ఉత్కంఠ మ్యాచ్‌లో ఓడిన చెన్నై..!

ఐపీఎల్ 2018 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టు మళ్లీ పుంజుకుంది. టోర్నీలో ప్లేఆఫ్ ఆశలు నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఓపెనర్ జోస్ బట్లర్ (95 నాటౌట్: 60 బంతుల్లో 11x4, 2x6) బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడటంతో చెన్నై సూపర్ కింగ్స్‌పై 4 వికెట్ల తేడాతో గెలుపొందింది.

177 పరుగుల లక్ష్య ఛేదనలో రాజస్థాన్ విజయానికి 12 బంతుల్లో 28 పరుగులు అవసరమైన దశలో గౌతమ్ రెండు సిక్సర్లు బాదగా.. సమీకరణం.. 6 బంతుల్లో 12 పరుగులుగా మారిపోయింది. ఈ దశలో బౌలింగ్‌కి వచ్చిన డ్వేన్ బ్రావో ఓవర్‌లో ఓ సిక్స్, మూడు డబుల్స్ తీసిన బట్లర్.. ఒక బంతి మిగిలి ఉండగానే జట్టుని గెలుపు సంబరాల్లో ముంచెత్తాడు. అంతకముందు సురేశ్ రైనా (52: 35 బంతుల్లో 6x4, 1x6), షేన్ వాట్సన్ (39: 31 బంతుల్లో 2x4, 2x6), కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని (33 నాటౌట్: 23 బంతుల్లో 1x4, 1x6) నిలకడగా ఆడటంతో తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. ఛేదనలో బెన్‌ స్టోక్స్ (11), రహానె (4), సంజు శాంసన్ (21), ప్రశాంత్ చోప్రా (8) విఫలమైనా.. ఆఖర్లో స్టువర్ట్ బిన్నీ (22: 17 బంతుల్లో 1x4, 1x6), గౌతమ్ (13: 4 బంతుల్లో 2x6) హిట్టింగ్‌తో బట్లర్‌పై ఒత్తిడి తగ్గించారు. డెత్ ఓవర్లలో బట్లర్ ఇచ్చిన క్యాచ్‌లను షేన్ వాట్సన్, మహేంద్రసింగ్ ధోనీ జారవిడచడం చెన్నై విజయావకాశాల్ని దూరం చేసింది. 

తాజా వార్తలు

©2018 APWebNews.com. All Rights Reserved.