ఆండ్రాయిడ్‌ అప్‌డేట్ల రహస్యమిది!

మీ ఫోన్లో ఆండ్రాయిడ్‌ లేటెస్ట్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ అప్‌డేట్లు రావడం లేదా? గూగుల్‌ ఎప్పటికప్పుడు లేటెస్ట్‌ వెర్షన్లు విడుదల చేస్తున్నప్పటికీ మీ ఫోన్‌కి ఎందుకు రావడం లేదు? అసలు ఒక కొత్త వెర్షన్‌ డెవలప్‌ చేసే ప్రక్రియ ఎలా ఉంటుంది?ఆ విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం.

పంచవ్యాప్తంగా జావా ఆధారంగా పనిచేసే ఫోన్లు, కొన్నిచోట్ల సింబియాన్‌ సిరీస్‌ 60, 80, యుఐక్యూ సిరీస్‌ ఫోన్లతో నిండిపోయిన తరుణంలో ఆండ్రాయిడ్‌ ఇన్‌కార్పొరేషన్‌ అనే సంస్థ నుండి 2005లో గూగుల్‌ ఆండ్రాయిడ్‌ని కొనుగోలు చేసింది. లైనెక్స్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ ఆధారంగా డెవలప్‌ చేయబడిన మొబైల్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ ఇది. కేవలం మొబైల్‌ ఫోన్లలో మాత్రమే కాదు ప్రస్తుతం ఇది ఆండ్రాయిడ్‌ ఆటో, వేర్‌ ఓయెస్‌ అనే వెర్షన్‌ ద్వారా స్మార్ట్‌ వాచ్‌లు, గేమ్‌ కన్సోళ్లు, స్మార్ట్‌ టీవీలు, డిజిటల్‌ కెమెరాలు, పర్సనల్‌ కంప్యూటర్లు, ఇతర ఎలకా్ట్రనిక్‌ డివైజ్‌లలో వాడబడుతోంది. సరిగ్గా పదేళ్ల క్రితం సెప్టెంబర్‌ 23, 2008న గూగుల్‌ సంస్థ ఆండ్రాయిడ్‌1.0 ఫైనల్‌ వెర్షన్‌ విడుదల చేసింది. ఆండ్రాయిడ్‌ 1.0, 1.1 వెర్షన్లకి ప్రత్యేకంగా ఎలాంటి కోడ్‌ నేమ్స్‌ లేనప్పటికీ 2009లో ఆండ్రాయిడ్‌ 1.5 మొదలుకుని (దాన్ని కప్‌ కేక్‌ అనే వారు) ఇప్పటివరకు గూగుల్‌ సంస్థ విడుదల చేసే తాజా ఆండ్రాయిడ్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌కి ఏదో ఒక స్వీట్‌ పేరు పెట్టబడుతుంది. ఈ క్రమంలో డోనట్‌, ఎస్లెయిర్‌, ఫ్రాయో, జింజిర్‌బ్రెడ్‌, హనీకాంబ్‌, ఐస్‌క్రీమ్‌ శాండ్‌విచ్‌, జెల్లీబీన్‌, కిట్‌కాట్‌, లాలీపాప్‌, మార్ష్‌మల్లో వంటి పేర్లు మనందరికీ తెలిసినవే. ఇదీ క్లుప్తంగా ఆండ్రాయిడ్‌ చరిత్ర!
 
