ఆ ఆర్నాల్డ్‌కు మించి.!

 

వ్యక్తిగత ప్రతిభతో వందలాది మంది ప్రముఖులు చరిత్రకెక్కిన ఉదంతాలు ఎన్నో చదివాం...చూశాము. ఇతడూ ప్రముఖుడే కానీ కథే కాస్త డిఫరెంట్‌గా ఉంటుంది.

జీవిత పోరాటం చేసి గెలిచినవారివందరివీ విలక్షణ బతుకు పోరాటాలే. కానీ ఈ ఆర్నాల్డ్‌ది ఇంకాస్త డిఫరెంట్‌. హాలీవుడ్‌కు చెందిన ఆ ఆర్నాల్డ్‌ స్టోరీకి మించిన కథా వస్తువ దొరుకుతుంది. టీనేజ్‌లోనే బాడీ బిల్డర్‌గా ఓ టైటిల్‌ను అందుకుని ఎంతో ఉన్నతంగా ఎదగాలనుకున్న ఈ ఆర్నాల్డ్‌ను క్యాన్సర్‌, పక్షవాతం కదలకుండా చేశాయి. రెండు కాళ్లు చచ్చుబడి జీవిత కలల్ని అడ్డంగా విరిచేసింది. మనోబలంతో వైకల్యాన్ని అధిగమించి. బలహీనతను దరి చేరనీయకుండా దేన్నైనా సాధించ వచ్చునని నిరూపించి... 'ఇండియా ఆర్నాల్డ్‌'గా ఖ్యాతి గడించాడు. పంజాబ్‌కు చెందిన 29 ఏళ్ల ఆనంద్‌ ఆర్నాల్డ్‌ భారత్‌లో తొలి వీల్‌చైర్‌ బాడీ బిల్డర్‌గా విజేతగా నిలిచాడు.క్రీడా నేపథ్యం ఉన్న కుటుంబంలో నవంబర్‌ 11, 1986లో ఆనంద్‌ జన్మించాడు. తండ్రి వైమానిక దళ విశ్రాంత ఉద్యోగి, మామయ్య భారత హాకీ జట్టు సభ్యుడిగా ఒలింపిక్స్‌లో ప్రాతినిధ్యం వహించాడు. తాతయ్య కూడా జాతీయ స్ధాయి క్రీడాకారుడే. పెద్దన్నయ్య మాంచి బాడీ బిల్డరే. వీరి ప్రభావం ఆనంద్‌ ఆర్నాల్డ్‌పై పడకుండా ఎలా ఉంటుంది. ముఖ్యంగా పెద్దన్నయ్య చేసే కసరత్తులు ఆనంద్‌ను పొద్దున్నే నిద్ర లేపేసేవి. తానూ కూడా దండీలు తీస్తూ జబ్బలు చరుచుకుని చూసుకునేవాడు. అదీ 13 ఏళ్ల ప్రాయంలోనే డిసైడేపోయాడు. ఎలాగన్నా అన్నయ్యలా బాడీ బిల్డర్‌ అయిపోవాలని. ఆయన వద్దే శిక్షణ వద్దే ప్రారంభించాడు. బాగా రాటుదేలేందుకు ఎక్కువ సమయం పట్టలేదు. ఆ వయసుకే పోటీల్లోను పాల్గొన్నాడు. తొలి ప్రయత్నంలోనే మిస్టర్‌ లూధియానా టైటిల్‌తో ఆనంద్‌ సత్తా చాటాడు. ఈ వయస్సులో అతనికి శరీరం సహకరించడం గొప్ప విషయమనే చెప్పాలి. ఆనంద్‌ అద్భుతమని అతడి భవిష్యత్తు చాలా పెద్ద స్థాయిలో ఉండబోతోందని చర్చలు తీవ్రమయ్యాక ఓ అనుకోని విషయం జరిగింది. 15వ ఏట అతని జీవితం తలకిందులైపోయింది. ఉన్నపళంగా కాళ్లలో వణుకు మొదలవడంతో ఓ రోజు డాక్టరు వద్దకు అతన్ని తల్లిదండ్రులు తీసుకెళ్లారు. వారి గుండె చెరువయ్యే ఓ విషాదాన్ని వైద్యులు గుర్తించారు. ఆనంద్‌కు వెన్నెముక క్యాన్సర్‌ చివరి దశలో ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ఆపరేషన్‌ చేసి ఏర్పడిన కణితులను తొలగించారు. ఈ నేపథ్యంలో ఆనంద్‌ మంచం పట్టి... శిశువుగా మారిపోయాడు. కాళ్ల నుంచి మెడ వరకు ఏ అవయవం పనిచేయకపోవడంతో అన్ని మంచం నుంచి సాగడంతో మూడేళ్ల పాటు ప్రత్యక్ష నరకం చూశాడు. అతని తల్లి, అక్క మమకారంతో అతన్ని చంటి బిడ్డలా సాకి ఆరోగ్యం కోలుకునేలా చేశారు. వీల్‌ఛైర్‌ నుంచే శిక్షణ ప్రారంభించి..