్‌గిడిల పేస్‌ను తట్టుకోవడం ఎంతటి బ్యాట్స్‌మెన్‌కైనా కష్టమే. అయితే, బ్యాట్స్‌మన్‌గా డు ప్లెసిస్, బిల్లింగ్స్‌లో ఎవరిని ఎంచుకుంటారో చూడాలి. ఈ ఒక్కటి తప్ప మిగతా పేర్లలో పెద్దగా మార్పు ఉండకపోవచ్చు. దీనికి తగ్గట్లే క్వాలిఫయర్స్‌కు సన్నాహకమా? అన్నట్లు చివరి లీగ్‌ మ్యాచ్‌లో వనరులన్నింటినీ పరీక్షించుకుని సంసిద్ధమైంది సూపర్‌ కింగ్స్‌. బలాబలాల రీత్యా సమంగా కనిపిస్తున్నా, పెద్దగా లోపాలు లేనందున చెన్నై వైపే మొగ్గు ఎక్కువగా కనిపిస్తోంది.  

©2019 APWebNews.com. All Rights Reserved.