కంప్యూటర్‌ మాదిరిగా పనితీరు కష్టమేనా?
ఈరోజు మన మొబైల్‌ ఫోన్లలో అన్ని రకాల పనులు చేసుకుంటున్నప్పటికీ ఆర్కిటెక్చర్‌ పరంగా మాత్రం డెస్క్‌టాప్‌ కంప్యూటర్లలో చేయగలిగి నంత శక్తివంతమైన పనులను స్మార్ట్‌ఫోన్లలో చేయడానికి సాధ్యపడదు. దీనికి ప్రధాన కారణం దాదాపు అధికశాతం మొబైల్‌ ఫోన్లు ఎఆర్‌ఎం ప్రాసెసర్ల ఆధారంగా పనిచేయడం. ఇవి ఒకసారికి అతి తక్కువ ఆదేశాలను మాత్రమే ప్రాసెసర్‌ ద్వారా ప్రాసెస్‌ చేయగలుగుతాయి. అయితే చేసే ఆ కొద్ది పనులు మాత్రం చాలా వేగంగా పూర్తి చేయబడతాయి. మొబైల్‌ ఫోన్లు ఎక్కువగా బ్యాటరీ మీద ఆధారపడి పని చేయడం వలన విద్యుత్‌ ఎక్కువగా వినియోగించబడకుండా ఉండడం కోసం ఇలా ఎఆర్‌ఎం ప్రాసెసర్లని ఫోన్లలో అమర్చుతారు. అంతేకాదు, డెస్క్‌టాప్‌ కంప్యూటర్లో ప్రాసెసర్‌ని నిరంతరం చల్లబరచడం కోసం హీట్‌సింక్‌లు, కూలింగ్‌ ఫ్యాన్లు లభిస్తాయి. అయితే స్మార్ట్‌ఫోన్లు పలుచగా ఉండడంవల్ల వాటిలో ఇవి సాధ్యపడవు. అందుకే మీరు ఎక్కువ సేపు కెమెరా ద్వారా రికార్డింగ్‌ చేసినా, ఫోన్‌ వేడెక్కిపోవడంతో పాటు అది చల్లబడే వరకూ ప్రాసెసర్‌ స్లోగా పనిచేసేలా ఏర్పాటు చేయబడుతుంది. ఈ కారణం చేతే ఆ కొద్దిసేపు ఫోన్‌ స్లోగా పనిచేస్తుంది. ఇదంతా ఎందుకు చెప్పానంటే, గూగుల్‌ సంస్థ ఎప్పటికప్పుడు విడుదల చేసే ఆండ్రాయిడ్‌ లేటెస్ట్‌ వెర్షన్లలో ఎఆర్‌ఎం ఆర్కిటెక్చర్‌లో ఉన్న పరిమితులను దృష్టిలో పెట్టుకుని కొత్త ఫీచర్లు ప్రవేశ పెడుతూ ఉంటుంది. ఈ కారణం చేతే మల్టీటాస్కింగ్‌ వంటివి ఆండ్రాయిడ్‌లో కొద్దిగా కష్టం. గత కొన్నేళ్లుగా స్ల్పిట్‌ స్ర్కీన్‌ వంటి సదుపాయా లతో ఒకేసారి స్ర్కీన్‌ మీద రెండు అప్లికేషన్లు ఓపెన్‌ చేసి పని చేసుకునే సదుపాయం వచ్చింది అనుకోండి.
 
ఫోన్‌ కంపెనీలు తమకు తగ్గట్లు!
సరే, ఆండ్రాయిడ్‌ ఆపరేటింగ్‌ సిస్టం లేటెస్ట్‌ వెర్షన్‌ పైన చెప్పుకున్నట్లు గూగుల్‌ సంస్థ ఆగస్టు నెలలో విడుదల చేస్తే.. అది ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక ఫోన్‌ తయారీ కంపెనీల లేటెస్ట్‌ మోడల్‌ ఫోన్లకి అందుబాటులోకి రావడానికి దాదాపు ఏడాది సమయం పడుతుంది. ఉదాహరణకు సామసంగ్‌నే తీసుకుంటే.. సాంసంగ్‌ ఎక్స్పీరియన్స్‌ అనే కస్టమ్‌ ఫర్మ్‌వేర్‌నీ, షామీని తీసుకుంటే ఎంఐయుఐ అనే ఫర్మ్‌వేర్‌నీ ఇవి కలిగి ఉంటాయి. గూగుల్‌ ఆండ్రాయిడ్‌ తాజా వెర్షన్‌లో యూజర్‌ ఇంటర్ఫేస్‌ మొదలుకొని, చిన్న చిన్న అదనపు ఆప్షన్ల వరకూ జతచేర్చి అవి తమ యూజర్లకి అందిస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ ఒక్కో ఫోన్లో ఒక్కో ప్రాసెసర్‌, ర్యామ్‌ పరిమాణం, కెమెరా, ఇతర సెన్సార్లు పొందుపరచబడి ఉండటం వలన ఒక మోడల్‌ కోసం కస్టమైజ్‌ చేసిన ఆపరేటింగ్‌ సిస్టం మరో ఫోన్లో ఉన్నది ఉన్నట్లు పనిచేయదు. ఒకవేళ అలా ఒక ఫోన్‌ కోసం తయారుచేయబడిన రామ్‌ని వేరే ఫోన్లో ఫ్లాష్‌ చెయ్యడానికి ప్రయత్నించినా ఫోన్‌ హార్డ్‌ బ్రిక్‌ అవుతుంది. సంవత్సరానికి ఐదారు ఫోన్‌ మోడళ్లు విడుదల చేసే షామీ, సాంసంగ్‌ వంటి కంపెనీలు అన్ని లేటెస్ట్‌ మోడళ్లకి తగ్గట్లు మార్పులు చేర్పులూ చేయడానికి చాలా సమయం అదనంగా పడుతుంది. అందుకే నెలలు గడిచినప్పటికీ ఆండ్రాయిడ్‌ లేటెస్ట్‌ వెర్షన్లు మన ఫోన్లకి రావు.
 
