ఆన్‌లైన్‌ షాపింగ్‌ చేస్తున్నారా?

ఆన్‌లైన్‌ షాపింగ్‌లో దుస్తులు, పాదరక్షల విషయంలో చాలామంది చేదు అనుభవాలు ఎదుర్కొంటారు.

ఆర్డర్‌ చేసిన దానికి చేతికందిన దానికి తేడా కనిపిస్తుంది. కొన్నిసార్లు రంగులు, సైజులు మారిపోతాయి. కాస్త ప్రిపేర్‌ అయితే ఇలాంటి ఇబ్బందులను అధిగమించి సులువుగా ఆన్‌లైన్‌ షాపింగ్‌ చేయవచ్చు.

రంగుల ఎంపికలో తికమక
ఆన్‌లైన్‌లో దుస్తులు కొనేటప్పుడు ఆర్డర్‌ ఇచ్చిన రంగు ఒకటయితే, తీరా చేతికొచ్చేది మరో రంగు. మీ ల్యాప్‌టాప్‌ లేదా మొబైల్‌ స్ర్కీన్‌లో చూసినప్పుడు ఆ దుస్తులు నిజమైన రంగుకు భిన్నంగా కనిపించటమే దానికి కారణం. ఖచ్చితంగా మీకు నచ్చిన రంగునే ఎంచుకోవాలనుకుంటే మాత్రం ముందు దుస్తుల రంగుల గురించి కొంత అవగాహన ఉండాలి. కొన్ని దుస్తులు ఒరిజినల్‌గా చూసిన దానికి భిన్నంగా ఫోటోల్లో కనిపిస్తాయి. ముదురు రంగుల్లో ఉన్న దుస్తులు ఫోటోల్లో డల్‌గా కనిపిస్తాయి. కాంతిమంతంగా ఉండే రంగులు ఫోటోల్లో మరింత కాంతిమంతంగా కనిపిస్తాయి.
 
సైజ్‌ తెలిస్తే సరైన ప్రోడక్ట్‌
ఆన్‌లైన్‌లో నచ్చిన దుస్తులు, పాదరక్షలను ఆర్డర్‌ చేసేముందు కొలతలను సరి చూసుకోవాలి. అవసరమైతే టైలర్‌ సహాయం తీసుకోవాలి. తీసుకొన్న కొలతల ప్రకారం మన ఆర్డర్‌ను రివ్యూ చేసి ఎడిట్‌ చేయాలి. చాలాసార్లు ఆన్‌లైన్‌ షాపింగ్‌ చేసేవారు సైజ్‌చార్ట్‌లను పట్టించుకోరు. అన్ని వెబ్‌సైట్‌లలో కొలతల ప్రమాణాలు ఒకేలా ఉండవు. కాబట్టి తప్పనిసరిగా సైజ్‌చార్ట్స్‌లోకి వెళ్లి కొలతలు మళ్లీ ఒక్కసారి చూసుకోవాలి.
 
సైజ్‌లను సరిపోల్చడం
బ్రాండ్‌ను బట్టి కూడా సైజ్‌లు మారతాయి. చాలా బ్రాండ్‌లకు వాటి స్వంత సైజ్‌ చార్ట్‌లు ఉంటాయి. ఛాతీ, నడుము కొలతలు ఉన్న నోట్‌ను దగ్గర ఉంచుకోవాలి. మీ శరీర కొలతలు మీరు కొనాలనుకున్న బ్రాండ్‌ తాలూకు ఉత్పత్తలతో మ్యాచ్‌ అయ్యేలా చూసుకోవాలి. అప్పుడు మాత్రమే ఆన్‌లైన్‌లో కొన్నా దుస్తులు ఫిట్‌గా ఉంటాయి. ఒకవేళ పూర్తిగా సంబంధం లేని ప్రోడక్ట్‌ డెలివరీ అయితే దాన్ని తిరిగి వెనక్కి ఇచ్చేయండి.
©2019 APWebNews.com. All Rights Reserved.