నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా... స్పెషల్ స్టోరీ ...!

ప్రపంచ పర్యావరణ దినోత్సవంను ప్రతి సంవత్సరం జూన్ 5 తేదిన జరుపుకుంటున్నారు. పర్యావరణానికి అనుకూలమైన చర్యలు తీసుకోవడానికి అవసరమైన ప్రపంచ అవగాహనను పెంచడానికి ఈ రోజున కొన్ని చర్యలు చేపడతారు.

ఇది యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ (UNEP) ద్వారా నడపబడుతుంది. ఈ రోజున మానవ పర్యావరణం పై ఐక్యరాజ్యసమితి సమావేశం ప్రారంభించింది. 1972 జూన్ 5 వ తేది నుంచి 16 వ తేది వరకు మానవ పర్యావరణంపై ఐక్యరాజ్యసమితి సమావేశం అయింది. ఈ సందర్భంగా 1972 లో యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ ద్వారా ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఏర్పాటు చేయబడింది. 1973 లో మొదటిసారి ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుకున్నారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఈ సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ ప్రపంచ పర్యావరణ దినోత్సవమును జూన్ 5 తేదిన వేర్వేరు నగరాలలో విభిన్న రీతులలో అంతర్జాతీయ వైభవంగా జరుపుకుంటున్నారు.జూన్ 5, 2006లో అల్గేరియా దేశంలో, "డోంట్ డెజర్ట్ డ్రైల్యాండ్స్" అనే నినాదంతోనూ... జూన్ 5, 2007లో నార్వేలో "మెల్టింగ్ ఐస్ ఎ హాట్ టాపిక్" అనే నినాదంతో... జూన్, 2008 న్యూజిలాండ్‌లో "కార్బన్‌డయాక్సైడ్, కిక్ ద హాబిట్ టు వర్డ్స్ ఎ లా కార్బన్ ఎకానమీ" అనే నినాదంతోనూ... పర్యావరణ దినోత్సవం సందర్భంగా అంతర్జాతీయ సమావేశాలను నిర్వహించారు.

ఇదిలా ఉంటే...

నేడు మానవుడు తన మేధో సంపత్తితో శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకుని, ప్రపంచవ్యాప్తంగా పలు పరిశ్రమలను నెలకొల్పుతున్నాడు. ఈ పరిశ్రమలు వెదజల్లే కాలుష్యంతో కోలుకోలేనంతగా వాతావరణం కలుషితమై... పీల్చే గాలి, త్రాగే నీరు, తినే ఆహారం.. అన్నీ కలుషితమవుతున్నాయి. మానవుడు తన స్వార్థ ప్రయోజనాల కోసం ప్రకృతి ప్రసాదించిన వనరులను అవసరానికి మించి వాడుకుంటున్నాడు.

అంతేగాకుండా, మానవుడు తన వేగవంతమైన జీవితంలో వాహన వేగం పెంచుతూ, ఇంధన కొరతకు కారణమవుతున్నాడు. కార్బన్‌ మోనాక్సైడ్, కార్బన్ డై ఆక్సైడ్ లాంటి విషపూరిత వాయువులు వాతావరణంలో పరిమితికి మించి పెరగడం వల్ల క్రమంగా భూమండలం వేడెక్కుతోంది. అడవులు, జల వనరులు క్రమేపీ తగ్గిపోతున్నాయి. ఈ రకంగా, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో సాధించిన పురోగతి కూడా ప్రకృతి కాలుష్యానికి కారణమవుతోంది.
 ప్రకృతి వనరులను నాశనం చేసుకుంటే, ముందు ముందు జీవకోటికి మనుగడ లేకుండా పోతుందన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తెరిగి నడుచుకోవాలి. దీనికి పర్యావరణ పరిరక్షణ ఒక్కటే నివారణ మార్గమని ఐక్యరాజ్యసమితి కూడా నినదిస్తోంది. అందులో భాగమే, ఈ ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పాటించటం. ఇకపోతే... ప్రపంచవ్యాప్తంగా ఓ సమస్యగా పరిణమించిన వాతావరణ కాలుష్యాన్ని నివారించే క్రమంలో మానవులంతా బాధ్యతాయుతమైన పాత్రను పోషించాల్సిన సమయం ఆసన్నమైంది.

©2018 APWebNews.com. All Rights Reserved.