వేరే మార్గం ఉందా?
ఫోన్‌ తయారీ కంపెనీలు గత ఒకటి రెండు ఏళ్ళుగా విడుదల చేసిన ఫోన్‌లకు మాత్రమే లేటెస్ట్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ను అందిస్తూ ఉంటాయి. అది కూడా పైన చెప్పుకున్నట్లు ఆలస్యంగా లభిస్తుంది! ఒకవేళ మీ దగ్గర పాత మోడల్‌ ఉన్నట్లయితే, అలాగే లేటెస్ట్‌ అప్‌డేట్‌ కోసం నెలల తరబడి ఆగడం మీ వల్ల కాకపోతే దానికి పరిష్కారం లేదా?
 
ఖచ్చితంగా ఉంది!
కొంత మంది ఔత్సాహిక డెవలపర్లు గూగుల్‌ సంస్థ విడుదల చేసిన ఆండ్రాయిడ్‌ లేటెస్ట్‌ ఆపరేటింగ్‌ సిస్టంలో పెద్దగా ఎలాంటి మార్పులు చేయకుండా, కేవలం కెమెరా, వైఫై, జిపిఎస్‌ వంటి సెన్సార్లు సక్రమంగా పని చేసే విధంగా మార్పులు చేసి వివిధ ఫోన్‌ మోడళ్ల కోసం కస్టమ్‌ రామ్‌లను విడుదల చేస్తూ ఉంటారు. మీరు వాడుతున్న ఫోన్‌ మోడల్‌కి అలాంటి కస్టమ్‌ రామ్‌ ఏదైనా లభిస్తుందేమో వెదికి దాన్ని మీ ఫోన్లో ఫ్లాష్‌ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఫ్లాషింగ్‌ అంత సులభమైన ప్రక్రియ కాదు. మొదట మీ ఫోన్లో బూట్‌లోడర్‌ అన్‌లాక్‌ చేయాలి. ఆ తర్వాత ఫోన్‌ రూట్‌ చేసి, టిడబ్యుఆర్‌పి వంటి కస్టమ్‌ రికవరీ ఇన్‌స్టాల్‌ చేసి, దాని ద్వారా మాత్రమే కస్టమ్‌ రామ్‌ ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి. ఈ ప్రొసీజర్‌ మోడల్‌ని బట్టి మారుతూ ఉంటుంది. అలాగే ఒక ఫోన్‌ కోసం తయారు చేయబడిన కస్టమ్‌ రామ్‌ బదులు మరొకటి ఫోన్‌ మోడల్‌ది ఫ్లాష్‌ చేస్తే పార్టీషన్‌ టేబుల్‌ కరప్ట్‌ అయి ఫోన్‌ ఎందుకూ పనికిరాకుండా హార్డ్‌ బ్రిక్‌ అయ్యే ప్రమాదమూ ఉంది. కాబట్టి కొద్దిగా అవగాహన ఉన్నవారు మాత్రమే ఇలా చేయొచ్చు.
 
మంత్లీ సెక్యూరిటీ ప్యాచ్‌లు
కొత్త ఆండ్రాయిడ్‌ వెర్షన్‌ విడుదల చేసే విషయంలో గూగుల్‌ సంస్థ ఫోన్‌ తయారీదారులపై ఎలాంటి ఒత్తిడి తీసుకురానప్పటికీ.. కనీసం నెలవారీ సెక్యూరిటీ ప్యాచ్‌లనైనా విడుదల చేయండి అంటూ వత్తిడి తీసుకు వస్తోంది. దీనికి ప్రధాన కారణం ఆండ్రాయిడ్‌ బాగా పాపులర్‌ కావడంతో ఎప్పటికప్పుడు అందులో ఎన్నో సెక్యూరిటీ లోపాలు బయట పడుతున్నాయి, వాటిని ఆసరాగా చేసుకుని హ్యాకర్లు మన ఫోన్లోకి జొరబడే ప్రమాదముంది. అందుకే ఆ లోపాలను ఎప్పటికప్పుడు పూడ్చడం కోసం గూగుల్‌ సంస్థ ప్రతీనెలా సెక్యూరిటీ ప్యాచ్‌లు విడుదల చేస్తోంది. కొన్ని ఫోన్‌ తయారీ కంపెనీలు వాటిని ప్రతీ నెలా మిస్‌ అవకుండా తాము తయారు చేసిన కొన్ని ఫోన్‌ మోడళ్లకి అందిస్తున్నాయి. పాత ఫోన్‌ మోడళ్ల విషయంలో మాత్రం ఈ ప్యాచ్‌లు కూడా లభించక అనేక లోపాలతో అవి కొనసాగుతున్నాయి.
 
