ఆ చర్చి... ఓ శివాలయం!

 

శివ లింగం... శిలువ రూపం... 
శివ స్తోత్రాలు... ప్రభువు భక్తి గీతాలు... 
ప్రవచనాలు... బైబిల్‌ సూక్తులు... 
ఇదేంటి సంబంధంలేని విషయాలు చెబుతున్నారని అనుకుంటున్నారా? కర్ణాటకలోని ఆ గ్రామంలోకి వెళితే వీటి మధ్య ఉన్న అవినాభావ సంబంధాన్ని ప్రత్యక్షంగా చూడొచ్చు. ఉత్తర కర్ణాటకలోని బెళగావికి 28 కి.మీ. ల దూరంలో ఉన్న దేశనూర్‌ ఓ సాధారణ గ్రామం. కానీ అక్కడున్న ఓ చర్చి కారణంగా ఆ ఊరి పేరు ప్రపంచమంతా తెలిసింది. ఆ చర్చిలోకి వెళ్లగానే మనకు క్రీస్తు ప్రభువు, మరియమాత విగ్రహాలు దర్శనమిస్తాయి. అంతలోనే మనల్ని ఆశ్చర్యంలో ముంచెత్తుతూ ప్రధాన పూజా వేదికపై ఓ శివలింగం దర్శనమిస్తుంది. హిందూ పద్ధతిలో పూజ, హారతి వంటివన్నీ మనం చర్చిలో ఉన్నామా? ఆలయంలో ఉన్నామా అనే ఆశ్చర్యం కలిగిస్తాయి. కాసేపు అక్కడే ఉంటే బైబిల్‌ వచనాలు వినిపిస్తాయి. ఆవెంటే బసవేశ్వరుడి బోధనలు, పురంధర దాసు కీర్తనలూ తన్మయత్వం కలిగిస్తాయి. ఇంత ఉదాత్తమైన భావాల వేదికగా, మత సామరస్యానికి చిహ్నంగా ఈ చర్చిని మలిచిన వ్యక్తి పేరు మెనినో గోన్సాల్వెజ్‌. మెనినో స్వామి అని ఈ ఊరి ప్రజలు పిలుచుకుంటారు. ఆయన ఆహార్యం కూడా భిన్నంగా ఉంటుంది. క్రైస్తవ మత బోధకులు ధరించే అంగీతో పాటు మెడలో రుద్రాక్ష మాలతో కనిపిస్తారు. ఏంటిదంతా అంటే ‘ హారతినే తీసుకుందాం అదో ఆయుర్వేద అద్భుతం. అందరం మనుషులమే... ఎక్కడ మంచి ఉన్నా తీసుకోవాల్సిందే కదా.’ అంటారు. హరిద్వార్‌, రుషికేష్‌ వంటి క్షేత్రాలను దర్శించుకున్న మెనినో స్వామి  ఎనిమిది భాషలను అలవోకగా మాట్లాడతారు. తెలుసుకున్న వాళ్లకు ప్రపంచమంతా పరమాత్మ రూపమే... మతాలిక్కడ విషయం కాదంటారాయన. గ్రామంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుండే ఆయనను ఆ ఊరి జనం ప్రేమిస్తారు. ఆయన బోధనల నుంచి ప్రేరణ పొందుతుంటారు.
©2019 APWebNews.com. All Rights Reserved.