చెక్కుడు సంచుల చక్రవర్తి..!

 

89 సంవత్సరాల వయసులో ఉన్న మహిళలు ఏం చేస్తారు? రామ రామ అనుకుంట కాలం వెళ్లదీస్తారు. మనుమలు, మునిమరాళ్లతో కాలాన్ని గడుపుతారు. లతికా చక్రవర్తి మాత్రం అలా చేయడం లేదు. చెక్కుడు సంచులు కుట్టి అమ్ముతున్నది. అదీ ఓ వెబ్‌సైట్ ప్రారంభించి..!

తయారు చేసిన వస్తువులకు గడువు తేదీ ఉంటుంది. కానీ మనుషుల ఆలోచనలకు గడువు తేదీ ఉండదు. ఎనిమిది పదుల వయసులో కూడా తన సృజనాత్మకతకు పదును పెట్టి వచ్చిన ఆలోచనను ఆచరణలో పెట్టిందీ బామ్మ. అస్సోంలోని దుబ్రిలో పుట్టిన ఈమె మెరిట్ స్టూడెంట్. చదువు అనంతరం సర్వేయర్ ఆఫీసర్‌ను పెళ్లి చేసుకొని భర్త ఉద్యోగం కోసం దేశంలోని చాలా ప్రాంతాల్లో తిరిగారు. చిన్నపిల్లలకు బట్టలు కుట్టడం పిల్లలు పెద్దయ్యాక చిన్నవైన బట్టలతో బొమ్మలు తయారు చేయడం అలవాటుగా చేసుకున్నారు. పాత బట్టలను, కుర్తాలను, చీరలను చింపి చిన్న సంచులు కుట్టడం నాలుగేళ్ల క్రితం నుంచి ప్రారంభించింది. ఇప్పటి వరకు 300కు పైగా బ్యాగులు కుట్టింది. వాటిని ఫ్యామిలీ ఫంక్షన్‌లలో, కుటుంబ సభ్యులకు, చుట్టాలకు బహుమతిగా ఇచ్చేవారు. లతిక చక్రవర్తి మనుమడు జాయ్ చక్రవర్తి జర్మనీలో ఉంటాడు. అతనికి ఈ నానమ్మ చేసే బ్యాగులంటే ఇష్టం. చేసిన వాటిని అమ్మడం కోసం నానమ్మ పేరు మీద లితిక బ్యాగ్స్ అని ఆన్‌లైన్ వెంచర్ ప్రారంభించి ఇచ్చాడు. ఐదు వందల రూపాయల నుంచి పదిహేనువందల రూపాయల ధరలకు ఈ సైటులో బ్యాగులు అందుబాటులో ఉన్నాయి. మన దేశంలోనే కాకుండా జర్మనీ, న్యూజిలాండ్, ఒమన్‌ల నుంచి కూడా ఆర్డర్లు వస్తున్నాయి. మంచి పని చేయడానికి వయసుతో సంబంధం లేదు అంటున్నారు లతిక చక్రవర్తి.

 

 
©2019 APWebNews.com. All Rights Reserved.