4425 కెమెరాల రికార్డు.!

నాణాలు, స్టాంపులు, వాచీలు ఇలా రకరకాల వస్తువులను సేకరించే వారి గురించి చదివే ఉంటారు. మరి మీరెప్పుడైనా కెమెరాలను సేకరించేవారి గురించి విన్నారా? అయితే మీరు దిలిష్‌ పరేఖ్‌ గురించి తెలుసుకోవాల్సిందే.

ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఖరీదైన కెమెరాలను సేకరించిన పరేఖ్‌ దాదాపు 4,500 కెమెరాలతో ప్రపంచంలోకెల్లా అత్యధిక కెమేరాలను సేకరించిన వ్యక్తిగా గిన్నిస్‌ రికార్డులో చోటు దక్కించుకున్నాడు. అత్యంత ఖరీదైన కెమెరాలే కాదు లైటర్‌ కెమెరా, వాచ్‌ కెమెరా, ట్రిగ్డ్‌ కెమెరా ఇలా అతి చిన్న పరిమాణాల్లో ఉండే రకరకాల కెమెరాలను సేకరించాడతను. ఇంతకీ తనకి కెమెరాలను సేకరించాలనే ఆలోచన ఎలా మొదలైందో మీరే చదివి తెలుసుకోండి.

దక్షిణ ముంబరులోని ఫ్రీడర్‌ రోడ్‌కు చెందిన పరేఖ్‌(61) వృత్తి రీత్యా ఫోటో జర్నలిస్ట్‌. 1970లో ఓ రోజు పరేఖ్‌కు వాళ్ళ తాతగారు ఒక కెమెరాను బహుమతిగా అందించారట. అది తనకు నచ్చేయడంతో ఆ తర్వాత మార్కెట్‌లోకి వచ్చే కొత్తరకం కెమెరాను కొనడం ప్రారంభించాడు. అలా అది తనకో హబీగా మారింది. ఈ హాబీకి తన తండ్రి ప్రోత్సాహం కూడా లభించింది. అలా చిన్నతనంలోనే ఆరొందలకుపైగా కెమెరాలను సేకరించాడు పరేఖ్‌. ఆ తర్వాత ఫొటో జర్నలిస్ట్‌గా మారిన పరేఖ్‌కు కెమెరా గొప్పదనం బాగా తెలిసింది. అప్పటి నుంచి 25 ఏళ్ళుగా తన హాబీ కొనసాగుతూనే ఉంది. పురాతన కెమెరాల కోసం పేపర్‌ యాడ్‌ ఇచ్చి మరీ వాటిని కొనుక్కునేవాడు పరేఖ్‌. మొట్టమొదట దాదాపు 2600 అత్యంత ఖరీదైన కెమేరాలను సేకరించి ఒక గిన్నిస్‌ రికార్డును సొంతం చేసుకున్నాడు. రోలీ ఫ్లెక్సెస్‌, క్యానన్‌, నికోన్‌, కొడాక్‌, జెయిస్‌, లినోఫ్స్‌ ఇలా ప్రముఖ కంపెనీలకు చెందిన కెమేరాలతోపాటు ప్రపంచవాప్తంగా కేవలం పదుల సంఖ్యలో ఉన్న 1934 నాటి లైకా 250, 1960ల్లో జర్మనీకి చెందిన సంపన్న కుటుంబాల్లో ఉపయోగించిన వొయిగ్ట్లాండర్‌ కంపెనీకి చెందిన బెస్సా-2, 1970 నాటి రాయల్‌ మెయిల్‌ పోస్టేజ్‌ స్టాంప్‌ కెమెరా ఇలా అత్యంత అరుదైన కెమెరాలు కూడా తన సేకరణలో ఉన్నాయి. ఒక్క స్నాప్‌తో పదిహేను పాస్‌పోర్ట్‌ సైజు ఫోటోలను తీయగల ఈ రాయల్‌ మెయిల్‌ కెమేరా తనకి చాలా ఇష్టమైన కెమేరాల్లో ఒకటి. ఇక 2008లో ముంబయిలో చోటుచేసుకున్న ఉగ్రవాదుల దాడుల అనంతరం అక్కడి పరిస్థితులని తన క్యానన్‌ 7డి కెమేరాలో బంధించాడు పరేఖ్‌. ఆ తర్వాత ప్రముఖ దిన పత్రికల్లో అచ్చైన ఆ చిత్రాలు తనకి ఫోటో జర్నలిస్ట్‌గా మంచి పేరు తెచ్చిపెట్టాయి. అయితే ఆ కెమెరా మాత్రం ఇప్పుడు తన కలెక్షన్‌లో లేకపోవడంతో దాన్ని సేకరించే ప్రయత్నాలు మొదలు పెట్టాడు. స్విట్జర్ల్యాండ్‌కి చెందిన కన్‌కెవా కంపెనీ తయారుచేసిన 33ఎమ్‌ఎమ్‌ కెమేరా టెస్సిన-ఎల్‌ పరేఖ్‌ మనసుదోచుకున్న కెమెరా. ప్రపంచవ్యాప్తంగా అత్యంత చిన్న కెమెరాగా పేరొందిన ఈ కెమెరాతోపటు లైటర్‌, వాచీ ఇలా రకరకాల ఆకృతుల్లో కెమెరాలను సేకరించాడు. గూఢచర్యానికి ఉపయోగించే ఈ అరుదైన కెమెరాలను కొనేందుకు కెమెరా అమ్మకాల్లో పేరొందిన మార్కెట్లు, వివిధ ఫొటో స్టూడియోలు, పేపర్‌ యాడ్‌లు ఇలా ఎన్నో రకాలుగా తన ప్రయత్నాలు కొనసాగేవి. 1929లనాటి అతి పురాతన రోలిఫ్లెక్స్‌ కెమెరా నుంచి ఇప్పటి క్యానన్‌-5డి వరకు తన వద్ద మొత్త 4500పైగానే కెమెరాలున్నాయి. వీటితో ప్రపంచ ఫొటోగ్రఫీ డే సందర్భంగా ముంబయిలో ఒక ప్రదర్శన నిర్వహించి తన పాత రికార్డుని మరోసారి బ్రేక్‌ చేశాడు పరేఖ్‌. అంతే కాదు అత్యంత అరుదైన తన కెమెరాలతో పదిసార్లు లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ను సొంతం చేసుకోవడంతోపాటు ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్‌లో చోటుదక్కించుకున్నాడు. ఆరు పదుల వయసులోనూ తన హాబీతో మరో రికార్డును సొంతచేసుకోవాలనే పట్టుదలతో ముందుకుసాగుతున్నాడు పరేఖ్‌.

©2019 APWebNews.com. All Rights Reserved.