ప్రణాళిక.. విజయానికి పాచిక సమయాన్ని సద్వినియోగం చేసుకోండి...

ప్రణాళిక.. విజయానికి పాచిక 
సమయాన్ని సద్వినియోగం చేసుకోండి... 
విద్యార్థి.. యువతకు నిపుణుల సూచనలివి... 

కడప విద్య, న్యూస్‌టుడే : ఫిబ్రవరి 28 నుంచి ఇంటర్మీడియట్‌.. మార్చి 15వ తేదీ నుంచి పదో తరగతి పరీక్షలు.. ప్రస్తుత ప్రభుత్వ నోటిఫికేషన్‌తో టెట్‌, డీఎస్సీలకు సన్నద్ధమవుతున్న నిరుద్యోగ యువత.. డిగ్రీ పరీక్షలకు హాజరుకానున్న విద్యార్థులు.. మొత్తంగా ఏ కార్యాచరణతో ఎంత మేరకు పక్కా ప్రణాళికతో ముందుకు వెళుతున్నారన్న క్షేత్రస్థాయి సమయపాలన అమలు సద్వినియోగంతోనే ఫలితాలు అందుకోనున్నారు. ఒక్కసారి సమయం మించిపోతే ఒత్తిడికి లోనుకావడం, ఆపై ఎంతోమంది యువత ప్రాణాలు విడవడం చూస్తూనే ఉన్నాం. కాలాన్ని ఎలా విభజన చేయాలి, దేనికి ప్రాధాన్యం ఇవ్వాలో ముందుగానే ప్రణాళిక చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాలాన్ని సద్వినియోగం చేసుకున్న వారికే జీవితం పూలబాటగా మారుతుంది. ఏ మనిషికైనా రోజుకు 24 గంటలే. అయితే ఆ సమయాన్ని ఉపయోగించుకునే విధానం, ఆలోచన, ప్రణాళికతో వేసే అడుగులే ఒకరిని మొదటి స్థానంలో, మరొకరిని చివరి స్థానంలో, ఎంతో మందిని వారి మధ్యలో నిలిచేలా చేస్తుంది. లక్ష్యాన్ని నిర్ధేశించుకుని దాన్ని సాధించుకునే క్రమంలో ఎవరి పట్టుదల, కృషి మేరకు వారు ఫలితాలు అందుకుని ఉన్నత స్థానాలకు చేరుకునే అవకాశాలు ఉన్నాయని వైద్య నిపుణులు, మేధావులు సూచిస్తున్నారు. నిద్రలేకుండా చదవడం, చరవాణి, టీవీ, సినిమాలకు సమయం వృథా చేసుకోకుండా, ఒత్తిడిలోనై ఆరోగ్య, ఇతరత్రా సమస్యలు తెచ్చుకోకుండా ముందడుగులు వేయాలని చెబుతున్నారు. అటు విద్యాలయాలలోనూ ఇటు కోచింగ్‌ సెంటర్లలోనూ పరీక్షల వాతావరణం నెలకొన్న దృష్ట్యా సమయపాలన, ప్రణాళిక ప్రాముఖ్యతను విద్యార్థులు, అభ్యర్థులు గుర్తించుకోవాల్సిన ఆవశ్యకత ఉంది.

సరైన నిద్ర అవసరం : పరీక్షలకు విద్యార్థులు సిద్ధమవుతున్న సమయంలో మనసు నిద్ర కోరితే కాస్త విశ్రమించడం మంచిదేనని మానసిక నిపుణులు చెబుతున్నారు. నిద్ర వచ్చే సమయంలో బలవంతంగా ఆపుకుని చదవడం వల్ల ఏ విషయమూ మెదడుకు చేరకపోగా అనారోగ్యానికి దారితీస్తుంది. రాత్రి 11 గంటల తరువాత చదవడం మంచిది కాదన్నది వైద్య నిపుణుల అభిప్రాయం. పరీక్షల కాలంలో సరైన నిద్ర లేకుంటే మెదడుకు అలసట పెరిగిపోయి చదువుతున్న అంశాలను గుర్తించుకునే వీలులేకపోవచ్చు. అందుకే రాత్రి 11 గంటల వరకూ చదివి తిరిగి వేకువజామున మూడు గంటల నుంచి చదివేలా ప్రణాళిక చేసుకోవాలి. ఈ సమయంలో మన మెదడులో ఎలాంటి ఆలోచనలు ఉండవు. వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. చదివిన కొద్దిసేపైనా మననం చేసిన ప్రతి అంశం మెదడులో నిక్షిప్తమవుతుంది.

©2019 APWebNews.com. All Rights Reserved.