టైప్‌రైటర్‌ చిత్రకారుడు..!

కుంచెతో బొమ్మలు గీసే వారిని మీరు చూసే ఉంటారు. గోడలపై రంగురంగుల చిత్రాలని అద్దేవారి గురించి వినేవుంటారు. ఇసుకతిన్నెల్లో అందమైన కళారూపాల్ని తయారుచేసే సైకత శిల్పుల గురించి తెలుసుకునే ఉంటారు. మరి మీరెప్పుడైనా టైప్‌రైటర్‌తో బొమ్మలు వేసేవారి గురించి విన్నారా...? గాంధీ, నెహ్రూ, మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌, అంబేడ్కర్‌ ఇలా ఎందరో ప్రముఖుల చిత్రాలను తన టైప్‌రైటర్‌పై తీర్చిదిద్దిన చంద్రకాంత్‌ గురించి మీరూ తెలుసుకోండి.

రకరకాల పెయింటింగ్స్‌, బొమ్మలు ఇలా ఏది గీయాలన్నా పెయింట్‌ బ్రష్‌లు, స్కెచ్‌ పెన్‌లు, పెన్సిళ్ళని వాడేస్తుంటారు చిత్రకారులు. అయితే, ముంబయికి చెందిన చంద్రకాంత్‌ బిడే (61)కు మాత్రం ఒక పాత హల్దా టైప్‌రైటర్‌ కాగితాలు ఉంటే చాలు. చక్కగా బొమ్మల్ని టైప్‌చేసేస్తాడు. అదేంటి బొమ్మలి టైప్‌ చేయడమేంటని ఆశ్చర్యపోతున్నారా....! మీరు విన్నది నిజమే. అందుకే చంద్రకాంత్‌ ఒక వైవిధ్య కళాకారుడుగా పేరుతెచ్చుకున్నాడు. అసలు ఇలా టైప్‌రైటర్‌తో బొమ్మలు వేసే ఆలోచన ఎలా మొదలయ్యిందంటే.... చిన్నతనం నుంచే చిత్రకళపై ఇష్టాన్ని పెంచుకున్నాడు చంద్రకాంత్‌. ముంబయిలో పేరొందిన జెజె స్కూల్‌ ఆఫ్‌ ఆర్ట్‌లో చేరాలనుకున్నాడు. ఆయితే ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆ కళను పక్కన పెట్టాల్సివచ్చింది. ఆ తర్వాత యూనియన్‌ బ్యాంక్‌లో క్లర్క్‌గా ఉద్యోగం తెచ్చుకున్నాడు. అప్పుడే తనకి టైప్‌రైటర్‌పై పనిచేయడం అలవాటైంది. వేగంగా టైప్‌ చేయడంలో తను ఎక్స్‌పర్ట్‌. రోజువారీ పనితోపాటు టైప్‌రైటర్‌పై ఇంకేదైనా కొత్తగా చేయాలనిపించిన చంద్రకాంత్‌కు తనకిష్టమైన చిత్ర కళ గుర్తొచ్చింది. ఒక రోజు కొన్ని ఫోన్‌ నెంబర్‌లను టైప్‌చేయమని ఆదేశించాడు తన పైఅధికారి. టైప్‌రైటర్‌పై కాగితాన్ని ఉంచి ఫోన్‌నెంబర్‌లను టైప్‌చేస్తున్న తనకి టెలిఫోన్‌ చిత్రం గుర్తొచ్చింది. బాస్‌ చెప్పిన పనిని త్వరగా ముగించి టైప్‌రైటర్‌పై టెలిఫోన్‌ బొమ్మని వేయడం మొదలు పెట్టాడు చంద్రకాంత్‌. అక్షరాలను బొమ్మల ఆకారంలో టైప్‌చేస్తూ తను గీసే బొమ్మలకు అలా టెలిఫోన్‌ తొలి చిత్రమయ్యింది. ఇక డిజైన్‌లు బోర్డర్‌ల కోసం వివిధ కీస్‌పై పట్టుసాధించాడు. అంబేద్కర్‌, నెహ్రూ, గాంధీ ఇలా పేరొందిన నాయకులతోపాటు