పునాదిలేని పురాతన కట్టడం!

ఒక భవనం కట్టాలంటే ముందుగా పునాది తీయాలి. కానీ ఆ ఐదంతస్థుల మేడను పునాది లేకుండానే నిర్మించారు. అంతేకాదు లోపలకి వెళ్లడానికి ప్రధాన ద్వారం కూడా లేదు. పై అంతస్థుకు వెళ్దామంటే మెట్లు కూడా కనిపించవు. ఈ ప్రత్యేకతలన్నీ హవా మహల్‌లో కనిపిస్తాయి.

రాజస్థాన్‌లో ఉన్న ప్రసిద్ధ పురాతన కట్టడం హవా మహల్‌. 1799లో మహారాజా సవాయ్‌ ప్రతాప్‌ సింగ్‌ ఈ మహల్‌ను నిర్మించారు.
  • ‘హవా మహల్‌’ అంటే గాలి మేడ అని అర్థం. ఈ మహల్‌లో ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ఐదంతస్థుల్లో ఉన్న ఈ మహల్‌కు 953 కిటికీలున్నాయి. గాలి ధారాళంగా వస్తుంది కాబట్టి మహల్‌ లోపల మండు వేసవిలోనూ చల్లగా ఉంటుంది.
  • హవా మహల్‌ను డిజైన్‌ చేసింది లాల్‌ చాంద్‌ ఉస్తా. జైపూర్‌ రాజ కుటుంబానికి చెందిన మహిళల కోసం ఈ మహల్‌ను ప్రత్యేకంగా డిజైన్‌ చేసి నిర్మించారు. స్థానిక మార్కెట్‌ ప్రాంతంలో రోజూ వేసే నాటకాలను రాజకుటుంబ మహిళలు చూడటం కోసం దీన్ని నిర్మించారు. బయట నుంచి చూసే వారికి వారు కనిపించరు. హవా మహల్‌ కృష్ణుని కిరీటం ఆకారంలో ఉంటుంది. రాజా సవాయ్‌ ప్రతాప్‌ సింగ్‌ కృష్ణుని భక్తుడు. అందుకే అలా నిర్మించాడని చెబుతారు.
  • మొఘల్‌, రాజ్‌పుత్‌ల నిర్మాణశైలి ఇందులో కనిపిస్తుంది. ఎరుపు, పింక్‌ సాండ్‌స్టోన్‌తో ఈ భవనాన్ని నిర్మించారు.
  • పునాది లేకుండా నిర్మించిన అతి పెద్ద భవనంగా హవా మహల్‌కు గుర్తింపు ఉంది.
  • ఇంత గొప్పగా నిర్మించిన మహల్‌కు ముందువైపు ప్రవేశద్వారం లేదు. ఒకవేళ వెళ్లాలనుకుంటే వెనకవైపు ఉన్న ద్వారం గుండా వెళ్లాల్సిందే.
  • పై అంతస్థులకు వెళ్లడానికి మెట్లు కూడా ఉండవు. ర్యాంప్‌పై నడుచుకుంటూ చేరుకోవాల్సిందే. ఈ మహల్‌ను సందర్శించడానికి ఏటా ప్రపంచం నలుమూలల నుంచి పర్యాటకులు వస్తుంటారు.
 ‘విండ్‌ ప్యాలెస్‌’గా గుర్తింపు పొందిన ఈ నిర్మాణంలో 953 కిటికీలు ఉన్నాయి. ప్రసిద్ధ కట్టడంగా గుర్తింపు పొందిన ఈ మహల్‌కు ప్రవేశద్వారం లేదు. ఒకవేళ వెళ్లాలనుకుంటే వెనకవైపు ఉన్న ద్వారం గుండా వెళ్లాల్సిందే.
©2019 APWebNews.com. All Rights Reserved.