75 ఏళ్ళు 20 గిన్నిస్‌లు..!

గిన్నిస్‌ రికార్డ్‌ కొట్టడమనేది కొందరి కల. అలాంటి ఓ కలనే నిజం చేసుకున్నాడు రిషి. ఇది ఒక్కసారిమాత్రమే కాదు తను కొత్తగా ట్రైచేసిన ప్రతిసారీ. ఇప్పుటికే తన పేరున 20కిపైగా గిన్నిస్‌ రికార్డ్‌లతో పాటు ఎన్నో లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డ్‌లు నమోదయ్యాయి. శరీరంపై ప్రపంచ పతాకాల టాటూలతో నింపిన రికార్డు ఒకటైతే, వెలుగుతున్న కొవ్వొత్తులను నోట కరుచుకుని చేసిన సాహసం మరొకటి. ఇలా రికార్డులపై రికార్డులు సాధిస్తున్న ఈయన పేరు కూడా ఆ తర్వాత రికార్డ్‌రిషిగా మారిపోయింది. ఏడుపదుల వయసులో మరో రికార్డు కోసం ప్రయత్నిస్తున్న ఈయన గురించి తెలుసుకుందాం పదండి.

ఢిల్లీకి చెందిన హర్‌ప్రకాష్‌ (75) వింతగొలిపే పనులతో గిన్నిస్‌ రికార్డులను దక్కించుకోవడమంటే ఇష్టం. ఇక ఆయన పుట్టుక కూడా అంతే వింతగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన పుట్టింది ఒక సినిమా థియేటర్‌లో. తను పెద్దయ్యాక అందరి దృష్టిలో పడేలా ఎన్నో వింతలు చేస్తూ గిన్నిస్‌ రికార్డులని సొంతం చేసుకోవడం అలవాటయ్యింది. ప్రకాష్‌ పేరుతో కంటే ఆయన గిన్నిస్‌ రిషిగా ఎక్కువమందికి తెలుసు. అసలు ఈయన మొట్టమొదట గిన్నిస్‌ రికార్డ్సులోకి ఎలా ప్రవేశించాడంటే... 1980లో ఆటో విడిభాగాల(స్పేర్‌ పార్ట్ప్‌)ను అమ్మే సేల్స్‌ మ్యాన్‌గా పనిచేసేవాడు హర్‌ప్రకాష్‌. అప్పుడు ఓ చిన్న బైక్‌పైనే వివిధ నగరాలు ప్రయాణిస్తుండేవాడు. అప్పుడే కొందరు పత్రికా విలేకరుల దృష్టిలో పడ్డాడతను. వాళ్ళు తన ఇంటర్వ్యూలు తీసుకుని ఒక చిన్న బైక్‌పై వేలమైళ్ళు చుట్టేస్తున్నాడంటూ ప్రకాష్‌పై టీవీల్లో కథనాలను ప్రసారం చేశారు. ఆ తర్వాత వార్తా పత్రికల్లోనూ తన గురించి కథనాలు రావడంతో ప్రకాష్‌ ఎంతో ఫేమస్‌ అయ్యాడు. అలా ఎక్కువ మంది తన గురించి చెప్పుకోవడం తెగ నచ్చేసిందట. మరింత పాపులారిటీ పెంచేసుకోడానికి విభిన్నంగా ఏదో ఒకటి చేయాలనే ఆలోచన మొదలయ్యింది. అలా 1990లో తన బైక్‌పై 1001 గంటలు 20 వేల కిలోమీటర్లు నిరవధికంగా ప్రయాణించి గిన్నిస్‌ రికార్డును సొంతంచేసుకున్నాడు ప్రకాష్‌. ఆ తర్వాత ఆ రికార్డును బ్రేక్‌చేయడానికి మరో సాహసయాత్ర మొదలు పెట్టాడు. ఈసారి తన బైక్‌కు ఒక చిన్న సైడ్‌ క్యాబిన్‌ను జతచేశాడు. ఇది