ఈ మసీదు... ఓ అద్భుతం!

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ యుఏఈ పర్యటనలో భాగంగా అబుదాబిలో ఉండే షేక్‌ జాయేద్‌ గ్రాండ్‌ మసీదును సందర్శించారు. షేక్‌ జాయేద్‌ గ్రాండ్‌ మసీదు విశేషాలేంటో తెలుసుకుందాం.

  • షేక్‌ జాయెద్‌ బిన్‌ సుల్తాన్‌ అల్‌-నహ్యాన్‌ జ్ఞాపకార్థం ‘షేక్‌ జాయెద్‌ గ్రాండ్‌ మసీదు’ నిర్మించారు. 1996లో ఈ మసీదు నిర్మాణాన్ని ప్రారంభించారు, 2007 సంవత్సరంలో పూర్తయ్యింది.
  • ఇస్లామిక్‌ సంస్కృతి, సంప్రదాయాలను చాటే అద్భుతమైన నిర్మాణమిది. ఈ మసీదులోని ప్రతీది విశిష్టమైనదే. దాదాపు 1,80,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ మసీదులో 82 గుమ్మటాలు, 1000 స్తంభాలు, 24 దీపస్తంభాలున్నాయి. సూర్యకాంతి ధారాళంగా ప్రసరించేట్లు నిర్మించిన ఈ మసీదు చుట్టూ నీటి కొలనులు ఉన్నాయి. 
  • ఈ మసీదు నిర్మాణానికి వాడిన నాణ్యమైన, విభిన్నమైన చలువ పాలరాళ్లను మన దేశంలోని రాజస్థాన్‌, మాసిడోనియా, ఇటలీ, చైనా దేశాల నుంచి దిగుమతి చేసుకున్నారు. 
  • మసీదులోపల ఉండే డెకరేషన్‌ మెటీరియల్స్‌ను టర్కీ, యూకే, ఇండియా, చైనా, మలేషియా, జర్మనీ, ఆసి్ట్రయా, న్యూజిలాండ్‌ ఇలా వివిధ దేశాలనుంచి దిగుమతి చేసుకున్నారు. 
  • ప్రపంచంలోనే అతి పొడవైన కార్పెట్‌ను ఈ మసీదుకోసం నేయించారు. ఉన్ని, నూలు కలబోతగా రూపొందిన ఈ కార్పెట్‌ పొడవు 5,700 చదరపు మీటర్లు. 
  • రాత్రివేళల్లో తెలుపు, బంగారు వన్నె కాంతుల్లో ఈ మసీదు అత్యద్భుతంగా ఉంటుంది. చంద్రబింబం పెరుగుదలలో హెచ్చుతగ్గులను బట్టి ఈ పాలరాతి మసీదు కాంతులీనుతుంది. ఇందుకోసం 22 లైట్‌ టవర్స్‌ను ఏర్పాటు చేశారు. 
  • ఈ మసీదులో ఓ పెద్ద లైబ్రరీ ఉంది. అరబిక్‌ భాషతో పాటు ఇంగ్లీష్‌, ఫ్రెంచ్‌, స్పానిష్‌, జర్మన్‌, ఇటాలియన్‌, కొరియన్‌ భాషల్లో వివిధ పుస్తకాలు లభ్యమవుతాయి. 
  • షేక్‌ జాయేద్‌ గ్రాండ్‌ మసీదులోకి శుక్రవారం ఉదయం మినహా మిగతా అన్ని రోజుల్లో ఉదయం 9 గంటలనుంచి, రాత్రి 10 గంటల దాకా సందర్శకులను అనుమతిస్తారు. శుక్రవారం మాత్రం సాయంత్రం 4 గంటల 30 నిమిషాలనుండి రాత్రి 10 గంటల దాకా అనుమతి ఉంటుంది. సూర్యాస్తమ సమయంలో షేక్‌ జాయేద్‌ గ్రాండ్‌ మసీదును తిలకించటానికి ఎక్కువ మంది యాత్రికులు వస్తుంటారు.
  • మక్కా, మదీన తర్వాత ప్రపంచంలోనే ఇది అతి పెద్ద మసీదు.
  • ఈ మసీదులో ఒకేసారి 40,000 మంది ప్రార్థన చేయవచ్చు.
©2019 APWebNews.com. All Rights Reserved.