కేబుల్‌ టీవీ నెట్‌వర్క్‌ ద్వారా ఇంటర్నెట్‌ సేవలు..!

కేబుల్‌ టీవీ నెట్‌వర్క్‌ ద్వారా ఇంటర్నెట్‌ సేవలను అందించడానికి కేంద్ర ప్రభుత్వం సమాలోచన చేస్తున్నది. దేశంలో 19కోట్ల గృహాలలో టెలివిజన్‌లు వాడుతున్నట్టు అంచనా.

వీటిలో 10 కోట్ల గృహాలలో కేబుల్‌ టీవీ నెట్‌వర్క్‌ ద్వారా ప్రసారాలు జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా ఎక్కువ మందికి ఇంటర్నెట్‌ సేవలు అందుబాటులోకి తేవాలంటే కేబుల్‌ టీవీ నెట్‌వర్క్‌ను ఉపయోగించుకోవడం ఒక మంచి పరిష్కారమార్గమని కేంద్ర సమాచార మంత్రిత్వశాఖ, ట్రాయ్‌ భావిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఫిక్స్‌డ్‌ లైన్‌ ద్వారా సగటున 46శాతం మందికి ఇంటర్నెట్‌ సేవలు అందుతుండగా మనదేశంలో ఫిక్స్‌డ్‌ లైన్‌ ద్వారా 7శాతం మందికే ఈ సేవలు అందుతున్నాయని తేలింది. వినియోగదారులు తమ గృహాలలో సెట్‌టాప్‌ బాక్సులు మార్చుకుంటే కేబుల్‌ టీవీతోపాటు ఇంటర్నెట్‌ సేవలను కూడా పొందడానికి వీలు ఉంటుందని భావిస్తున్నారు.

ఫిక్స్‌డ్‌ లైన్‌ ద్వారా అత్యంత వేగంగా, నాణ్యమైన ఇంటర్నెట్‌ సేవలు అందించేందుకు వీలు ఉంటుందని ప్రభుత్వం భావిస్తున్నది. అయితే ఏటా కేబుల్‌ ఆపరేటర్లు టెలికం శాఖకు టీవీ ప్రసారాలకు సంబంధించి 8శాతం వరకు ఏజీఆర్‌ (యాన్యువల్‌ జనరల్‌ రెవెన్యూ) చెల్లిస్తున్నారు. ఫిక్స్‌డ్‌ లైన్‌ ద్వారా ఇంటర్నెట్‌ సేవలు కూడా అందించినప్పుడు ఈ రెవెన్యూ ఎలా పంచుకోవాలన్న విషయంపై స్పష్టత రావలసి ఉంది. దక్షిణ కొరియాలో కేబుల్‌ టీవీ ఆపరేటర్లకు ఆ దేశ ప్రభుత్వం ఏజీఆర్‌ చెల్లింపులు రద్దు చేసింది. దీంతో ఆ దేశంలో ఫిక్స్‌డ్‌ లైన్‌ ద్వారా ఇంటర్నెట్‌ సేవల అందుబాటు 93 శాతానికి చేరింది. అదే పద్ధతి మనదేశంలో కూడా పాటిస్తే ఎలా ఉంటుందన్న విషయంపై వివిధ ప్రభుత్వశాఖల మధ్య చర్చలు జరుగుతున్నాయి.
©2019 APWebNews.com. All Rights Reserved.