మళ్లీ రాలేరు!

సహజంగా ఎక్కడైనా కాస్త వింతైన ప్రదేశం ఉంటే అక్కడికి వెళ్లి ఆ విశేషం ఏంటో తెలుసుకోవాలనే కుతూహలం కలుగుతుంది. ఆ కుతూహలంతో మీరు జమ్మూకాశ్మీర్‌లోని ఈ గుహలోకి వెళ్తే మాత్రం తిరిగి రాలేరు. ఎందుకంటే..

జమ్ముకాశ్మీర్‌లోని రిసీ జిల్లాలో ఓ శివాలయం ఉంది. దాని పేరు శివఖోరి. ఈ ఆలయంలో మహాశివుడు కొలువై ఉన్నాడని అక్కడి భక్తుల నమ్మకం. ఆ గుడిలో రెండు పావురాలుంటాయని, అవి పుణ్యం చేసిన వారికి మాత్రమే కనిపిస్తాయని కూడా ఒక నమ్మకం. అయితే.. ఈ దేవాలయం ఒక గుహలా ఉంటుంది. దాదాపు 200 మీటర్ల పొడవుండే ఈ గుహలోని శివలింగం స్వయం నిర్మిత శివలింగం అని స్థానికుల నమ్మకం. ఈ గుహ నుంచి అమర్‌నాథ్‌కి సొరంగమార్గం ఉందట. పరమ శివభక్తులుగా పిలువబడే అఘోరాలు, సాధువులు గతంలో ఈ సొరంగ మార్గం ద్వారా అమర్‌నాథ్ యాత్రకు వెళ్లారట. అలా వెళ్లిన సాధువులెవ్వరూ అక్కడికి చేరుకోలేదు. అలా అని తిరిగి కూడా రాలేదు. వాళ్లు ఏమై పోయారో ఇప్పటికీ ఎవరికీ తెలియదు. అప్పటి నుంచి ఈ గుహలోపలికి వెళ్లే మార్గం మూసివేశారు. కేవలం మహా శివరాత్రికి మూడు రోజుల ముందు శివఖోరి ఆలయాన్ని తెరుస్తారు. అద్భుతమైన ప్రకృతి నడుమ ఉన్న ఈ గుహాలయం చూడడానికి ఎంత అందంగా ఉంటుందో.. అందులోకి వెళ్లాలని చూస్తే అంత ప్రమాదమట.

©2019 APWebNews.com. All Rights Reserved.