పరిష్కారం ఎప్పుడు?
ఆపిల్‌ ఐఫోన్లని చూస్తే దాదాపు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని ఫోన్లు లేటెస్ట్‌ ఆపరేటింగ్‌ సిస్టం కలిగి ఉంటాయి. కానీ ఆండ్రాయిడ్‌ విషయంలో ఫోన్‌ తయారీ కంపెనీల అశ్రద్ధ వల్ల అది సాధ్యపడడం లేదు. ఆండ్రాయిడ్‌ మీద ఉన్న అతిపెద్ద ఫిర్యాదు కూడా అదే. దీన్ని సరి చేయడం కోసం గూగుల్‌ అనేక ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే ఆండ్రాయిడ్‌ ఓన్‌ అనే ప్లాట్‌ఫాం తీసుకొచ్చి, దాని క్రింద ఫోన్లు తయారు చేసే కంపెనీలు గూగుల్‌ పర్యవేక్షణలో ఎప్పటికప్పుడు అప్‌డేట్లు అందించే విధంగా ఏర్పాటు చేసింది. అలాగే ప్రాజెక్ట్‌ ట్రెబల్‌ పేరుతో ఫోన్‌ తయారీ కంపెనీల కస్టమైజ్డ్‌ కోడ్‌తో సంబంధం లేకుండా కేవలం ఆపరేటింగ్‌ సిస్టమ్‌ వరకు విడిగా అప్‌డేట్‌ అయ్యే ప్రత్యేకమైన పార్టీషన్‌ స్ట్రక్చర్‌ని గూగుల్‌ సంస్థ ఆండ్రాయిడ్‌ ఓరియో నుండి అందుబాటులోకి తీసుకువచ్చింది. అయితే మన నిర్లక్ష్యపు ఫోన్‌ తయారీ కంపెనీలు ఇప్పటికీ బద్ధకంగా వ్యవహరిస్తూ ఈ ప్రాజెక్ట్‌ ట్రెబల్‌ సపోర్ట్‌ని కూడా అందించ కుండా మొద్దు నిద్ర వహిస్తున్నాయి. లేటెస్ట్‌ అప్‌డేట్లు ఇవ్వకపోతే మేం కొత్త ఫోన్లు కొనుగోలు చేయం అని
వినియోగదారులు భీష్మించుకు కూర్చున్న ప్పుడు మాత్రమే పరిస్థితిలో మార్పు వస్తుంది.
 
కొత్త వెర్షన్‌ ఎప్పుడు?
ఏడాదికి ఒకసారి గూగుల్‌ సంస్థ ఆండ్రాయిడ్‌ లేటెస్ట్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ విడుదల చేస్తూ ఉంటుంది. సహజంగా ప్రతి ఏటా మార్చి నెలలో కొత్త వెర్షన్‌ డెవలపర్‌ ప్రివ్యూ రిలీజవుతుంది. ఇది కేవలం అప్లికేషన్‌ డెవలపర్లకు మాత్రమే ఉద్దేశించబడింది. అలాగే ఈ వెర్షన్‌ని శాంసంగ్‌, ఎల్‌జి, ఒన్‌ప్లస్‌, షామీ వంటి వివిధ ఫోన్‌ తయారీ కంపెనీలు దాన్ని తమ ఫోన్లకు తగ్గట్లు కస్టమైజ్‌ చేసుకోవటానికి సాధ్యాసాధ్యాలు పరిశీలిస్తాయి. మొట్టమొదట గూగుల్‌ సంస్థ విడుదల చేసే పిక్సెల్‌ ఫోన్లకి ఆండ్రాయిడ్‌ కొత్త వెర్షన్‌ డెవలపర్‌ ప్రివ్యూ అందించబడుతుంది. అయితే గత ఏడాది నుండి ఒన్‌ప్లస్‌ వంటి కొన్ని ఇతర ఫోన్‌ తయారీ సంస్థలకు కూడా డెవలపర్‌ ప్రివ్యూ అందించడం గూగుల్‌ మొదలు పెట్టింది. .
©2019 APWebNews.com. All Rights Reserved.