ప్లేఆఫ్ కు చేరిన హైదరాబాద్..!

ఐపీఎల్ 2018 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఘన విజయంతో సగర్వంగా ప్లేఆఫ్‌ బెర్తుని ఖాయం చేసుకుంది. ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో గురువారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో బౌలర్లు సమష్టిగా విఫలమైనా..

ఓపెనర్ శిఖర్ ధావన్ (92 నాటౌట్: 50 బంతుల్లో 9x4, 4x6), కెప్టెన్ కేన్ విలియమ్సన్ (83 నాటౌట్: 53 బంతుల్లో 8x4, 2x6) మెరుపు అర్ధశతకాలు బాదడంతో హైదరాబాద్ జట్టు 9 వికెట్ల తేడాతో అలవోక విజయాన్ని అందుకుంది. అంతకముందు యువ హిట్టర్ రిషబ్ పంత్ (128 నాటౌట్: 63 బంతుల్లో 15x4, 7x6) ఆకాశమే హద్దుగా చెలరేగి శతకం బాదడంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. ఛేదన ఆరంభంలోనే హైదరాబాద్ జట్టు ఓపెనర్ అలెక్స్ హేల్స్ (14) వికెట్‌ని చేజార్చుకున్నా.. ధావన్ - విలియమ్సన్ జోడి రెండో వికెట్‌కి అభేద్యంగా 102 బంతుల్లో 176 పరుగుల అజేయ భాగస్వామ్యం నెలకొల్పి జట్టుకి తిరుగులేని విజయాన్ని అందించారు. పవర్‌ ప్లే నుంచే దూకుడుగా ఆడిన ఈ జోడి.. ఏ దశలోనూ ఢిల్లీ బౌలర్లకి అవకాశమివ్వకుండా ధాటిగా ఆడి మరో 7 బంతులు మిగిలి ఉండగానే జట్టుకి విజయాన్ని అందించింది. దీంతో టోర్నీలో వరుసగా ఆరో విజయాన్ని అందుకున్న హైదరాబాద్ జట్టు మరో మూడు మ్యాచ్‌లు ఉండగానే ప్లేఆఫ్ బెర్తు ఖాయం చేసుకోగా.. మొత్తంగా ఎనిమిదో ఓటమితో ఢిల్లీ ప్లేఆఫ్ ఆశల్ని వదులుకుంది. 

©2018 APWebNews.com. All Rights Reserved.