చరిత్రలో చెరగని ముద్ర..!

అక్షరాల్ని ముద్రణలోకి తీసుకొచ్చిన మొదటి వ్యక్తి - జొహానెస్‌ గూటెన్‌బర్గ్‌. ప్రపంచానికి ప్రింటింగ్‌ ప్రెస్‌ను అందించినవాడు - గూటెన్‌బర్గ్‌. పుస్తకం చదువుతున్న ప్రతీ క్షణం స్మరించుకోవాల్సిన పేరు ఇది.

జర్మనీలోని మెయింజ్‌ పట్టణంలో క్రీ. శ 1400లో జన్మించాడు గూటెన్‌బర్గ్‌. ఆ రోజుల్లో ఇది నాణేల తయారీకి కేంద్రస్థానం. తండ్రి లాడెన్‌ ఓ టంకశాలలో అధికారి. నాన్నతో పాటు తాను కూడా కొంతకాలం అక్కడ పని చేశాడు. లోహాల్ని కొలిమిలో కాల్చడం, బంగారాన్ని సరైన సైజులో కోయడం, వాటిపై ముద్రలు వేయడం, వాటిని క్రమపద్ధతిలో పేర్చడం - ఇవన్నీ నేర్చుకొన్నాడు. అప్పట్లో మెయింజ్‌లో సంపన్నవర్గాల మధ్య పోటీ ఉండేది. నిత్యం ఆధిపత్యం కోసం అంతర్యుద్ధాలు జరిగేవి. అందులో అనుచరులు, సామాన్యులు బలైపోతుండేవారు. అలాంటి గొడవల్లో గుటెన్‌బర్గ్‌ కుటుంబం కూడా ఇరుక్కోవాల్సి వచ్చింది. దాంతో చేసేది లేక 1428లో వారు స్ట్రాస్‌బర్గ్‌కి వలసపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

కొత్త ఊరు, కొత్త వ్యక్తులు, పూట గడవడం కోసం ఏం చేయాలో తెలీదు. అంతలో తండ్రి మరణం. దిక్కుతోచలేదు గూటెన్‌బర్గ్‌కి! తల్లి వైరిచ్‌ బాగా కుంగిపోయింది. దాంతో దినసరి భత్యం మీద వైన్‌ కంపెనీలో చేరాడు. అయినా ఆర్థిక స్థితి అంతంతమాత్రమే! దాంతో ఏదైనా కొత్త వ్యాపారం చేద్దామనుకొన్నాడు. ముగ్గురు స్నేహితులతో కలిసి అద్దాల తయారీ వ్యాపారం మొదలుపెట్టాడు. లాభాలు రాలేదు కానీ మనస్పర్థలు వచ్చాయి. విడిపోయారు. నడిసంద్రపు నావరీతి అయ్యింది గూటె న్‌బర్గ్‌కి!
విసిగిపోయాడు. ఎవరికీ కనిపించకుండా పారిపోయాడు.
 
14వ శతాబ్దపు ఐరోపా నూతన మార్పులకు కొలువైంది. క్రమంగా పెరుగుతున్న జనాభా, వేగంగా అధికమవుతున్న అవసరాలు, అధిగమించాల్సిన సమస్యలు, కొత్త కొత్త ఆవిష్కరణలు, దూరతీరాలకు ప్రయాణాలు...! ఏవేవో సుదూర ప్రాంతాల వారు తమ తమ వింతలు విడ్డూరాలు చెబుతూంటే స్థానికులు ఆశ్చర్యపోయేవారు. తామూ వాటిని ప్రత్యక్షంగా చూడాలని అనుకొని ఓడల్లో బయలుదేరేవారు. తమ అనుభూతుల్ని అక్షరబద్ధం చేసేవారు.
 
ఆయా గ్రంధాలను ఇతరులు చదవాలంటే - వాటికి నకళ్లు తయారు చేయడం తప్ప మరో మార్గం లేదు. ఎన్ని కాపీలు కావాలంటే అన్నింటినీ చేతితో రాయాల్సిందే. గొప్ప గొప్ప గ్రంంథాలను ఇలా తిరగరాసేందుకు జమీందార్లు తమ ఆస్థానాల్లో ప్రత్యేకంగా లేఖకుల్ని నియమించుకొనేవారు. అయితే శ్రమతో కూడిన పని ఇది. ఎంతో ఆలస్యమయ్యే కార్యక్రమం ఇది.
 