తనతో పాటు వచ్చే మరో ఇద్దరు మిత్రుల కోసం. బైక్‌ నడపడంలో సాయపడడానికి కాదుగానీ కాస్త బోర్‌ కొట్టకుండా ఉంచేందుకే ఇలా మిత్రులను వెంట తీసుకెళ్ళే ఆలోచన వచ్చిందట. సైడ్‌క్యాబిన్‌ ఉన్న బైక్‌పై తన మిత్రులతో కలిసి 42 రోజుల పాటు ప్రయాణించి గిన్నిస్‌ రికార్డును సృష్టించాడు. ఈ రికార్డును ఇప్పటిదాకా ఎవరూ అధిగమించలేదు. ఆ తర్వాత పంచదార క్యూబ్స్‌తో ఐదడుగుల టవర్‌ను తయారుచేసి ఇంకో గిన్నిస్‌ రికార్డును నెలకొల్పాడు. ఢిల్లీ నుంచి శాన్‌ఫ్రాన్సిస్కోకు 27 గంటల్లో పిజ్జాను డెలివరీ చేసి, అత్యంత దూరం ప్రయాణించిన పిజ్జాబారుగా మరో రికార్డును సొంతంచేసుకున్నాడు. ఇదంతా ఒక ఎత్తైతే వెలుగుతున్న కొవ్వొత్తుల్ని నోటిలో ఉంచి మరో గిన్నిస్‌ రికార్డును సృష్టించాడు ప్రకాష్‌. ఈ సాహసోపేతమైన చర్య తనకు ఎక్కువ పేరు తెచ్చిపెట్టింది. 9500 పేజీల విల్లు రాసి ప్రకాష్‌ ఒక గిన్నిస్‌ రికార్డును నమోదుచేసుకుంటే అతి చిన్న విల్లుతో తన భార్య కూడా గిన్నిస్‌ రికార్డులో చోటు దక్కించుకుంది. ఆ తర్వాత పది సెకన్లలో దాదాపు 496 స్ట్రాలను నోటిలో ఉంచే స్టంట్‌ చేసి గిన్నిస్‌ రికార్డును సొంతంచేసుకోవడంతోపాటు ఈ సారి తన పేరును కూడా గిన్నిస్‌ రిషి అని మార్చుకున్నాడు ప్రకాష్‌. స్ట్రాలను దూర్చేందుకు అడ్డొచ్చిన దంతాలను కూడా తొలగించుకున్నాడంటే గిన్నిస్‌ రికార్డులంటే తనకు ఎంత ఇష్టమో అర్థం చేసుకోవచ్చు. ఈ రికార్డు తర్వాత ఎలిజెబెత్‌, ఒబామా, గాంధీ ఇలా దాదాపు 400 ప్రముఖ నాయకుల ముఖ చిత్రాలను తన శరీరంపె పచ్చబొట్టుగా పొడిపించుకుని మరో గిన్నిస్‌ రికార్డుకెక్కాడు. తన శరీరం మరీ ఖాళీగా కనిపించడం నచ్చలేదట అందుకే పూర్తి దేహాన్ని వివిధ దేశాలకు చెందిన 366 పతాకాల చిత్రాలతో నింపేసి మరో కొత్త రికార్డును నెలకొల్పాడు. ఇలా దాదాపు 20 గిన్నిస్‌ రికార్డులతో పాటు ఎన్నో లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డులను సొంతం చేసుకున్నాడు ప్రకాష్‌. ఏడుపదుల వయసులో 'ఉగ్రవాద చర్యలకు వ్యతిరేకంగా కలసికట్టుగా పోరాడదాం' అనే నినాదంతో 200పైగా దేశాల్లో పర్యటించి మరో కొత్త రికార్డును నెలకొల్పే ప్రయత్నంలో ఉన్నాడు ప్రకాష్‌ (గిన్నిస్‌ రిషి). ఆయన సంకల్పం నెరవేరాలని మనమూ కోరుకుందాం!

©2019 APWebNews.com. All Rights Reserved.