వరుడికి కట్నంగా కొండముచ్చు.. కేసు నమోదు

న్యూఢిల్లీ: వరుడికి కట్నంగా కొండముచ్చును ఇచ్చిన వింత సంఘటన హరియాణాలోని ఫతేహాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. ఐతే దీనికి కారణమైన వ్యక్తులు ప్రస్తుతం చట్టపరంగా చిక్కుల్లో పడ్డారు. ఫతేహాబాద్ జిల్లాలోని తోహానా పట్టణానికి చెందిన సంజయ్ పూనియాకు జింద్ జిల్లాకు చెందిన రీతూ అనే యువతితో వివాహం నిశ్చయమైంది. వీరిద్దరికీ ఫిబ్రవరి 11న వివాహం జరిపించారు. కొండ‌ముచ్చును పెంచుకుంటున్న విష‌యం కాస్త స్థానిక పత్రికల్లో రావడం, వన్యప్రాణి సంరక్షణ సిబ్బంది దృష్టికి చేరడంతో సీన్ రివర్స్ అయింది. 

సంజయ్ మాట్లాడుతూ.. వివాహం గురించి మాట్లాడేందుకు మా ఊరుకు వచ్చిన మామ చందీ రామ్(వధువు తండ్రి)ను మా వ్యవసాయం క్షేత్రానికి తీసుకెళ్లాను. అక్కడ పంటను కోతులు నాశనం చేయడాన్ని ఆయన చూశారు. ఇలాగైతే ఎలా అని నన్ను అడిగారని దీనికి సమాధానంగా త్వరలో ఓ కొండముచ్చును తీసుకురావాలని అనుకుంటున్నానని మామతో చెప్పాను. ఈ విషయాన్ని పసిగట్టిన వధువు తండ్రి చందీ రామ్ కట్నం బహుమతిగా కొండముచ్చును తనకు ఇచ్చినట్లు సంజయ్ పోలీసులకు వివరించాడు. 

ఈ ఘటనపై వైల్డ్‌లైఫ్ ఇన్‌స్పెక్టర్ జైవిందర్ నెహ్రా మాట్లాడుతూ.. ఎవరైనా కొండముచ్చును కలిగి ఉండటం, కొనుగోలు, అమ్మకాలు, అద్దెకు తీసుకోవడం లాంటివి చేస్తే వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కేసు అవుతుందన్నారు. ఈ చట్టాన్ని ఉల్లంఘిస్తే నిందితులకు ఏడేళ్లపాటు జైలుశిక్ష, రూ.25వేల జరిమానా, ఈ రెండింటిని కలిపి జరిమానాగా వేసే వీలుందని అన్నాడు. వైద్యుల బృందం కొండముచ్చుకు పరీక్షలు నిర్వహించి జంతుప్రదర్శనశాలకు తరలించారు. వరుడు సంజయ్ మామకు కొండముచ్చును ఎవరు అమ్మారనే విషయాన్ని ఎస్సై రాజ్‌బిర్ సింగ్ దర్యాప్తు చేస్తారని ఆయన అన్నారు.

©2019 APWebNews.com. All Rights Reserved.