 ఈ నేపథ్యంలో - గూటెన్‌బర్గ్‌ మెదడు పదునెక్కింది. ముద్రణ యంత్రం కనిపెట్టాలన్న ఆలోచన వచ్చింది. అందుకే ఏడెనిమిదేళ్ల పాటు అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. కావలసిన కసరత్తు అంతా చేశాడు. ఒకప్పుడు నాణాల తయారీలో పొందిన నైపుణ్యాన్ని సానబెట్టాడు. ముద్రణకు మూలాలు సమకూర్చాడు. బంగారు నాణాల తయారీకి ఉపయోగించే ప్రెస్‌ పరికరాలను సేకరించాడు. తన అవసరాలకు తగ్గట్లుగా వాటిని మార్చుకొన్నాడు. సీసంతో అక్షరాలను రూపొందించాడు. ప్రతీ అక్షరాన్నీ దేనికదే విడివిడిగా పోతపోశాడు. తిరిగి వాటిని పదాలుగా, పంక్తులుగా, పుటలుగా తీర్చిదిద్దే ఏర్పాట్లు చేశాడు. కుడి ఎడమలుగా వేలాది టైపుల్ని కూర్చాడు.
 
సర్వం సిద్ధం చేసుకొని 1448 కల్లా మెయింజ్‌ పట్టణానికి తిరిగి వచ్చాడు. ఇక ముద్రణ ప్రారంభించడమే తరువాయి! ముద్రణ యంత్రాన్ని పూర్తిగా ఏర్పాటు చేసుకోవటమే మిగిలింది. అందుకు భారీగా పెట్టుబడి కావాలి. అంత సొమ్ము తన దగ్గర లేదు. అందుకే జాన్‌ ఫుస్ట్‌ అనే మిత్రుణ్ణి కలిశాడు. అతని దగ్గర ఆరుశాతం వడ్డీకి పెద్ద మొత్తాన్ని అప్పు తీసుకొన్నాడు. అనంతరం ఫుస్ట్‌ వ్యాపార భాగస్వామి అయ్యాడు.
 
ప్రింటింగ్‌ ప్రారంభమైంది. మొట్టమొదట జర్మన్‌ కవితల్ని ముద్రించారు. 1453 నాటికి బైబిల్‌ని ముద్రించడానికి సన్నాహాలు చేశారు. 1282 పేజీల బైబిల్‌ ముద్రణకు రెండేళ్లు పట్టింది. 130 కాపీలు ప్రింట్‌ చేశారు. నేటికీ ఇందులోని 40 కాపీలు చాలా మ్యూజియమ్‌లలో భద్రంగా ఉన్నాయి. ఈ బైబిల్‌ ముద్రణలో ప్రతీ పుటలోనూ 42 పంక్తులుంటాయి. అందుకే దీనిని ‘42 లైన్ల బైబిల్‌’ అంటారు. యంత్రం ద్వారా ముద్రితమైన తొలి బైబిల్‌ - ఆ మాటకొస్తే - మొట్టమొదటి గ్రంథమిది.
కాపీలు బయటకు వస్తున్న తరుణంలో గూటెన్‌బర్గ్‌కి కోలుకోలేని షాక్‌ తగిలింది. సొగసుగా, ముద్దుగా, అందంగా బైబిల్‌ ప్రింట్స్‌ని ప్రజలకు అందించాలన్నది గూటెన్‌బర్గ్‌ ఆలోచన. కానీ ఇందులోంచి ఎంత ఎక్కువ సంపాదించుకోవాలా అన్నది ఫుస్ట్‌ యోచన. దాంతో భేదాభిప్రాయాలు వచ్చాయి. ఫుస్ట్‌ కోర్టుకెక్కాడు. గూటెన్‌బర్గ్‌కి వ్యతిరేకంగా కోర్టు తీర్పు వచ్చింది. డబ్బులు పోయాయి. అప్పులు మిగిలాయి. ఏళ్ల తరబడి శ్రమించిన ప్రింటింగ్‌ పని ఫుస్ట్‌ పరమైంది. తీవ్రమైన మానసిక వ్యధ గూటెన్‌బర్గ్‌కి మిగిలింది. దాంతో పాక్షికంగా గుడ్డివాడయ్యాడు. చివరకు 1468లో కన్నుమూశాడు.
 
మరణానంతరం - ఫుస్ట్‌ చేసిన తప్పేమిటో స్థానిక అధికారులు గుర్తించారు. ముద్రణ అందించిన తొలి వ్యక్తి - గూటెన్‌బర్గే అని నిర్ధరించారు.
ఫుస్ట్‌ పేరు చరిత్రలో నిలవలేదు. ద్రోహం చేస్తే అంతే! గూటెన్‌బర్గ్‌ తెలియని వారు లేరు. నిజాయితీ ఉంటే ఇంతే!!
©2019 APWebNews.com. All Rights Reserved.