గీతంలో సాంకేతిక ఉత్సవం ప్రారంభం 

సాగర్‌నగర్‌, న్యూస్‌టుడే: గీతం డీమ్డ్‌ వర్సిటీలో ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ టెలీకమ్యూనికేషన్స్‌ ఇంజినీర్స్‌ (ఐఈటీఈ) విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో రెండు రోజులు జరగనున్న జాతీయస్థాయి సాంకేతిక ఉత్సవాన్ని శుక్రవారం ఎన్‌ఎస్‌టీఎల్‌ శాస్త్రవేత్త ఎస్‌.రాజా ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థులు ఎప్పటికప్పుడు సాంకేతికతలో నైపుణ్యం సాధిస్తూ... నూతన ఆవిష్కరణల వైపు దృష్టి సారించాలన్నారు. గీతం ఈసీఈ విభాగాధిపతి ఆచార్య పి.వి.వై.జయశ్రీ మాట్లాడుతూ విద్యార్థులకు ఈ ఉత్సవంలో కమ్యూనికేషన్‌, ఆర్కిటెక్చర్‌ తదితర పలు అంశాలపై పోటీలతో పాటు సదస్సులను నిర్వహిస్తామన్నారు. కార్యక్రమానికి హాజరైన ప్రముఖ ఇంద్రజాల నిపుణురాలు సుహాసిని షాను కళాశాల ప్రిన్సిపల్‌ ఆచార్య కె.లక్ష్మీప్రసాద్‌, వైస్‌ ప్రిన్సిపల్‌ సి.ధర్మరాజు సత్కరించారు. ఫ్యాకల్టీ సలహాదారు కె.కరుణకుమారి, విద్యార్థి విభాగం అధ్యక్ష, కార్యదర్శిలు జి.భరత్‌సాయి, గోపీనాథ్‌ పాల్గొన్నారు.

అప్పన్న సేవలో కేంద్ర ప్రత్యేక అధికారి 

సింహాచలం, న్యూస్‌టుడే: స్వచ్ఛభారత్‌, స్వచ్ఛపర్యావరణం కేంద్ర ప్రత్యేక అధికారి అర్చనమిత్తల్‌  శుక్రవారం అప్పన్న స్వామిని దర్శించుకున్నారు. ఆమెకు ఆలయ అధికారులు సంప్రదాయంగా స్వాగతం పలికారు. అనంతరం కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకుని, బేడ మండపం ప్రదక్షిణ చేశారు. అంతరాలయంలో స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఏఈవో ఆర్వీఏస్వీ ప్రసాద్‌ స్వామి ప్రసాదాన్ని ఆమెకు ఆందజేశారు. అనంతరం ఆలయ పరిసరాల్లో నిర్వహిస్తున్న స్వచ్ఛభారత్‌ కార్యక్రమాలను ఏఈవో, పారిశుద్ధ్య విభాగం సూపర్‌వైజర్‌ విక్రమ్‌లు వివరించారు.

సమకాలీన అంశాలపై అవగాహనతోనే సివిల్స్‌లో విజయం 
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ ఎం.బాల లత 

సాగర్‌నగర్‌: సమాజంలోని సమకాలీన అంశాలపై అవగాహన, లోతైన విశ్లేషణ, విస్తృత ఆలోచన ఉన్న వారికే సివిల్స్‌లో విజయం సొంతమవుతుందని భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖ డిప్యూటీ డైరెక్టర్‌, ఐఏఎస్‌ అధికారిణి ఎం.బాలలత పేర్కొన్నారు. గీతం డీమ్డ్‌ వర్సిటీ స్కూల్‌ ఆఫ్‌ గాంధీయన్‌ స్టడీస్‌ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన సివిల్స్‌ అవగాహన కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా విచ్చేశారు. సివిల్‌్్సలో సమాచార సేకరణ ఎంతో అవసరమని, వివిధ కోణాల నుంచి సమకాలీన రాజకీయ, భౌగోళిక, సామాజిక అంశాలను అర్థం చేసుకుని నోట్స్‌ తయారు చేసుకోవడమూ అంతే ముఖ్యమన్నారు. వర్సిటీ ప్రొ-వీసీ ఆచార్య కె.శివరామకృష్ణ, సంబంధిత విభాగం ఇంఛార్జి డైరెక్టర్‌ డాక్టర్‌ రోజిట్టా జోసఫ్‌ మాట్లాడుతూ బీఏ సోషల్‌ సైన్స్‌, ఎంఏ సైకాలజీ, ఇంగ్లీష్‌ కోర్సుల ద్వారా సివిల్‌ సర్వీస్‌ల్లో ప్రవేశానికి శిక్షణ ఇస్తున్నామన్నారు.

రైల్వే సమస్యలా...డీఆర్‌ఎంతోమాట్లాడండి... 
ప్రయాణికులకు ‘ఈనాడు-ఈటీవీ’ అవకాశం.. 

