హుస్సేన్‌సాగర్ శుద్ధి పనులను వేగవంతం చేయండి

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : హుస్సేన్‌సాగర్ శుద్ధి పనులను వేగవంతం చేయాలని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ అరవింద్ కుమార్ హెచ్‌ఎండీఏ కమిషనర్ చిరంజీవులను ఆదేశించారు. అత్యాధునిక యంత్రాల వినియోగంతో శుద్ధి ప్రక్రియకు తోడుగా ఎలాంటి రసాయనాలను వినియోగించకుండా అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో మురుగునీటి శుద్ధి విధానాన్ని చేపట్టాలన్నారు.

వేసవిలో మురుగు దుర్వాసన రాకుండా పకడ్భందీ చర్యలు తీసుకోవాలని, అవసరమైతే గతేడాది నూతన ఒరవడితో స్వచ్ఛ జలాలుగా మార్చిన ఈ జాక్స్ ఎన్వీరాన్‌మెంట్ ఎల్‌ఎల్‌పీ ఫర్ మాట్రిక్స్ ఎన్వీరాన్‌మెంట్ ఏజెన్సీ సహకారం తీసుకోవాలని అరవింద్ కుమార్ సూచించారు. శాటిలైట్ సహాయంతో ఫాస్పరస్, నైట్రేట్స్ తీవ్రతను తగ్గించి నీటిలోని ఆక్సిజన్ శాతాన్ని పెంచినట్లు ఈ సందర్భంగా ఈ జాక్స్ ప్రతినిధులు వివరించారు. 

హెచ్‌ఎండీఏ కమిషనర్ చిరంజీవులు, సీఈ బీఎల్‌ఎన్ రెడ్డితో కలిసి అరవింద్ కుమార్ శుక్రవారం ఉదయం హుస్సేన్‌సాగర్ పరివాహాక ప్రాంతాన్ని సందర్శించారు. ఐఅండ్‌డీ నిర్మాణాలతో పాటు కూకట్‌పల్లి నాలా డైవర్షన్ పనులు, శుద్ధి జరుగుతున్న విధానాలను స్వయంగా ఆయన పరిశీలించారు. హుస్సేన్‌సాగర్‌లోకి భారీగా ప్లాస్టిక్, ఇతర వ్యర్థాలు వచ్చి చేరుతున్న తీరు పట్ల అరవింద్‌కుమార్ అసంతృప్తి వ్యక్తం చేశారు.త్వరలో హుస్సేన్‌సాగర్ ప్రక్షాళన పనులపై సమీక్షిస్తానని, ఈ వేసవిలో ఎలాంటి దుర్వాసన రాకుండా తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. అంతకు ముందు నెక్లెస్‌రోడ్‌లోని ఐ ల్యాండ్ ప్రాంతాన్ని పరిశీలించి ఇక్కడ పచ్చదనం పెంపు చర్యలు చేపట్టాలని తెలిపారు. సంజీవయ్య పార్కులోని భారీ జెండా నిర్వహణ, సెక్యూరిటీ విధానాలను అరవింద్ కుమార్ అడిగి తెలుసుకున్నారు. ఈ పర్యటనలో డైరెక్టర్ శ్రీనివాస్, ఇంజినీర్లు పరంజ్యోతి, దయాకర్ రెడ్డి, సీఆర్వో సురేశ్ పాల్గొన్నారు.

తాజా వార్తలు

©2019 APWebNews.com. All Rights Reserved.