ఎరువుల ధరల మంట!

ఎరువుల ధరల మంట! 
ఎరువుల ధరల మంట! 
డీఏపీ, కాంప్లెక్స్‌ ధరలు పెరుగుదల 
రైతులపై రూ. 20 కోట్ల నుంచి రూ. 30 కోట్ల భారం 
పాత నిల్వలను కొత్త ధరలకు అమ్మకం 

జిల్లా రైతుల నెత్తిన ఎరువుల ధర భారం పడింది. ఈనెల మొదటివారంలో ధరలు పెరగడంతో వ్యవసాయానికి మరింత వ్యయం చేయక తప్పని స్థితి. ప్రస్తుతం జిల్లాలో పంట ఆఖరి దశకు చేరుకున్న నేపథ్యంలో ఇప్పటికి పెద్దగా ఇబ్బందిలేక పోయినా నెల ప్రారంభం నుంచి  ఇప్పటివరకు అధిక భారం పడిందనే చెప్పాలి. డీఏపీ, కాంప్లెక్స్‌ల రూపంలో రైతులు భవిష్యత్తులో మరింత భారాన్ని మోయాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి.

ఈనాడు, ఏలూరు : జిల్లాలో ఖరీఫ్‌, రబీలు కలిపి సుమారు 10 లక్షల ఎకరాల్లో వరి సాగుచేస్తుండగా మరో 5 లక్షల ఎకరాల్లో ఇతర పంటలు  సాగవుతున్నాయి. సుమారు 5 లక్షల మంది రైతులు వ్యవసాయం చేస్తుండగా వీరంతా తమతమ పంటల్లో ఎరువులను వినియోగిస్తారు. వీరంతా కూడా మాటిమాటికి పెరుగుతున్న ఎరువుల ధరలతో ఆర్థిక భారాన్ని మోస్తున్నారు. కొద్దిరోజుల కిందట ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఎరువుల ముడి సరుకులపై జీఎస్టీ భారం పడటంతో ఎరువుల ధరలు పెరిగాయి. గతంలో డీఏపీ బస్తా రూ.1155 ఉండగా తాజాగా దీనిధర రూ. 1221  అయింది. అలాగే కాంప్లెక్స్‌ ఎరువులు ఆయా రకాలను బట్టి రూ. 873 నుంచి రూ. 930 వరకూ పెరిగాయి. మొత్తంగా చూస్తే ధరల పెరుగుదల బస్తాకు ఈస్థాయిలో పెరగడం వల్ల రైతులు ఆర్థిక భారం బాగా మోయాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. జిల్లాలో సంవత్సరానికి 2 లక్షల మెట్రిక్‌టన్నుల ఎరువులు వినియోగిస్తున్నారు. సరాసరిన టన్నుకు రూ. 13 వేలు పడితే సుమారు రూ. 318 కోట్లు ఎరువులపైనే రైతులు వెచ్చిస్తున్నారు. ప్రస్తుతం పెంచిన ధరలు వల్ల ప్రతీరైతు కచ్చితంగా ప్రతీ సీజన్‌లో పంటలను బట్టి రూ. వెయ్యి నుంచి రూ. 2500 వరకూ అదనపు భారం మోయాల్సిన పరిస్థితులు ఉన్నాయి. దీనివల్ల జిల్లావ్యాప్తంగా సుమారు రూ. 20 కోట్ల నుంచి రూ. 30 కోట్ల వరకూ  అదనపు భారం పడనుంది. జిల్లావ్యాప్తంగా పెరిగిన ధరలు ఫిబ్రవరి 1 నుంచి అమలులోకి రాగా పాత స్టాక్‌ను కూడా కొత్త దానితో కలిపి అమ్మకాలు చేస్తున్నారు.

తాజా వార్తలు

©2019 APWebNews.com. All Rights Reserved.