మూసీ మహా విషాదానికి 110 ఏళ్ళు..!

 

మూసీ వరదల మహా విషాదానికి 110 సంవత్సరాలు గడిచాయి. సెప్టెంబర్ 27వ తేదీ అర్థరాత్రి వరకు కురిసిన భారీ వర్షాల కారణంగా వేలాది మంది జల సమాధి అయ్యారు. 1908 సెప్టెంబర్ 28వ తేదీన ఏర్పడిన భారీ వరదల కారణంగా 20 వేల ఇళ్లు కూలిపోయాయి. 80 వేల మంది నిరాశ్రయులయ్యారు.
సాధారణంగా మూసీ నది రెండు ఒడ్డుల మధ్య దూరం 700 అడుగులు. ఆ రోజు మాత్రం కిలో మీటరుకు మించిన వెడల్పుతో మూసీ నీళ్లు పారసాగాయి. సెప్టెంబరు 28 సాయంత్రానికి రహదారులపై నీరు ప్రవహించడం ప్రారంభమైంది. ఒక్కసారిగా అప్జల్‌గంజ్‌లో 11 అడుగులకు.. మిగిలిన ప్రాంతాల్లో 10 అడుగులకు వరద నీరు చేరింది. రాత్రి వరకు ఇదే పరిస్థితి కొనసాగింది. 
 
ఈ వరదల్లో వేలాది మంది జలసమాధి అయ్యారు. ఒక్క కోల్సావాడిలోనే రెండు వేల మంది గల్లంతయ్యారంటే తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ప్రాణాలు కాపాడుకునేందుకు గోడలు, చెట్లు ఎక్కినా లాభం లేకపోయింది. అవి కూడా కూలిపోవడంతో వేలాది మంది ప్రజలు జల సమాధి అయ్యారు.
 
ఈ వరద చరిత్రలో ప్రత్యేకించి ఓ చింత చెట్టుకు విశిష్ట స్థానం లభించింది. మూసీకి ఉత్తరాన ఉన్న ఉస్మానియా ఆసుపత్రిలోని ఓ పెద్ద చింతచెట్టు వుంది. ఒకప్పుడు ఈ స్థలమంతా ఓ ఉద్యానవనం. 1908 మూసీ వరదల్లో సుమారు 150 మంది ఈ చెట్టుపైకి ఎక్కి ప్రాణాలు కాపాడుకున్నారు. రెండు రోజుల పాటు దానిపైనే ఉండిపోయారు. 400 ఏళ్ల కిందటి చింతచెట్టు ఇప్పటికీ సజీవంగా ఉంది. 
 
1924లో ఏడో నిజాం ఉస్మానియా ఆసుపత్రిని నిర్మించారు. ఈ చెట్టు గొప్పదనాన్ని గౌరవిస్తూ ఏటా నవంబరు 30న హాస్పిటల్‌ డేను ఇక్కడే నిర్వహిస్తుంటారు. 2002లో ఆ చెట్టును ప్రాణధాత్రిగా అభివర్ణించారు ప్రముఖ కవి రావూరి భరద్వాజ.
 
హైదరాబాద్‌కు మళ్లీ ఇలాంటి దుస్థితి తలెత్తకుండా చూడాలని అప్పటి నిజాం ప్రభువు ఆనాటి సుప్రసిద్ధ ఇంజినీర్‌ మోక్షగుండం విశ్వేశ్వరయ్యకు బాధ్యతను అప్పగించారు. రెండు జలాశయాలు నిర్మించాలని.. డ్రైనేజీ వ్యవస్థను ఆధునికీకరించాలంటూ ఆయన 1909 అక్టోబరు 1న నిజాం ప్రభువు మీర్‌ మహబూబ్‌ అలీపాషాకు నివేదికను సమర్పించారు. 
 
 మోక్షగుండం విశ్వేశ్వరయ్య సూచనలకు అనుగుణంగానే నగరంలో పౌర వసతుల మెరుగుకు సీఐబీ చర్యలు తీసుకుంది. పార్కులు, బహిరంగ స్థలాలు, ఆటస్థలాలను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో 1920లో మూసీ నదిపై నగరానికి పదిమైళ్ల ఎగువన ఉస్మాన్‌ సాగర్‌ ఆనకట్టను కట్టించారు. 1927లో హిమయత్‌సాగర్‌ను నిర్మించారు. ఇలా మూసీ నది చుట్టూ ఆనకట్టలను నిర్మించారు.
©2019 APWebNews.com. All Rights Reserved.