పోరాడి ఓడిన హైదరాబాద్..!

శక్తివంచన లేకుండా చివరి వరకు పోరాడినా హైదరాబాద్‌ లక్ష్యాన్ని అందుకోలేకపోయింది. ప్లే ఆఫ్స్‌ పరుగులో రాయల్‌ చాలెంజర్స్‌కు మరో కీలక విజయం దక్కింది. గురువారం రెండు జట్ల మధ్య ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో

టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ ఏబీ డివిలియర్స్‌ (39 బంతుల్లో 69; 12 ఫోర్లు, 1 సిక్స్‌), మొయిన్‌ అలీ (34 బంతుల్లో 65; 2 ఫోర్లు, 6 సిక్స్‌లు) అద్భుత భాగస్వామ్యం, గ్రాండ్‌హోమ్‌ (17 బంతుల్లో 40; 1 ఫోర్, 4 సిక్స్‌లు), సర్ఫరాజ్‌ ఖాన్‌ (8 బంతుల్లో 22 నాటౌట్‌; 3 ఫోర్లు, 1 సిక్స్‌)ల మెరుపు ఇన్నింగ్స్‌లతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 218  పరుగులు చేసింది. అనంతరం కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ (42 బంతుల్లో 81; 7 ఫోర్లు, 5 సిక్స్‌లు), మనీశ్‌ పాండే (38 బంతుల్లో 62 నాటౌట్‌; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) కడవరకు పోరాడినా సన్‌రైజర్స్‌ 3 వికెట్లు కోల్పోయి 204 పరుగులు మాత్రమే చేయగలిగింది. చివరి ఓవర్లో 20 పరుగులు అవసరం కాగా మొదటి బంతికే విలియమ్సన్‌ అవుట్‌ కావడం దెబ్బతీసింది. చివరి ఓవర్‌లో ఐదు పరుగులే రావడంతో బెంగళూరు 14 పరుగులతో విజయం సాధించింది. సీజన్‌లో వరుసగా మూడో మ్యాచ్‌లోనూ సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లు లయ తప్పారు. ఓపెనర్లు పార్థీవ్ పటేల్(1)ని తొలి ఓవర్‌లోనే ఔట్ చేసి హైదరాబాద్‌కి సందీప్ శర్మ శుభారంభమివ్వగా.. తర్వాత కొద్దిసేపటికే కెప్టెన్ విరాట్ కోహ్లీ (12)కి రషీద్ ఖాన్ బోల్తా కొట్టించడంతో బెంగళూరు 38/2తో ఇబ్బందుల్లో పడింది. ఈ దశలో క్రీజులోకి వచ్చిన ఏబీ డివిలియర్స్, మొయిన్‌ అలీతో కలిసి మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఈ ఇద్దరూ మూడో వికెట్‌కి అభేద్యంగా 107 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో బెంగళూరు జట్టు భారీ స్కోరు బాటలు వేసుకుంది. ప్రమాదకరంగా మారిన ఈ ఇద్దర్నీ రెండు బంతుల వ్యవధిలో రషీద్ ఖాన్ ఔట్ చేసినా.. ఆఖర్లో గ్రాండ్ హోమ్, సర్ఫరాజ్ ఖాన్ (22 నాటౌట్: 8 బంతుల్లో 3x4, 1x6) బ్యాట్ ఝళిపించేశారు. పేలవ బౌలింగ్‌కి తోడు ఫీల్డింగ్ తప్పిదాలు కూడా సన్‌రైజర్స్ హైదరాబాద్‌ని దారుణంగా దెబ్బతీశాయి. మొయిన్ అలీ క్యాచ్‌ని శిఖర్ ధావన్, గ్రాండ్ హోమ్ క్యాచ్‌ని రషీద్ ఖాన్ జారవిడచడం‌తో బెంగళూరు హిట్టర్లకి లైసెన్స్ ఇచ్చినట్లయింది. భువనేశ్వర్ కుమార్ స్థానంలో జట్టులోకి వచ్చిన ఫాస్ట్ బౌలర్ బసిల్ థంపీ 4 ఓవర్లు వేసి ఒక వికెట్ కూడా పడగొట్టలేకపోగా.. ఏకంగా 70 పరుగులిచ్చాడు. పదేళ్ల ఐపీఎల్‌ చరిత్రలో ఈ తరహాలో ఏ బౌలరూ ఎక్కువ పరుగులివ్వలేదు.  

తాజా వార్తలు

©2019 APWebNews.com. All Rights Reserved.