ఇంతటితో తన జీవితం అయిపోలేదని... మనోబలాన్ని పెంచుకున్న ఆనంద్‌ క్రమంగా కోలుకున్నాడు. పట్టుదలగా జిమ్‌కు వెళ్లి వర్కవుట్‌లు మొదలెట్టాడు. శరీరాన్ని అనువైన రీతిలో వంచాలంటే అవయవాలు అన్ని సక్రమంగా ఉంటేనే సాధ్యమవుతుంది. అతనిలో సంకల్ప బలం లక్ష్యం వైపు పదమని దారి చూపింది. తాను చేసే వర్కవుట్‌లకు అతని భుజాలు, ఇతర అవయవాలు సహకారం అందిస్తున్న విషయాన్ని గుర్తించిన ఆనంద్‌ వీల్‌చైర్‌పైనే వ్యాయామాన్ని చేయడం మొదలెట్టాడు. ప్రతిరోజు భుజాలు, బాహువులు, ఎదురు రొమ్ము, వీపు ఆకృతిని తీర్చిదిద్దే వ్యాయామాలు చేసేవాడు. అలా మిస్టర్‌ ఇండియా పోటీలకు తయారవుతానని చెప్పడంతో వ్యక్తిగత కోచ్‌ రవి పరాంశుర్‌ కోచింగ్‌ను మొదలెట్టారు. అమిత్‌ గిల్‌ అనే ఆనంద్‌ స్నేహితుడు రోజు జిమ్‌లో శిక్షణకు స్వయంగా వచ్చి తీసుకెళ్లేవాడు. దాతలు సహకారం అందించారు. అతనిలో పోటీ పడాలన్న కాంక్షకు బీజం పడింది. 18వ ఏట నుంచి మిస్టర్‌ బాడీ బిల్డింగ్‌ పోటీల్లో ప్రారంభించడం మొదలెట్టాడు. 2004 నుంచి 2013 వరకు మిస్టర్‌ పంజాబ్‌ను టైటిళ్లను, 2010 నుంచి మిస్టర్‌ నార్త్‌ ఇండియా, 2011, 2012, 2013ల్లో మిస్టర్‌ ఇండియా టైటిళ్లను తన ఖాతాలో జమ చేసుకున్నాడు. ఇప్పటి వరకు 41 టైటిళ్లను సాధించినట్లు తెలిపిన ఆనంద్‌ ప్రధాన లక్ష్యం మాత్రం భారత్‌లో అక్టోబర్‌లో జరిగే తొలి ప్రపంచ కప్‌ టోర్నీ. 125 దేశాల నుంచి బాడీబిల్డర్లు పాల్గొంటున్నారు. ఇది సొంత దేశం నుంచి ప్రారంభం కావడంతో 29 ఏళ్ల ఆనంద్‌ మిస్టర్‌ వరల్డ్‌ను సాధిస్తానన్న ధీమాను వ్యక్తం చేస్తున్నాడు. దేశానికి టైటిల్‌ అందించాలని తపన పడుతున్నాడు. తన జీవితాన్ని సినిమా తీస్తే నటించాలని ఉందని మనసులో కోరికను బయటపెట్టాడు. యూఎస్‌కు చెందిన అలెన్‌ ఉడ్‌మన్‌ రైటర్‌ ఆనంద్‌ జీవిత కధను 'వెయిట్‌లెస్‌: ఏ ట్రూ స్టోరీ ఆప్‌ కరేజ్‌ అండ్‌ ఇన్సిపిరేషన్‌' పుస్తకం రాసి ఆ దేశంలో ప్రచురించాడు. సాధించాలన్న పట్టుదల, నమ్మకం ఉంటే బలహీనతను అధిగమించవచ్చునని అతని జీవితాన్ని చదివినవారు ఇండియా ఆర్నాల్డ్‌ అని ఆ దేశంలో అంటే అంతకుమించే కథ ఉందన్నవారూ ఉన్నారు. 

©2019 APWebNews.com. All Rights Reserved.