అమితాబ్‌ బచ్చన్‌, దిలీప్‌ కుమార్‌, లతా మంగేష్కర్‌, సునీల్‌ గవాస్కర్‌, ఆర్‌కె లక్ష్మణ్‌ కామన్‌ మ్యాన్‌ ఇలా దాదాపు 150కి పైగా చిత్రాలను గీశాడు. తను టైప్‌చేసిన ఇలాంటి చిత్రాలెన్నో అప్పటి దినపత్రికల్లోనూ ప్రచురితమయ్యాయి. వాటిలో క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండుల్కర్‌ చిత్రం తనకెంతో పేరుతెచ్చిపెట్టింది. ఒక్కో చిత్రాన్ని తయారుచేయడానికి చంద్రకాంత్‌కు నాలుగైదు గంటలు పట్టేది. అయితే సచిన్‌ ముఖ చిత్రం గీయడానికి మాత్రం కాస్త ఎక్కువ సమయం వెచ్చించాల్సి వచ్చిందట. సచిన్‌ రింగుల జుత్తును గీసేందుకు టైప్‌రైటర్‌పై ఉండే ఏ కీ సరిపడలేదు మరి. ఆర్కె లక్ష్మణ్‌ కామన్‌ మ్యాన్‌ చిత్రం తనకెంతో ఆనందాన్ని అందించింది. ఆ చిత్రం రూపకర్తతోనే ఆ ఆనందాన్ని పంచుకునే అవశాన్ని దక్కించుకున్నాడు చంద్రకాంత్‌. ఒక రోజు అనుకోకుండా ఆర్‌కె లక్ష్మణ్‌ను కలుసుకునే అవకాశం రావడంతో తను టైప్‌రైటర్‌పై రూపుదిద్దిన కామన్‌ మ్యాన్‌ బొమ్మతో ప్రముఖ కార్టూనిస్టు లక్ష్మణ్‌ ఇంటికెళ్ళాడు. ఆ చిత్రాన్ని చూసిన లక్ష్మణ్‌ ఎంతో ఆశ్చర్యాన్ని వ్యక్త పరచడంతోపాటు తను కుంచెతో వేసిన చిత్రం కంటే ఈ టైప్‌రైటర్‌ చిత్రం మరింత అందంగా ఉందంటూ అభినందించారు. ఆయన ప్రోత్సాహం తనని మరింతగా ముందుకు నడిపించిందంటాడు చంద్రకాంత్‌. ప్రముఖ ఆంగ్ల దినపత్రికకు కార్టూనిస్ట్‌గా పనిచేసిన ప్రముఖ జర్నలిస్ట్‌ బెహరమ్‌ కాంట్రాక్టర్‌(బెహరమ్‌ బీ)తోపాటు మారియో మిరాంద వంటి ప్రముఖలను కలుసుకునే అవకాశాన్ని తన కార్టూన్‌ల ద్వారానే అందుకోగలిగాడంటాడు చంద్రకాంత్‌. మ్యారియోతో తన తొలి పరిచయంలో ఆయన గీసిన చిత్రాన్ని తన టైప్‌రైటర్‌పై మలిచి ఆయనకు కానుకగా అందించాడు చంద్రకాంత్‌. ఆ చిత్రంపై ''నువ్వు టైప్‌ రైటర్‌తో తీర్చిదిద్దినంత అందంగా నేను చిత్రాలను గీయాలనుకుంటున్నాను'' అనే ప్రశంసావాక్యాలు ప్రోత్సాహాన్ని ఇచ్చాయి. ఆ తర్వాత ఐఐటి ఖరగ్‌పూర్‌, ముంబయిలోని మూడ్‌ ఇండిగో ప్రదర్శనల్లో చంద్రకాంత్‌ చిత్రాలు ప్రదర్శించబడ్డాయి. రిటైర్‌మెంట్‌ సమయంలో తనకు కానుకగా ఒక టైప్‌ రైటర్‌ను ఇవ్వమని కోరుకున్నాడు ఈ కళాపిపాసి. వాలెంటరీ రిటైర్‌మెంట్‌ తర్వాత తన పూర్తి సమయాన్ని చంద్రకాంత్‌ టైప్‌రైటర్‌పై బొమ్మలు గీయడానికే కేటాయిస్తున్నాడు.

 
©2019 APWebNews.com. All Rights Reserved.