అతిపొట్టి డ్రైవర్‌ గిన్నిస్‌ రికార్డ్‌!

ఫ్రాంక్‌ హాషెమ్‌ ఎత్తు కేవలం నాలుగున్నర అడుగులు. ప్రపంచంలోనే అతిపొట్టి బస్సుడ్రైవర్‌గా గిన్నిస్‌ రికార్డులకెక్కాడు. ‘పొట్టిగా ఉన్నాం.. జీవితంలో ఏం సాధించలేం’ అని కుంగిపోతున్న యువతలో ఏదైనా సాధించాలనే స్ఫూర్తి నింపుతున్నాడు.

ఫ్రాంక్‌ హాషెమ్‌ ఎత్తు నాలుగున్నర అడుగులు కానీ అతను నడిపేది ఏకంగా డబుల్‌ డెక్కర్‌ బస్‌. ఇంగ్లాండ్‌లోని సిచెస్టర్‌లో అతను డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.ఆ బస్సు బోగ్నోర్‌ రెగీస్‌ నుంచి వెస్ట్‌ సస్సెక్స్‌ కు నడుపుతారు. 8 నెలల్లో 700 సర్వీస్‌లు పూర్తి చేశాడు.

20 ఏళ్ల క్రితం అతను ఇరాక్‌ నుంచి బ్రిటన్‌కు వలస వచ్చాడు. బస్సు డ్రైవర్‌ ఉద్యోగం కోసం దరఖాస్తు చేశాడు. అయినా అతనికి లోలోపల భయంగానే ఉంది. నిల్చున్నా స్టీరింగు అందుతుందా అని లోలోన భయపడుతూనే ఇంటర్వ్యూకు హాజరయ్యాడు. అన్ని శిక్షణలను పూర్తి చేసుక్కోని ఒకటిన్నర సంవత్సరంలోనే ప్రొఫెషనల్‌ బస్‌ డ్రైవర్‌గా గుర్తింపు పొందాడు. ఇప్పుడతను ఎలాంటి బస్‌నైనా అవలీలగా నడపగలడు. అతను కూర్చునే డ్రైవింగ్‌ సీట్‌ను కొంచెం ఎత్తు పెంచారు. స్టీరింగ్‌ వీల్‌ను దానికి తగ్గట్టు అడ్జస్ట్‌ చేశారు. మరెలాంటి మార్పులు చేయకుండానే అతను అనుకున్నది సాధించాడు. డ్రైవింగ్‌ను అతను చాలా ఆస్వాదిస్తాడు. ప్రయాణీకులు కూడా అతన్ని ప్రోత్సహిస్తారు. హాషెమ్‌కు ఇద్దరు కూతుళ్లు. కుటుంబంతో కలసి హాంప్‌షైర్‌లోని హవాంట్‌లో నివసిస్తున్నాడు. అతని విజయానికి కుటుంబం ఎంతో సంతోషిస్తోంది.
జీవితం మీద ఆశను కోల్పోవద్దు
హాషెమ్‌ తన తోటి ప్రజలకు రోల్‌మోడల్‌లా ఉండాలనుకుంటున్నాడు. తనలానే ఇతరులు రికార్డులు సాధించగలరని వారిలో స్పూర్తి నింపుతున్నాడు. అతను ఎక్కడకు వెళ్లినా ప్రజలు గుంపులుగా ఎగబడి ప్రశ్నలు అడుగుతుంటారు. ‘‘మీ శక్తి సామర్థ్యాలు ఎలాంటివైనా కావొచ్చు.. కానీ మీరు తలచుకుంటే అనుకున్నది సాధించగలరు’’ అని చెపుతూ వారిలో స్ఫూర్తినింపుతున్నాడు.
©2019 APWebNews.com. All Rights Reserved.