వరదాయిని.. ఉపాధి ప్రదాయిని 
ఉచిత శిక్షణతో యువతకు బాసట 
ఆదర్శంగా ఆంధ్రాబ్యాంకు గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ సేవలు 
ఏలూరు అర్బన్‌, న్యూస్‌టుడే 

నిరుద్యోగ యువతకు ఆంధ్రాబ్యాంకు గ్రామీణ స్వయంఉపాధి శిక్షణ సంస్థ (ఏబీఎస్‌ఆర్‌ఎస్‌ఈటీఐ) వరదాయినిగా మారింది. జిల్లా కేంద్రమైన ఏలూరు సమీపాన వట్లూరులో ఈ సంస్థ కార్యాలయం ఉంది. ఆంధ్రాబ్యాంకుకు అనుబంధంగా ఏర్పడిన ఈ శిక్షణ సంస్థ ద్వారా ఇప్పటివరకు ఎంతో మంది యవతీ యువకులు వివిధ రకాల వృత్తివిద్య కోర్సుల్లో శిక్షణ పొంది స్వయం ఉపాధికి బాటలు వేసుకున్నారు. 
ఆంధ్రాబ్యాంకు గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థను ఏలూరులో 2011లో ఏర్పాటు చేశారు. తొలుత ‘ఎబర్డ్‌’ పేరిట అశోక్‌నగర్‌ వద్ద అద్దె భవనంలో దీనిని ఏర్పాటు చేశారు. ఇక్కడ యువతకు అందిస్తున్న ఉచిత శిక్షణ, ఉపాధి కార్యక్రమాలు సత్ఫలితాలను ఇవ్వడంతో దీన్ని కేంద్ర గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ గుర్తించింది. సంస్థ కార్యకలాపాలను విస్తృతం చేసి  ఎక్కువమంది యువతకు శిక్షణ, ఉపాధి అవకాశాలను కల్పించడం కోసం ఎంవోఆర్‌డీ ద్వారా నిధులను మంజూరు చేస్తోంది. 2017 అక్టోబరు 11న ‘ఎబర్డ్‌’ పేరును ఏబీఆర్‌ఎస్‌ఈటీఐగా మార్పుచేశారు. దేశవ్యాప్తంగా ఇటువంటి శిక్షణ కేంద్రాలు 584 ఉండగా ఆంధ్రప్రదేశ్‌లో 9 ఉన్నాయి. వీటిలో పశ్చిమగోదావరి జిల్లా వట్లూరులో ఉన్న కేంద్రం ఒకటి. ఆయా జిల్లాల లీడ్‌ బ్యాంకుల ఆధీనంలో ఈ శిక్షణ సంస్థలు పనిచేస్తున్నాయి. పశ్చిమగోదావరి జిల్లాలో లీడ్‌ బ్యాంకు అయిన ఆంధ్రాబ్యాంకు దీని నిర్వహణ బాధ్యతలను నిర్వరిస్తోంది.

ఎరువుల ధరల మంట! 
ఎరువుల ధరల మంట! 
డీఏపీ, కాంప్లెక్స్‌ ధరలు పెరుగుదల 
రైతులపై రూ. 20 కోట్ల నుంచి రూ. 30 కోట్ల భారం 
పాత నిల్వలను కొత్త ధరలకు అమ్మకం 

జిల్లా రైతుల నెత్తిన ఎరువుల ధర భారం పడింది. ఈనెల మొదటివారంలో ధరలు పెరగడంతో వ్యవసాయానికి మరింత వ్యయం చేయక తప్పని స్థితి. ప్రస్తుతం జిల్లాలో పంట ఆఖరి దశకు చేరుకున్న నేపథ్యంలో ఇప్పటికి పెద్దగా ఇబ్బందిలేక పోయినా నెల ప్రారంభం నుంచి  ఇప్పటివరకు అధిక భారం పడిందనే చెప్పాలి. డీఏపీ, కాంప్లెక్స్‌ల రూపంలో రైతులు భవిష్యత్తులో మరింత భారాన్ని మోయాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి.

ఈనాడు, ఏలూరు : జిల్లాలో ఖరీఫ్‌, రబీలు కలిపి సుమారు 10 లక్షల ఎకరాల్లో వరి సాగుచేస్తుండగా మరో 5 లక్షల ఎకరాల్లో ఇతర పంటలు  సాగవుతున్నాయి. సుమారు 5 లక్షల మంది రైతులు వ్యవసాయం చేస్తుండగా వీరంతా తమతమ పంటల్లో ఎరువులను వినియోగిస్తారు. వీరంతా కూడా మాటిమాటికి పెరుగుతున్న ఎరువుల ధరలతో ఆర్థిక భారాన్ని మోస్తున్నారు. కొద్దిరోజుల కిందట ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఎరువుల ముడి సరుకులపై జీఎస్టీ భారం పడటంతో ఎరువుల ధరలు పెరిగాయి. గతంలో డీఏపీ బస్తా రూ.1155 ఉండగా తాజాగా దీనిధర రూ. 1221  అయింది. అలాగే కాంప్లెక్స్‌ ఎరువులు ఆయా రకాలను బట్టి రూ. 873 నుంచి రూ. 930 వరకూ పెరిగాయి. మొత్తంగా చూస్తే ధరల పెరుగుదల బస్తాకు ఈస్థాయిలో పెరగడం వల్ల రైతులు ఆర్థిక భారం బాగా మోయాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. జిల్లాలో సంవత్సరానికి 2 లక్షల మెట్రిక్‌టన్నుల ఎరువులు వినియోగిస్తున్నారు. సరాసరిన టన్నుకు రూ. 13 వేలు పడితే సుమారు రూ. 318 కోట్లు ఎరువులపైనే రైతులు వెచ్చిస్తున్నారు. ప్రస్తుతం పెంచిన ధరలు వల్ల ప్రతీరైతు కచ్చితంగా ప్రతీ సీజన్‌లో పంటలను బట్టి రూ. వెయ్యి నుంచి రూ. 2500 వరకూ అదనపు భారం మోయాల్సిన పరిస్థితులు ఉన్నాయి. దీనివల్ల జిల్లావ్యాప్తంగా సుమారు రూ. 20 కోట్ల నుంచి రూ. 30 కోట్ల వరకూ  అదనపు భారం పడనుంది. జిల్లావ్యాప్తంగా పెరిగిన ధరలు ఫిబ్రవరి 1 నుంచి అమలులోకి రాగా పాత స్టాక్‌ను కూడా కొత్త దానితో కలిపి అమ్మకాలు చేస్తున్నారు.

Page 2 of 2

తాజా వార్తలు

©2019 APWebNews.com. All Rights Reserved.