అతిచిన్న శాటిలైట్!

అలాగే ఎందుకుండాలి? ఇలా ఎందుకు ఉండకూడదు అనే ప్రశ్న మరో కొత్త ఆవిష్కరణకు ఊపిరి పోస్తుంది. ఇప్పటి వరకూ ఆవిర్భవించినవన్నీ దాదాపు అలాంటి ప్రశ్నల నుంచి ఉద్భవించినవే. అలాంటిదే ఇప్పుడు మరొకటి ఆవిష్కృతమైంది. ప్రపంచంలోనే అతిచిన్నది.. అంటే.. అరచేతిలో ఇమిడిపోయే సైజులో, ఎంచక్కా జేబులో పెట్టుకొని దాచుకునేంత సైజులో కృత్రిమ ఉపగ్రహాన్ని(శాటిలైట్) తయారుచేశారు మనోళ్లు. ఆ కథా కమామీషు ఈ రోజు సంకేత ప్రత్యేక కథనం.

అంతరిక్ష రహస్యాలు తెలుసుకునేందుకు కొన్ని వందల సంవత్సరాలుగా శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేస్తున్నారు. ఈ క్రమంలో భారతదేశం కూడా ఎన్నో అద్భుతాలను ఆవిష్కరించింది. అందులో భాగంగానే తమిళనాడుకు చెందిన 18 సంవత్సరాల రిఫత్ షారుక్ కేవలం 64 గ్రాములున్న ఉపగ్రహాన్ని తయారుచేసి అరుదైన రికార్డు సృష్టించాడు. నాసా నిర్వహించిన క్యూబ్స్ ఇన్ స్పేస్ అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనేందుకు ఈ బుల్లి ఉపగ్రహాన్ని తయారుచేశాడు రిఫత్ షారుక్. ఇంటర్మీడియట్ చదువుతున్న రిఫత్ రీ ఇన్ఫర్మ్ కార్బన్ ఫైబర్ పాలిమర్స్‌తో ఈ అతిచిన్న శాటిలైట్‌ను రూపొందించాడు. అది కాస్త ప్రపంచానికి పనికొచ్చే అద్భుతంగా మారింది. ఈ బుల్లి శాటిలైట్‌కు ప్రపంచ ప్రఖ్యాత, దివంగత శాస్త్రవేత్త ఏపీజే అబ్దుల్ కలాం పేరు మీదుగా కలామ్‌శాట్ అనే పేరు పెట్టారు.

మనోడు కూడా ఉన్నాడు..

తమిళనాడుకు చెందిన రిఫత్ ఈ ఆవిష్కరణలో ప్రధానం కాగా.. ఈ బుల్లి శాటిలైట్ తయారుచేసిన టీమ్‌లో తెలంగాణ బిడ్డ కూడా ఉన్నాడు. నల్లగొండ జిల్లాకు చెందిన మహ్మద్ అబ్దుల్ ఖాసిఫ్ కలామ్‌శాట్ తయారీ బృందంలో సభ్యుడు. నల్లగొండలోని రాష్ట్రపతి రోడ్ ఉస్మాన్‌పురకు చెందిన ఖాసిఫ్ హిందూస్థాన్ యూనివర్సిటీలో ఏరోస్పేస్ ఇంజినీరింగ్ కోర్సు చేశాడు. పరిశోధనలపై పెంచుకున్న ఇష్టంతో 2015లో చెన్నైలోని స్పేస్‌కిడ్స్ ఇండియాలో చేరాడు. ఈ ఏడాది జూన్ 22న నాసా ఆధ్వర్యంలో అంతరిక్షంలోకి పంపిన కలామ్‌శాట్ తయారీకి 8 నెలలుగా ఆరుగురు సభ్యుల టీమ్ కష్టపడింది. కలామ్‌శాట్ ప్రాజెక్టులో రిఫత్ షారుక్ లీడ్ సైంటిస్ట్‌గా ముందుండి నడిపించాడు. నల్లగొండకు చెందిన అబ్దుల్ ఖాసిఫ్ లీడ్ ఇంజినీర్‌గా తన వంతు పాత్ర పోషించాడు. వీరితో పాటు.. టెక్నిషియన్‌గా యజ్ఞసాయి, డిజైన్ ఇంజినీర్‌గా వినయ్ భరద్వాజ్, ైఫ్లెట్ ఇంజినీర్‌గా తనీష్ ద్వివేది, బయాలజిస్టుగా గోబినాథ్ వ్యవహరించారు.

 పోటీల్లో ఫస్ట్‌ప్రైజ్

2016లో నాసాతో కలిసి ఐ డూడుల్ లెర్నింగ్, కొలరాడో స్పేస్ గ్రాండ్ కన్సోషన్ సంస్థలు క్యూబ్స్ ఇన్ స్పేస్ అంతర్జాతీయ స్థాయి పోటీలు నిర్వహించాయి. ఇందులో 57 దేశాల నుంచి రకరకాల ప్రాజెక్టులను ప్రదర్శించారు. అందులో ఇండియా నుంచి స్పేస్‌కిడ్స్ ఇండియా ప్రదర్శించిన కలామ్‌శాట్ మొదటిస్థానంలో నిలిచింది.

 కలామ్‌శాట్ లక్ష్యం

స్మార్ట్‌ఫోన్ కంటే తక్కువ బరువుండే ఈ శాటిలైట్‌ను నాసా వర్జీనియా నుంచి అంతరిక్షంలోకి విజయవంతంగా పంపింది. అంతరిక్షంలో గురుత్వాకర్షణ వాతావరణంలో కార్బన్ ఫైబర్ త్రీడీ ముద్రణ పనితీరును పరిశీలించడమే దీని ప్రధాన లక్ష్యం. అంతరిక్షంలో ప్రయోగించిన ఉపగ్రహాలపై ధార్మిక కిరణాల వల్ల జరిగే మార్పులను ఇది రికార్డు చేస్తుంది. స్పేస్‌కిడ్స్ ఇండియా సంస్థ సహకారంతో తయారుచేసిన ఈ మినీ సబ్ ఆర్బిటాల్ శాటిలైట్‌లో ఆరు సెన్సార్లు, సాంకేతిక పరికరాలు ఉన్నాయి. 125 నిమిషాల పాటు ఈ శాటిలైట్ పనిచేయగలదు.

©2019 APWebNews.com. All Rights Reserved.