విధిని ఎదిరించాడు!

చిన్నతనంలోనే కాళ్లు పోగొట్టుకున్నాడు.. కానీ ఆత్మవిశ్వాసాన్ని, ధైర్యాన్ని మనసులో పోగేసుకున్నాడు. అమ్మ ఇచ్చిన ధైర్యంతో కార్‌ రేసర్‌గా దూసుకెళుతున్న చేతన్‌ కొరడా జీవితం ఎంతో మందికి స్ఫూర్తి...

అప్పుడు చేతన్‌ వయసు ఏడాదిన్నర. కాళ్లలో పుట్టుకతోనే బోన్‌ డిఫార్మటీ ఉంది. ఎన్నో సర్జరీలు జరిగాయి. అయినా అతని పరిస్థితిలో ఎలాంటి మార్పూ లేదు. చివరకు డాక్లర్లు అతని తల్లి ముందు రెండు ఆప్షన్లు ఉంచారు. ఒకటి కాళ్లు తీసేయడం, రెండు వీల్‌ చైర్‌కే పరిమితం చేయడం! కాసేపు ఆలోచించారామె. వెంటనే ఆమె నుంచి వచ్చిన సమాధానం విని షాక్‌ కావడం వారి వంతయింది. చేతన్‌కు శస్త్రచికిత్స జరిగింది. రెండు కాళ్లను పూర్తిగా తొలగించారు. అప్పుడు తొలిసారిగా అతనికి ప్రోస్థటిక్‌ కాళ్లు అమర్చారు. తన కొడుకును జీవితాంతం వీల్‌చైర్‌లో చూడాలనుకోలేదు. ఆమె నిర్ణయం చేతన్‌కు వరంలా మారింది. అతణ్ణి ప్రపంచానికి ఒక విజేతగా పరిచయం చేసింది.
 
ప్రతి ఆరు నెలలకు నరకమే
ప్రతి ఆరు నెలలకు జరిగే శస్త్రచికిత్స చేతన్‌కు చేదు అనుభవమే. కచ్చితంగా ప్రొస్థటిక్‌ కాళ్లను మార్చాల్సి వచ్చేది. ‘‘కుట్లు పడినప్పుడు కచ్చితంగా మంచానికే పరిమితమయ్యేవాడు. అయినా ఏ మాత్రం అధైర్యపడలేదు. బాధను బయటకు చూపించేవాడు కాదు. పైగా మేం ఎప్పుడూ అతనిపై జాలి కూడా చూపించలేదు’’ అని చేతన్‌ తల్లి పద్మ చెప్పారు.
 
కృష్ణమూర్తి ఫౌండేషన్‌ స్కూల్లో పాఠశాల విద్యను పూర్తి చేసిన చేతన్‌ అప్పట్లోనే బాస్కెట్‌బాల్‌ చాంపియన్‌. తనకు నచ్చిన ఆటలన్నీ ఆడేవాడు. ఇదంతా తన తల్లి అందించిన ప్రోత్సాహమే అంటాడు చేతన్‌. ‘‘ ఏ రంగంవైపు వెళ్లినా మా అమ్మ నాకు అండగా నిలిచింది. ఎవరైనా ‘నువ్వు ఏమీ చేయలేవ’ు అని మాట్లాడితే అస్సలు లెక్కచేయవద్దని చెప్పింది. ఆ మాటలే నాలో పాజిటివిటీని పెంచాయి. అందుకో ఉదాహరణ చెబుతా. నాకు ఫుట్‌బాల్‌ ఆడాలని అనిపించింది. కష్టం కదా అంటే అందుకు మా అమ్మ చెప్పిన సమాధానం, ‘ ఏముంది! ప్రొస్థటిక్స్‌ విరిగిపోతాయి, కొత్తవి అమరుస్తారు’ ’’అని.
 
ఆ కారులో...
చేతన్‌ స్నేహితుని తండ్రి కారు రేసర్‌. ఓ సందర్భంలో ఆయనతో కలిసి చెన్నై మోటార్‌ రేస్‌ ట్రాక్‌కి వెళ్లిన చేతన్‌ తొలిసారిగా ఫార్ములా ఎల్‌జీబీ షిఫ్ట్‌ కారు ట్రై చేద్దామనుకున్నాడు. ‘‘భయం భయంగానే అందులోనే కూర్చున్నా. ఆ కారులో కూర్చునేముందు ఎంతో ఉద్వేగంగా అనిపించింది. ఎందుకంటే నాలో ఎక్కడో సందేహం. నా ప్రొస్థటిక్‌ కాళ్లకు రేసింగ్‌ కారు సెట్‌ అవుతుందా అని. కానీ చాలా సౌకర్యంగా అనిపించింది. నా భయాలన్నీ పోయాయి. ఆ కారు సెట్‌ అయింది. అప్పుడే నాకు రేసింగ్‌ నేర్చుకోవాలనిపించింది’’ అని ఆనాటి సంఘటనను గుర్తు చేసుకున్నారు చేతన్‌.
 
