చెన్నై చేతిలో ఓడి.. ఇంటిబాట పట్టిన పంజాబ్..!

 

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)తాజా సీజన్‌లో ప్లేఆఫ్‌కు చేరాలన్న కింగ్స్‌ పంజాబ్‌ ఆశలు నెరవేరలేదు. ఆదివారం చెన్నై సూపర్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కింగ్స్‌ పంజాబ్‌ 5 వికెట్ల తేడాతో ఓటమి పాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది.

ఫలితంగా ఏడు విజయాలతో ఉన్న రాజస్తాన్‌ రాయల్స్‌ ప్లేఆఫ్‌ బెర్తును ఖాయం చేసుకుంది. అంతకుముందు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌, కోల్‌కతా నైట్‌రైడర్స్‌లు ప్లేఆఫ్‌కు చేరిన జట్లు కాగా, చివరిగా రాజస్తాన్‌ రాయల్స్‌ ప్లేఆఫ్‌లోకి ప్రవేశించింది.

చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో కింగ్స్‌ పంజాబ్‌ 154 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ లక్ష్యాన్ని చెన్నై ఆడుతూ పాడుతూ ఛేదించింది.  చెన్నై విజయంలో సురేశ్‌ రైనా(61 నాటౌట్‌; 48 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక‍్సర్లు), దీపక్‌ చాహర్‌(‌39; 20 బంతుల్లో 1 ఫోర్‌, 3 సిక్సర్లు)లు ముఖ్య భూమిక పోషించారు. లక్ష్యాన్ని ఛేదించే క‍్రమంలో సీఎస్‌కే అంబటి రాయుడు(1)వికెట్‌ను ఆదిలోనే కోల్పోయింది. ఆ తర్వా డుప్లెసిస్‌(14), శ్యామ్‌ బిల్లింగ్స్‌(0)లు వరుస బంతుల్లో ఔట్‌ కావడంతో చెన్నై 27 పరుగులకే మూడు వికెట్లను నష్టపోయింది. ఆపై నాల్గో వికెట్‌కు సురేశ్‌ రైనాతో కలిసి 31 పరుగుల భాగస్వామ్యం సాధించిన తర్వాత హర్భజన్‌ సింగ్‌(19) పెవిలియన్‌ చేరాడు. ఆ తరుణంలో రైనా-దీపక్‌ చాహర్‌ల జోడి చెన్నై స్కోరు బోర్డును చక్కదిద్దింది. వీరిద్దరూ 56 పరుగుల జోడించిన తర్వాత చాహర్ ఐదో వికెట్‌గా నిష్క్రమించాడు. దాంతో చెన్నై 114 పరుగుల వద్ద ఐదో వికెట్‌ను కోల్పోయింది. ఇక చివర్లో రైనా-ధోని(16 నాటౌట్‌; 7 బంతుల్లో 1 ఫోర్‌, 1 సిక్స్‌)ల జంట మరో వికెట్‌ పడకుండా ఆడటంతో చెన్నై 19.1 ఓవర్లలో విజయాన్ని అందుకుంది.అంతకముందు విధ్వంసక ఓపెనర్లు క్రిస్‌గేల్ (0), కేఎల్ రాహుల్‌(7)తో పాటు హిట్టర్ అరోన్ ఫించ్ (4) కూడా సింగిల్ డిజిట్‌కే పరిమితమవడంతో 4 ఓవర్లు ముగిసే సమయానికి 16/3తో పంజాబ్ ఆత్మరక్షణలో పడిపోయింది. ఈ దశలో మనోజ్ తివారి (35: 30 బంతుల్లో 3x4, 1x6), డేవిడ్ మిల్లర్ (24: 22 బంతుల్లో 1x4, 1x6) కాసేపు చెన్నై బౌలర్లకి ఎదురునిలిచినా.. జట్టు స్కోరు 76 వద్ద మనోజ్ తివారి, 80 వద్ద మిల్లర్ ఔటైపోయారు. దీంతో.. పంజాబ్‌ జట్టు తక్కువ స్కోరుకే పరిమితమయ్యేలా కనిపించింది. కానీ.. ఆఖర్లో కరుణ్ నాయర్ మెరుపు అర్ధశతకం బాదడంతో 153 పరుగులైనా చేయగలిగింది.

తాజా వార్తలు

©2019 APWebNews.com. All Rights Reserved.