రాజ భవనంలాంటి గ్రంథాలయం...!

చెక్‌ రిపబ్లిక్‌ దేశంలోని ప్రేగ్‌ నగరంలో ఉన్న 'ది క్లెమెంటియం' గ్రంథాలయం రాజభవనాన్ని తలపిస్తుంది. పుస్తకప్రియులు, సాహిత్యాభిమానులే కాదు సామాన్య జనం ఆ గ్రంథాలయానికి క్యూ కడుతున్నారు. ఎందుకంటే అది ప్రపంచంలోనే అందమైన గ్రంథాలయం. ఆ గ్రంథాలయం విశేషాలేంటో తెలుసుకుందామా..

 గ్రామాల్లోనైనా, నగరాల్లోనైనా గ్రంథాలయాలన్నీ పాతభవనాల్లోనే ఉంటాయి. ఎలా ఉన్నా కానీ హాయిగా కాసేపు పుస్తకాలు, వార్త పేపర్లు చదువుకుందామనే గ్రంథాలయానికి వెళతాం. మరి గ్రంథాలయం ఇంద్రభవనంలా ఉంటే ఇక చెప్పేదేముంది. పుస్తక ప్రియులు, సాహిత్యాభిమానులతో పాటు, అందరూ గ్రంథాలయానికి వరుస కడతారు. ప్రేగ్‌ నగరంలో ఉన్న 'ది క్లెమెంటియం లైబ్రరీ' అచ్చం ఇంద్రభవనంలానే ఉంటుంది. ఇక ఆ గ్రంథాలయానికి వచ్చిన వాళ్లంతా భవన అందాలను చూస్తూ ఉండిపోతారు. ఇటీవలే జరిగిన ఆన్‌లైన్‌ పోటీలో 'ప్రపంచంలోనే అందమైన గ్రంథాలయం'గా మొదటి స్థానంలో నిలిచింది. గ్రంథాలయంలోని గోడలపై ఉన్న అందమైన కళారూపాలు అందరిని ఆకట్టుకుంటాయి. పైకప్పు కూడా పెయింటిగ్స్‌తో ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. గ్రీకు కథల ఆధారంగా ఈ చిత్రాలను గీశారు. దీన్ని ఫ్రెస్కో పెయింటింగ్‌ అంటారు. వీటిని 'జాన్‌ హిబ్ల్‌' అనే చిత్రకారుడు చిత్రించాడు. పుస్తకాల అరలు ఎంతో చూడ ముచ్చటగా ఉంటాయి. గ్రంథాలయంలో ఎటూ చూసినా ఆకట్టుకునే కళాఖండాలే దర్శనమిస్తాయి. జీసుట్‌ విశ్వవిద్యాలయ నిర్మాణంలో భాగంగా ఈ లైబ్రరీని ఏర్పాటు చేశారు. ఈ విశ్వవిద్యాలయాన్ని 1722 సంవత్సరంలో ప్రారంభించారు. బరోఖ్‌ నిర్మాణ శైలీలో నిర్మించిన ఈ భవన సముదాయ విస్తీర్ణం దాదాపు ఐదు ఎకరాలు. చెక్‌ రిపబ్లిక్‌కు సంబంధించిన వివిధ సాహిత్య పుస్తకాలు, ఇక్కడ ఉన్నాయి. అంతేకాదు వందల ఏండ్ల నాటి చారిత్రక పుస్తకాలను, గ్రంథాలను ఇక్కడ భద్రపరిచారు. ఈ చారిత్రక గ్రం థాలన్నింటిని డిజిటలైజేషన్‌ చేసేందుకుగానూ గూగుల్‌ సంస్థకు ఇటీవలే పంపించారు.ఆ చారిత్రక విశేషాలను మరికొన్ని రోజుల్లో ఈ-బుక్స్‌లో కూడా చదువుకోవచ్చు. ఈ గ్రంథాలయంలో దాదాపు 20000 పుస్తకాలు ఉన్నాయి. పలు భాషల్లో వెలువడిన బైబిల్‌ గ్రంథాలన్నీ కూడా ఇక్కడున్నాయి. విదేశీ సాహిత్య పుస్తకాలతో పాటు, అరుదైన పుస్తకాలను ఇక్కడ చదవచ్చు.

©2019 APWebNews.com. All Rights Reserved.