భళా బెంగుళూరు ....!

ఐపీఎల్ 2018 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు మళ్లీ ప్లేఆఫ్ రేసులోకి వచ్చింది. ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో శనివారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో ఏబీ డివిలియర్స్ (72 నాటౌట్: 37 బంతుల్లో 4x4, 6x6), కెప్టెన్ విరాట్ కోహ్లి (70: 40 బంతుల్లో 7x4, 3x6) చెలరేగడంతో బెంగళూరు జట్టు 5 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది.

అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ జట్టు.. యువ హిట్టర్లు రిషబ్ పంత్ (61: 34 బంతుల్లో 5x4, 4x6), అభిషేక్ శర్మ (46 నాటౌట్: 19 బంతుల్లో 3x4, 4x6) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడటంతో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది.చేజింగ్ లో   ఓపెనర్లు మొయిన్ అలీ (1), పార్థీవ్ పటేల్ (6) నిరాశపరిచినా.. విరాట్ కోహ్లి - ఏబీ డివిలియర్స్ జోడి మూడో వికెట్‌కి అభేద్యంగా 118 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి బెంగళూరు విజయానికి బాటలు వేశారు. అర్ధశతకం అనంతరం జట్టు స్కోరు 136 వద్ద కోహ్లీ ఔటవగా.. తర్వాత వచ్చిన మన్‌దీప్ సింగ్ (13), సర్ఫరాజ్ ఖాన్ (11) దూకుడుగా ఆడే ప్రయత్నంలో వికెట్ చేజార్చుకోవడంతో ఢిల్లీ శిబిరంలో గెలుపు ఆశలు చిగురించాయి. అయితే ఆఖర్లో మళ్లీ డివిలియర్స్ దూకుడుగా ఆడి వరుస సిక్సర్లతో ఆరు బంతులు మిగిలి ఉండగానే గెలుపు లాంఛనాన్ని 187/5తో పూర్తి చేశాడు. టోర్నీలో బెంగళూరుకి ఇది నాలుగో విజయంకాగా.. ఆరు ఓటములతో ప్లేఆఫ్ రేసు నుంచి పూర్తిగా ఢిల్లీ నిష్క్రమించింది. బెంగళూరు జట్టు మిగిలిన మూడు మ్యాచ్‌ల్లోనూ భారీ తేడాతో గెలవగలిగితే.. ప్లేఆఫ్ చేరే అవకాశాలు ఉన్నాయి. 

తాజా వార్తలు

©2019 APWebNews.com. All Rights Reserved.