రైల్వే బోగీల్లో అపరిశుభ్రత.. భద్రతపరమైన ఇబ్బందులు.. వసతుల పరంగా అసౌకర్యాలు.. రైల్వే స్టేషన్లలో నెలకొన్న వివిధ సమస్యలు... రైళ్ల రాకపోకల్లో తేడాలు..  విశాఖలోని రైల్వే డివిజనల్‌ మేనేజర్‌ ఎం.ఎస్‌. మాథుర్‌ దృష్టికి తీసుకెళ్లాలనుకుంటున్నారా...? ఇందుకోసం ‘ఈనాడు-ఈటీవీ’ ఆయనతో మాట్లాడింది. ప్రయాణికుల సమస్యలను వినేందుకు ఆయన అంగీకరించారు. తన పరిధిలో ఉన్న ప్రతీ సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు. ప్రయాణికులకు ఇబ్బందికరంగా ఉన్న ఎలాంటి సమస్యలనైనా ఆయన దృష్టికి తీసుకెళ్లవచ్చు. ఆంగ్లం, హిందీ భాషల్లో అయితే ఆయనే నేరుగా సమస్యను విని సమాధానం చెబుతారు. తెలుగులో మాట్లాడేవారి కోసం సహాయకుల ద్వారా సమాధానం ఇప్పిస్తారు. సమస్యను క్లుప్తంగా చెప్పగలిగితే చాలు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు, విశాఖ పరిధిలోని ప్రయాణికులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. 
తేదీ: ఈ నెల 19న సోమవారం 
సమయం: ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు 
ఫోను నెంబరు: 08912575080

రూ. 40.04 కోట్లతో విశాఖలో తీరవృద్ధి పనులు 
పోర్టు ఛైర్మన్‌  ఎం.టి.కృష్ణబాబు 

ఈనాడు, విశాఖపట్నం: విశాఖ తీరంలో ఇసుక కోతల నిరోధానికి వీలుగా విశాఖ పోర్టు సామాజిక బాధ్యత కింద రూ. 40.04 కోట్ల వ్యయంతో తీరవృద్ధి (బీచ్‌ నరిష్‌మెంట్‌) కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పోర్టు ఛైర్మన్‌ ఎం.టి.కృష్ణబాబు పేర్కొన్నారు. శుక్రవారం ఆర్కే బీచ్‌రోడ్డులో తీరవృద్ధి పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గతేడాది ప్రారంభమైన పనుల్లో భాగంగా రూ. 11.09 కోట్లతో 1.51 మిలియన్‌ క్యూబిక్‌ మీటర్ల ఇసుకను తీరంలో వేసినట్లు తెలిపారు. సముద్రం లోపలి భాగంలో ఉన్న ఇసుకను గుర్తించి, తవ్వి తీసి తీరంలో వేసే పనులను ‘డ్రిడ్జింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా’ నిర్వర్తిస్తోందని పేర్కొన్నారు. గతేడాదితో పోలిస్తే ఈసారి మూడు లక్షల క్యూబిక్‌ మీటర్ల అధికంగా ఇసుకను తీరంలో పోసేలా పనులు సాగుతున్నాయని తెలిపారు. ఈ ఏడాది తీరవృద్ధి కార్యక్రమానికి రూ. 18.37 కోట్లు వ్యయం చేయనున్నట్లు వివరించారు. కురుసురా జలాంతర్గామి మ్యూజియం వద్ద కోత అధికంగా ఉన్నందున అక్కడే పనులు చేస్తున్నట్టు చెప్పారు. సాగర గర్భంలోని ఇసుకను తవ్వోడతో తవ్వి తీసి తీరంలో వేయడానికి వీలుగా 500 మీటర్ల పొడవైన నీటిలో తేలే పైపులైనును, 80 మీటర్ల స్టీల్‌ పైపులైనును వేసినట్లు తెలిపారు. ఈ పనులు వచ్చే నెల మొదటివారానికి పూర్తవుతాయని వెల్లడించారు. తీరంలో కోతల నివారణకు శాశ్వత ప్రాతిపదికన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం నెదర్లాండ్స్‌కు చెందిన డెల్టారిస్‌ అనే కన్సల్టెన్సీ సంస్థను నియమించిందని, అది వచ్చే నైరుతి రుతుపవనాల సీజన్‌లో అధ్యయనం చేసి నివేదిక ఇస్తుందని తెలిపారు. 

గురుద్వార (విశాఖపట్నం) Feb 6 2018: విద్యుత్‌ ఛార్జీల పెంపు ప్రతిపాదనపై నగరంలోని ఏపీఈపీడీసీఎల్‌ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ నియంత్రణ మండలి సమక్షంలో సోమవారం ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. మండలి ఛైర్మన్‌ భవానీ ప్రసాద్‌, సభ్యులు పి.రఘు, పి. రామ్మోహన్‌రావు పాల్గొని రైతులు, వినియోగదారుల నుంచి అభిప్రాయాలను సేకరించారు. అంతకుముందు సంస్థ సీఎండీ హెచ్‌.వై.దొర 2018-19గాను విద్యుత్‌ రిటైల్‌ సరఫరా ధరలపై ప్రవేశపెట్టనున్న ప్రతిపాదనలను చదివి వినిపించారు. సంస్థ ఛైర్మన్‌ భవానీ ప్రసాద్‌ మాట్లాడుతూ.. సంస్థ ఇచ్చిన ప్రతిపాదన ఆధారంగా ఈ ఏడాది విద్యుత్‌ఛార్జీలు పెంచడం లేదని స్పష్టం చేశారు. కేంద్ర విద్యుత్‌ చట్టం తమకిచ్చిన అధికారాలతో సంస్థలకు, వినియోగదారులకు నష్టం కలగకుండా చూస్తామన్నారు. ప్రజాభిప్రాయ సేకరణకు ఈపీడీసీఎల్‌ పరిధి నుంచి 48 అభ్యంతరాలు రాగా.. వీటిలో 15మంది మండలి ముందు స్వయంగా తమ అభిప్రాయాలను వెల్లడించారు. కార్యక్రమంలో రైతు సంఘాలు, పలు పార్టీల నాయకులు, సంస్థ అధికారులు పాల్గొన్నారు.

 

Page 5 of 5

తాజా వార్తలు

©2019 APWebNews.com. All Rights Reserved.