తాజా వార్తలు

మూడో టీ20 : వరుసగా నాలుగు ఫోర్లు బాదిన మంధాన 

జొహానెస్‌బర్గ్‌ : హర్మన్‌ ప్రీత్‌ సారథ్యంలోని భారత మహిళల జట్టు దక్షిణాఫ్రికాతో మూడో టీ20 మ్యాచ్‌లో తలపడుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన దక్షిణాఫ్రికా అమ్మాయిలు ఫీల్డింగ్‌ ఎంచుకున్నారు. మిథాలి రాజ్‌, స్మృతి మంధాన ఓపెనర్లుగా బరిలోకి దిగారు. అయితే ఆదిలోనే భారత్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. కాప్‌ వేసిన మొదటి ఓవర్‌ ఐదో బంతికి మిథాలి(0) లీకి క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగింది. అనంతరం  హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌ బ్యాటింగ్‌కు వచ్చింది. ప్రస్తుతం 3 ఓవర్లు ముగిసేసరికి భారత్‌ వికెట్‌ నష్టానికి 19 పరుగులు చేసింది. రెండో ఓవర్‌లో మంధాన వరుసగా నాలుగు ఫోర్లు బాది సఫారీ బౌలర్లకు చుక్కలు చూపించింది. మంధాన 18, కౌర్‌ 1 పరుగుతో క్రీజులో ఉన్నారు.

దక్షిణాఫ్రికాతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత్‌ 2-0 ఆధిక్యంతో ఉన్న విషయం తెలిసిందే. ఈ ఒక్క మ్యాచ్‌ గెలిస్తే దక్షిణాఫ్రికా గడ్డపై ఒకే పర్యటనలో రెండు సిరీస్‌లు సొంతం చేసుకున్న మహిళల తొలి జట్టుగా భారత్‌ రికార్డు సృష్టించనుంది.

పీసీబీ బ్రాండ్‌ అంబాసిడర్‌గా అక్తర్‌
ఇస్లామాబాద్‌ : రావల్పిండి ఎక్స్‌ప్రెస్‌, పాక్‌ మాజీ క్రికెటర్‌ షోయబ్‌‌ అక్తర్‌ పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు(పీసీబీ) బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమితులయ్యారు. పీసీబీ ఛైర్మన్‌ నజామ్‌ సేథీతో కలిసి అక్తర్‌ పనిచేయనున్నారు. అక్తర్‌ను బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమిస్తున్నట్లు ఛైర్మన్‌ వెల్లడించారు.

షోయబ్‌ అక్తర్‌ను ఛైర్మన్‌కు క్రికెట్‌ వ్యవహారాల సలహాదారుడు, పీసీబీ బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమిస్తున్నట్లు నజమ్‌ సేథీ ట్విటర్‌లో వెల్లడించారు. దీనికి వెంటనే అక్తర్‌ స్పందిస్తూ.. ‘మీతో కలిసి పనిచేయడానికి ఎదురుచూస్తున్నా.. పాక్‌ క్రికెట్‌ను పీసీబీ మరో స్థాయికి తీసుకువెళ్తుందని ఆశిస్తున్నా. బ్రాండ్‌ అంబాసిడర్‌గా నాకు అవకాశం లభించడం గౌరవంగా భావిస్తున్నా. ఆటగాడిగా పాక్‌ జట్టుకు నేను ఏవిధంగా సేవలు అందించానో అదే రీతిలో ఇక్కడ పనిచేస్తాను’ అని అక్తర్‌ ట్వీట్‌ చేశారు.

డిఫెండింగ్ ఛాంపియన్‌గా ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్‌ బరిలోకి దిగిన పీవీ సింధు.. టైటిల్ పోరులో వెనుకడుగు వేసింది. ఢిల్లీలోని సిరి ఫోర్ట్ కాంప్లెక్స్ వేదికగా ఆదివారం జరిగిన ఇండియా ఓపెన్ ఫైనల్ మ్యాచ్‌లో ప్రపంచ నంబర్ 11 బీవెన్ ఝాంగ్ (యూఎస్ఏ) చేతిలో సింధు ఓడిపోయింది. దీంతో రెండోసారి ఛాంపియన్‌గా నిలిచే అవకాశాన్ని సింధు చేజార్చుకుంది. ఈసారి రజతంతో సరిపెట్టుకుంది. ఒక గంటా 9 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సింధుపై ఝాంగ్ 21-18, 11-21, 22-20 తేడాతో గెలుపొందింది. ఐదో సీడ్‌గా ఈ సిరీస్‌లోకి అడుగుపెట్టిన ఝాంగ్‌కు కెరీర్‌లో తొలి మేజర్ టైటిల్ ఇదే కావడం విశేషం.

©2018 ApWebNews.com. All Rights Reserved.