అనతికాలంలోనే విజయం!
ప్రొఫెషనల్‌ లైసెస్స్‌ కోసం దరఖాస్తు చేసుకున్న చేతన్‌కు ప్రత్యేకంగా పరీక్ష నిర్వహించారు. అందులో కచ్చితంగా పాస్‌ కావాల్సిందే. మిగతా రేసర్లకు చేతన్‌ డ్రైవింగ్‌ ప్రమాదకరం అవునా కాదా అని పరీక్షిస్తారు. అందులో ఉత్తీర్ణత సాధించిన చేతన్‌ 2009లో కారు రేసింగ్‌లో శిక్షణ తీసుకోవడం ప్రారంభించారు. ఆ ఏడాది జరిగిన ఎమ్‌ఎమ్‌ఎస్‌సీ కప్‌లో గెలిచాడు. 150కి పైగా రేసుల్లో పాల్గొన్న చేతన్‌ ‘జేకే టైర్‌ జూనియర్‌ చాంపియన్‌షిప్‌’ ఫెడరేషన్‌ ఆఫ్‌ మోటార్‌ స్పోర్ట్స్‌ క్లబ్‌ ఆఫ్‌ ఇండియా పోటీల్లో రన్నరప్‌గా నిలిచాడు. అయితే తన ప్రైజ్‌ మనీని తనకు స్పాన్సర్‌ చేస్తున్న కంపెనీలోనే పెట్టుబడిగా పెట్టాడు చేతన్‌.
 
 ‘‘ఎందుకంటే రేసింగ్‌ అనేది చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఎంతో మంది ప్రముఖులు ఈ కార్‌ రేసింగ్‌ నుంచి అనతి కాలంలోనే నిష్క్రమించడానికి కారణం అదే. రేసింగ్‌ మొదలుపెట్టేనాటికి ఏడాదికి రెండు లక్షలు ఖర్చు అయ్యేవి. కానీ ఇప్పుడు ఒక సిరీస్‌కే అయిదు నుంచి 7 లక్షల వరకూ ఖర్చవుతోంది. అందుకే నా ఆదాయ వనరును కూడా పెంచుకోవాలన్న ఉద్దేశంతో ఈ ఆలోచన చేశాను’’ అన్నాడు చేతన్‌. అతణ్ణి స్పాన్సర్‌ చేస్తున్న ‘క్యూనెట్‌’ అనే కంపెనీలో చేతన్‌ తల్లి ఉద్యోగి. ‘‘మా అమ్మ, నాన్న ఫుల్‌ హ్యాపీ. నా విజయాలు చూసి మురిసిపోతారు. వారే నా బలం’’ అంటాడు చేతన్‌. నవంబర్‌ లో దుబాయ్‌, బెహ్రయిన్‌, అబుదాబిలలో జరిగే ఎంఆర్‌ఎఫ్‌ చాలెంజ్‌ల ద్వారా అంతర్జాతీయ పోటీల్లో సత్తా చాటబోతున్నాడు ఈ రేసర్‌. ప్రస్తుతం ఆ శిక్షణలో బిజీగా ఉన్నాడు.
 
ఇదే చేతన్‌ ప్రత్యేకత
కారు రేసింగ్‌లో నిష్ణాతులైన బిల్లీ మాంగర్‌, అలెక్స్‌ జనార్డి లాంటి వాళ్లు ప్రొస్థటిక్‌ కాళ్లతో ఎన్నో విజయాలు సాధించారు. తమకు అనుగుణంగా కార్లను రీడిజైన్‌ చేయించుకున్నారు. ఆ కార్లలో బ్రేక్స్‌, క్లచెస్‌ చేతితో ఆపరేట్‌ చేసేలా మార్పులు చేస్తారు. కానీ చేతన్‌ రూటే సెపరేటు. రీడిజైన్ల జోలికి వెళ్లలేదు. అదే అతణ్ణి ప్రత్యేకంగా నిలిపింది. సాధారణ కారు రేసర్లు ఏం వాడుతున్నారో అలాంటిదే చేతన్‌ దగ్గర ఉంది. ‘‘నాలోని లోపానికి అనుగుణంగా కారును మార్చాలనిపించలేదు. మిగతా వారిలాగా నేనూ పోటీలో పాల్గొన్నప్పుడే ఆ పోటీకి న్యాయం చేయగలను. ప్రత్యేకమైన హైడ్రాలిక్స్‌, స్ర్పింగ్‌లను అందుకే వినియోగించలేదు’’ అని చేతన్‌ చెప్పుకొచ్చాడు.
 
డీజే కూడా...
చేతన్‌కు చిన్నతనం నుంచే కార్లంటే చాలా ఇష్టం. అతణ్ణి ఎలాగైనా నడిపించాలని తల్లి అతని ముందు బొమ్మ కార్లను పెట్టేది. అలాగైనా నడుస్తాడని! తన మనసులో కార్లంటే ఇష్టం ఏర్పడటానికి అది కూడా ఓ కారణం అంటాడు చేతన్‌. చేతన్‌కి కేవలం కార్లు మాత్రమే కాదు. సంగీతమన్నా చాలా ఇష్టం. ఆడియో ఇంజనీరంగ్‌లో డిప్లమో చేస్తూనే, బీబీఎ కోర్సును దూరవిద్యలో పూర్తి చేశాడు. హెయిర్‌ స్టయిలింగ్‌ కూడా నేర్చుకున్నాడు. సంగీతం మీద ఉన్న మమకారంతో ఎనిమిదేళ్లు డీజేగా కూడా పనిచేశాడు.
©2019 APWebNews.com. All Rights Reserved.